PRASHANT KISHORE TO MAKE BIG ANNOUNCEMENT ON FEBRUARY 18TH MAY BE ON HIS NEW POLITICAL PARTY AK
విజయాల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ పార్టీ పెడతారా ?.. 18న కీలక ప్రకటన
ప్రశాంత్ కిషోర్ (File)
ఢిల్లీలో ఆప్‌కు ఎన్నికల వ్యూహకర్తగా ఉన్న ప్రశాంత్ కిశోర్... ఆ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యేంతవరకు సైలెంట్‌గా ఉండాలని డిసైడయ్యారు. తాజాగా ఢిల్లీలో ఎన్నికలు పూర్తవడం... ఆప్ ఘనవిజయం సాధించడంతో అందరి దృష్టి ప్రశాంత్ కిశోర్‌పైనే నెలకొంది.
ఏపీలో వైసీపీ, ఢిల్లీలో ఆప్ విజయంలో కీలక పాత్ర పోషించిన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ రాజకీయ పార్టీ పెట్టబోతున్నారా ? బీహార్‌కు చెందిన ప్రశాంత్ కిశోర్... ఆ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించేందుకు సిద్ధమవుతున్నారా ? బీజేపీలోని జేడీయూ నుంచి బహిష్కరణ అనంతరం కొద్ది రోజులుగా సైలెంట్‌గా ఉన్న ప్రశాంత్ కిశోర్... ఈ నెల 18న చేయబోయే కీలక ప్రకటన ఏంటి ? ఇదే ఇప్పుడు దేశ రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఎన్నికల వ్యూహకర్తగా తాను సేవలు అందించే పార్టీలకు తిరుగులేని విజయాలను కట్టబెట్టడంలో సక్సెస్ సాధించిన ప్రశాంత్ కిశోర్‌కు ప్రత్యక్ష రాజకీయాల్లోనూ రాణించాలనే కోరిక ఎప్పటి నుంచో ఉంది.
ఈ కారణంగానే ఆయన తన సొంత రాష్ట్రమైన బీహార్‌కు చెందిన జేడీయూలో చేరారు. అయితే ఆ పార్టీ అధినేత, సీఎం నితీష్ కుమార్‌తో విభేదాల కారణంగా ఆ పార్టీ నుంచి బహిష్కరణకు గురయ్యారు. జేడీయూ నుంచి ప్రశాంత్ కిశోర్ బహిష్కరణకు గురైనప్పటి నుంచే ఆయన రాజకీయ అడుగులు ఎటు వైపు అనే చర్చ మొదలైంది. ఆయన నితీష్ ప్రత్యర్థి అయిన ఆర్జేడీకి మద్దతు ఇవ్వొచ్చనే ప్రచారం ఒకవైపు... ఆయనే సొంత పార్టీ పెడతారనే ఊహాగానాలు మరోవైపు చక్కర్లు కొట్టాయి.
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ప్రశాంత్ కిశోర్
అయితే ఢిల్లీలో ఆప్‌కు ఎన్నికల వ్యూహకర్తగా ఉన్న ప్రశాంత్ కిశోర్... ఆ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యేంతవరకు సైలెంట్‌గా ఉండాలని డిసైడయ్యారు. తాజాగా ఢిల్లీలో ఎన్నికలు పూర్తవడం... ఆప్ ఘనవిజయం సాధించడంతో అందరి దృష్టి ప్రశాంత్ కిశోర్‌పైనే నెలకొంది. ఆయన తదుపరి అడుగులు ఎటువైపు అనే అంశంపై చర్చ మొదలైంది. దీనిపై ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన చేసిన వ్యాఖ్యలు... దీనిపై మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
కేజ్రీవాల్‌తో ప్రశాంత్ కిశోర్
ఈ నెల 18న తాను ఓ పెద్ద ప్రకటన చేయబోతున్నానని ఆయన తెలిపారు. దీంతో ఆయన సొంతంగా రాజకీయ పార్టీ పెట్టబోతున్నారేమో అనే చర్చ మొదలైంది. ఈ ఏడాది చివర్లో బీహార్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో... ఆ దిశగా ప్రశాంత్ కిశోర్ ఇప్పటి నుంచే గ్రౌండ్ సిద్ధం చేసుకునే అవకాశం లేకపోలేదనే ప్రచారం కూడా సాగుతోంది. మొత్తానికి ఈ నెల 18న ప్రశాంత్ కిశోర్ చేయబోయే ఆ పెద్ద ప్రకటన ఏంటన్నది తెలియాలంటే మరో ఐదు రోజులు ఆగాల్సిందే.