ఎన్నికలు అద్భుతం... ఈసిపై మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ప్రశంసలు

ప్రణబ్ ముఖర్జీ

ఎలక్షన్ కమిషన్ పక్షపాత ధోరణితో ఏకపక్షంగా వ్యవహరించిందన్న విపక్షాల ఆరోపణల నేపథ్యంలో ప్రణబ్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

  • Share this:
    కేంద్ర ఎన్నికల సంఘం పై మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రశంసల జల్లు కురిపించారు. ఎన్నికలు అద్భుతంగా నిర్వహించారని ఎన్నికల సంఘాన్ని కొనియాడారు. ఎన్నికల సంఘాన్ని విమర్శించవద్దని హితవు పలికారు. ఎన్నికల సంఘం బాగా పనిచేస్తోందన్నారు. సుదీర్ఘకాలంలో రాజ్యాంగ సంస్థలు నిర్మించబడ్డాయన్నారు ప్రణబ్.  చెడ్డ కార్మికుడు మాత్రమే పనిముట్లతో గొడవ పడతాడన్నారు. మంచి కార్మికుడు పనిముట్లను సజావుగా ఉపయోగిస్తాడని తెలిపారు ముఖర్జి. ఎన్నికల సంఘం పై విమర్శలు చేస్తున్న చంద్రబాబు, ఇతర కుహనా మేధావులకు చురకలంటించిన ప్రణబ్.ఢిల్లీలో జరిగిన ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈసీని ప్రశంసలతో ముంచెత్తారు.

    ప్రభుత్వ వ్యవస్థల్ని బలోపేతం చేయాలంటే అందరూ కలిసి కట్టుగా పనిచేయాలన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని ప్రణబ్ అన్నారు. ఎన్నికల అధికారులు విధి నిర్వాహణ సమర్థంగా వ్యవహరించినందున ప్రజాస్వామ్యం విజయవంతమైందని అభిప్రాయపడ్డారు. సుకుమార్ సేన్ నుంచి నేటి వరకు ఎలక్షన్ కమిషనర్ పదవిలో ఉన్న వ్యక్తులంతా ఎన్నికల నిర్వాహణను పటిష్టంగా చేపట్టారని ప్రణబ్ మెచ్చుకున్నారు.

    విమర్శకు అవకాశం లేకుండా ఎన్నికలు చాలా అద్భుతంగా నిర్వహించారని కితాబిచ్చారు. ఎలక్షన్ కమిషన్ పక్షపాత ధోరణితో ఏకపక్షంగా వ్యవహరించిందన్న విపక్షాల ఆరోపణల నేపథ్యంలో ప్రణబ్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. వాస్తవానికి ఎన్నికల నియమావళి ఉల్లంఘనలపై ఈసీ సరిగ్గా స్పందించలేదన్న విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఇప్పుడు ఈసీని ప్రశంసిస్తూ ప్రణబ్ వ్యాఖ్యలు చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

    First published: