దేశ రాజకీయాల్లో నిత్యం చర్చలో ఉంటూ, 90 శాతానికిపైగా సక్సెస్ రేటు కలిగిన ఎన్నికల స్ట్రాటజిస్టు ప్రశాంత్ కిషోర్ (Election Strategist Prashant Kishor) తెలంగాణ రాజకీయాల్లో(Telangana Politics)కి ఎంటరైపోయారు. కొంత కాలంగా సీఎం కేసీఆర్ (CM KCR) కు అనధికార దూతగా కొనసాగుతోన్న నటుడు ప్రకాశ్ రాజ్ తో కలిసి ప్రశాంత్ కిషోర్ తెలంగాణలో విస్తృతంగా పర్యటించారు. టీఆర్ఎస్ కోసం పీకే పనిచేస్తారని కొద్ది రోజులుగా ఊహాగానాలు కొనసాగడం, పీకే టీమ్ సర్వే చేస్తోదని కేసీఆర్ స్వయంగా వెల్లడించిన క్రమంలో ఇప్పుడు పీకే బాహాటంగానే తన పని మొదలుపెట్టారు. ఎన్నికల సీజన్లవారీగా వివిధ రాష్ట్రాల్లో పనిచేసే ప్రశాంత్ కిషోర్ ప్రస్తుతానికి తెలంగాణలో కారెక్కేశారు. అయితే..
పబ్లిగ్గా పీకే టూర్లు..
రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కోసం ప్రశాంత్ కిషోర్ బృందం పనిచేయబోతోందనే సూట ప్రకటన లేకుండానే... తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు ప్రశాంత్ కిషోర్ టీమ్ ప్రణాళికలు సిద్ధం చేస్తోందని పార్టీ, ప్రభుత్వ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. దేశవ్యాప్తంగా దాదాపు అన్ని పార్టీల నేతలతో సఖ్యత, పనిచేసిన అనుభవమున్న పీకే.. దాదాపు తొలిసారి కేసీఆర్ తో కలిసి పనిచేస్తున్నారు. పేరుకు ఐపాక్ బృందంతో సంబంధం లేదని పీకే చెప్పుకున్నా.. తెలంగాణ గడ్డపై గడిచిన రెండు రోజులుగా ఆయన నేరుగా పర్యటిస్తున్నవైనాన్ని బట్టి విషయమేంటో అర్థం చేసుకోవచ్చు.
కేసీఆర్ కంటే పెద్ద వ్యూహకర్తా?
నటుడు ప్రకాశ్ రాజ్ శని, ఆదివారాల్లో తెలంగాణలోని పలు జిల్లాల్లో విస్తృతంగా పర్యటించారు. ఆయన వెంట ప్రశాంత్ కిషోర్ కూడా మల్లన్న సాగర్ ప్రాజెక్టును సందర్శించారు. సహజంగానే కేసీఆర్ కు వ్యూహకర్త అనే పేరుండగా, మళ్లీ ప్రశాంత్ కిషోర్ ను టీఆర్ఎస్ కు వ్యూహకర్తగా నియమించుకునే కంటే, పీకేకు మాత్రమే సొంతమైన విభిన్న డేటా సేకరణను, సర్వేలను జరిపించి, ఆ రిపోర్టుల మేరకు ఎన్నికల ప్రచారంలో పీకే సలహాలు తీసుకోవాలా? వద్దా? అనేది గులాబీ బాస్ భావనగా తెలుస్తోంది. ప్రశాంత్ కిషోర్-కేసీఆర్ కలయికకు సంబంధించి ఓ షాకింగ్ ట్విస్ట్ కూడా ఉంది..
గులాబీ బాస్ ‘పనికిమాలిన’ ప్రయత్నం?
తెలంగాణ సీఎం కేసీఆర్ కొంత కాలం కిందటే కేంద్రంపై, ప్రధాని మోదీపై యుద్దం ప్రకటించడం, కేంద్రం నుంచి బీజేపీని గద్దెదించడమే లక్ష్యంగా జాతీయ స్థాయిలో విపక్షాల ఏకీకరణకు నడుంబిగించడం తెలిసిందే. అందులో భాగంగానే కేసీఆర్ ఇటీవల ముంబై, అంతకుముందు చెన్నై పర్యటనలు చేశారు. రాబోయే రోజుల్లో కేసీఆర్ బెంగళూరుకు కూడా వెళ్లాల్సి ఉంది. కానీ జాతీయ స్థాయిలో విపక్షాల ఏకీకరణ, బీజేపీపై ఉమ్మడి పోరు విషయంలో కేసీఆర్ కు పూర్తి భిన్నమైన వైఖరి ప్రశాంత్ కిషోర్‌ది. అసలు విపక్షాల ఐక్యతంటూ కేసీఆర్ లాంటి నేతలు తీస్తోన్న రాగాలు పనికిమాలినవని కూడా పీకే వ్యాఖ్యానించారు.
బీజేపీకి వ్యతిరేక కూటమి కష్టమే
‘కేంద్రంలోని బీజేపీపై పోరాటంలో దేశంలోని విపక్ష పార్టీలన్నీ ఒక్కతాటిపైకి రావాలనే ఐడియాలోనే లోపం ఉంది. ప్రాంతీయ పార్టీలకు ఆయా రాష్ట్రాల్లో ప్రత్యర్థులుంటారు. కొన్ని సార్లు ఆ ఇద్దరికీ ఉమ్మడి శత్రువు బీజేపీనే అయి ఉంటుంది. మరి అలాంటప్పడు ప్రాంతీయంగా వైరుద్యం కొనసాగిస్తూ, జాతీయ స్థాయిలో మాత్రం ఐక్యత కావాలని కోరడం కంటే దారుణం ఇంకోటి ఉండదు. ఏవో కొన్ని అంశాలవారీగా విపక్షాల ఐక్యత సాధ్యమవుతుందే తప్ప, బీజేపీని దెబ్బతీయాలనే లక్ష్యంతోనే ఒక్కటైతే మాత్రం ఇసుమంతైనా లాభం ఉండదు’అని ప్రశాంత్ కిషోర్ ఇటీవలే ‘ది వైర్’ కోసం ప్రఖ్యాత జర్నలిస్ట్ కరణ్ థాపర్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు.
అసెంబ్లీ గట్టెక్కేదాకా జాతీయ పోరు తప్పదా?
అంటే, తెలంగాణలో టీఆర్ఎస్ కు ప్రత్యర్థి కాంగ్రెస్ అనుకుంటే, చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్-బీజేపీ ప్రత్యర్తులు. ఢిల్లీ స్థాయిలో బీజేపీపై కాంగ్రెస్ కూడా పోరాడుతోంది. కాంగ్రెస్ పార్టీతో అధికారం పంచుకుంటూ లేదా యూపీఏ కూటమిలో కొనసాగుతోన్న స్టాలిన్, తేజస్వీ యాదవ్, ఉద్ధవ్ ఠాక్రే, శరద్ యాదవ్ లు కాంగ్రెసేతర కూటమిలో చేరబోమని దాదాపు స్పష్టం చేసిన దరిమిలా.. ఆ విషయంలో పీకే వాదన కూడా భిన్నంగా ఉన్న క్రమంలో కనీసం అసెంబ్లీ ఎన్నికల వరకైనా కేసీఆర్ ఇక జాతీయ రాజకీయ అంశాల్లో ఎలా వ్యవహరిస్తారనేది ఉత్కంఠ రేపుతున్నది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CM KCR, Prakash Raj, Prashant kishor, Telangana, Trs