news18-telugu
Updated: February 11, 2020, 3:25 PM IST
వైఎస్ జగన్, కేజ్రీవాల్(ఫైల్ ఫోటో)
ఢిల్లీలో అనుకున్నట్టే జరిగింది. ఆప్ అదరగొట్టింది. చీపురు పార్టీ ప్రత్యర్థులను ఊడ్చిపారేసింది. ఢిల్లీ వాసుల మనసు గెలుచుకున్నది ఒక్క కేజ్రీవాల్ మాత్రమే అని అసెంబ్లీ ఎన్నికల ఫలితాల సరళి మరోసారి చాటి చెప్పింది. దేశవ్యాప్తంగా బలంగా ఉన్న బీజేపీ హవాను తట్టుకుని ఢిల్లీ కోటలో మరోసారి కేజ్రీవాల్ పాగా వేయడం చిన్న విషయమేమీ కాదు. మోదీ మేనియా... అమిత్ షా మంత్రాంగాన్ని తట్టుకుని కేజ్రీవాల్ విజయఢంకా మోగించడం వెనుక ఎన్నో కారణాలు ఉన్నాయి. అయితే ఆ కారణాలన్నింటి వెనుక ఉన్న మాస్టర్ మైండ్ మాత్రం ఒక్కడే.
మొన్న ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జగన్‌కు తిరుగులేని రాజకీయ వ్యూహాలు అందించి ఘన విజయం దక్కేలా చేసిన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్... బీజేపీని అడ్డుకుని మరోసారి కేజ్రీవాల్ ఢిల్లీ పీఠం దక్కించుకోవడంలోనూ కీలక పాత్ర పోషించాడు. ఎన్నికల వ్యూహకర్తగా తనకు తిరుగులేదని మరోసారి నిరూపించాడు పీకే. లోక్ సభ ఎన్నికల్లో ఢిల్లీలోని మొత్తం 7 స్థానాలను బీజేపీ కైవసం చేసుకోవడంతో ఇక ఆప్ పనైపోయినట్టే అని చాలామంది భావించారు. మరికొన్ని నెలల్లో జరగబోయే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లోనూ లోక్ సభ తరహా ఫలితాలే రిపీట్ అవుతాయని బీజేపీ భావించింది.

కేజ్రీవాల్‌తో ప్రశాంత్ కిశోర్
కానీ కేజ్రీవాల్ ఇక్కడే ఓ తెలివైన నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల వ్యూహాల్లో ఆరితేరిన ప్రశాంత్ కిశోర్ సాయం తీసుకున్నారు. కేజ్రీవాల్ కోసం రంగంలోకి దిగిన ప్రశాంత్ కిశోర్... కేజ్రీవాల్ గెలుపు కోసం వ్యూహరచన చేశారు. మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం సహా అనేక అంశాల్లో ఆయనకు సలహా ఇచ్చారు. అంతేకాదు ఎన్నికల సమయంలో జాతీయవాదం తెరపైకి వచ్చేలా ఎలాంటి వ్యాఖ్యలు చేయకూడదని కేజ్రీవాల్ సహా ఆప్ నేతలకు పీకే గట్టిగా చెప్పినట్టు తెలుస్తోంది.
కేవలం ఢిల్లీలో తమ పార్టీ చేసిన అభివృద్ధిపై మాత్రమే ప్రజలకు వివరించాలని పీకే ఆప్‌కు సూచించారు. దీంతో పాటు ఆప్ అభ్యర్థుల ఎంపిక విషయంలోనూ కేజ్రీవాల్‌కు పీకే అనేక సలహాలు సూచనలు చేశారు. ఇప్పుడు ఢిల్లీలో ఆప్ ఘన విజయానికి కారణంగా అందరికీ కనిపించే కేజ్రీవాల్ అయితే... తెరవెనుక ఈ గెలుపులో కీలక పాత్ర పోషించింది ప్రశాంత్ కిశోర్ అనే చెప్పాలి.
Published by:
Kishore Akkaladevi
First published:
February 11, 2020, 9:50 AM IST