ప్రశాంత్ కిశోర్ ‘ఆపరేషన్ బెంగాల్’ షురూ...రేపటి నుంచే...

Prashant Kishor | తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో చర్చలు జరిపిన ప్రశాంత్ కిశోర్...2021 బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కోసం రాజకీయ వ్యూహాలు సిద్ధం చేయడానికి ఓకే చెప్పారు.

news18-telugu
Updated: July 20, 2019, 7:14 PM IST
ప్రశాంత్ కిశోర్ ‘ఆపరేషన్ బెంగాల్’ షురూ...రేపటి నుంచే...
ప్రశాంత్ కిషోర్ (File)
  • Share this:
ఏపీలో వైసీపీని అధికారంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్... ప్రస్తుతం పశ్చిమ బెంగాల్‌లో అధికార తృణమూల్‌ కోసం పని చేసేందుకు అంగీకారం తెలిపిన విషయం తెలిసిందే. ఇప్పటికే పలుసార్లు తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో చర్చలు జరిపిన ప్రశాంత్ కిశోర్...2021 బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కోసం రాజకీయ వ్యూహాలు సిద్ధం చేయడానికి ఓకే చెప్పారు. ఈ క్రమంలోనే అసలు బెంగాల్ ప్రజలు ఏం కోరుకుంటున్నారు ? టీఎంసీ కార్యకర్తల అభిప్రాయాలు ఎలా ఉన్నాయి ? అనే దానిపై అధ్యయనం చేయడానికి సిద్ధమవుతున్నారు ప్రశాంత్ కిశోర్ అండ్ టీమ్.

ఇందుకోసం జూలై 21న జరగబోయే బెంగాల్ అమరవీరుల దినోత్సవ ర్యాలీని ఎంచుకున్నారు. ఈ ర్యాలీలో పాల్గొనాల్సిందిగా ప్రశాంత్ కిశోర్‌కు అధికారిక ఆహ్వానం కూడా అందించారు టీఎంసీ నాయకులు. ఆదివారం జరగబోయే ర్యాలీలో ప్రశాంత్ కిశోర్‌తో పాటు ఆయన టీమ్ సభ్యలు పాల్గొనబోతున్నారు. అందులో పాల్గొనే ప్రజలు, పార్టీ కార్యకర్తల అభిప్రాయాలను తెలుసుకోనున్నారు. ప్రజల ఆలోచన ఏ విధంగా ఉందనే విషయాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయనున్నారు. గత రెండు మూడేళ్ల నుంచి జరిగిన ఈ ర్యాలీకి సంబంధించిన వీడియో ఫుటేజ్‌లు ప్రశాంత్ కిశోర్ పరిశీలించారు. ఇప్పటికే ప్రశాంత్ కిశోర్ టీమ్ సభ్యులు మారుమూల ప్రాంతాల్లోని టీఎంసీ కార్యకర్తలను కూడా కలిసి వారి అభిప్రాయాలను సేకరిస్తున్నారు.

2021 అసెంబ్లీ ఎన్నికల కోసం ప్రత్యేక వ్యూహాన్ని తయారు చేసేందుకు పీకే టీమ్ ప్రయత్నిస్తోంది.ఇప్పటివరకు ప్రశాంత్ కిశోర్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో మూడు సమావేశాలు నిర్వహించారు. పార్టీ వ్యూహాలు ఏ విధంగా ఉండాలనే దానిపై చర్చించారు. టీఎంసీ జిల్లా పార్టీ అధ్యక్షులతో జరిగిన సమావేశంలో వారికి అనేక సూచనలు చేశారు ప్రశాంత్ కిశోర్. ఆత్మవిశ్వాసం కోల్పోవద్దని... బీజేపీ లోక్ సభ ఎన్నికల్లో గెలిచినంత మాత్రాన అంతా అయిపోలేదని వారికి సూచించారు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో తమ తొలి అసెంబ్లీ ఎన్నికలు అన్నట్టుగా పోరాడాలని వారికి హితబోధ చేశారు.

ప్రతి ఏడాది జూలై 21న ఈ ర్యాలీని నిర్వహిస్తూ వస్తోంది తృణమూల్ కాంగ్రెస్. 1993లో అప్పటి లెఫ్ట్ ప్రభుత్వం జరిపిన కాల్పుల్లో 13 మంది యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు చనిపోవడంతో అప్పటి నుంచి ఈ ర్యాలీ నిర్వహిస్తున్నారు. అప్పట్లో మమతా బెనర్జీ యూత్ కాంగ్రెస్ కార్యకర్తగా ఉన్నారు. ఏప్రిల్ మే నెలలో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ 18 ఎంపీ స్థానాలు గెలుచుకుని బెంగాల్‌లో సత్తా చాటింది. 2014 ఎన్నికల్లో 34 లోక్ సభ స్థానాలు గెలచుకున్న తృణమూల్... 2019 ఎన్నికల్లో 22 సీట్లకు పడిపోయింది.


First published: July 20, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు