Chandra Babu Naidu: కుప్పంలో ‘పవర్ కట్’ పాలిటిక్స్.. వైసీపీ పనేనంటూ టీడీపీ ఫైర్

చంద్రబాబు (ఫైల్ ఫోటో)

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ (YSR Congress), తెలుగుదేశం పార్టీ (Telugu Desham Party) నేతల మధ్య రాజకీయ యుద్ధం తారాస్థాయికి చేరింది.

 • Share this:
  ఆంధ్రప్రదేశ్ లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ నేతల మధ్య రాజకీయ యుద్ధం తారాస్థాయికి చేరింది. టీడీపీ జాతీయ అధ్యక్షు చంద్రబాబునాయుడు కుప్పం పర్యటన సందర్భంగా టెన్షన్ వాతావరణం నెలకొంది. చంద్రబాబును కుప్పం రానివ్వమని సవాల్ చేసిన వైసీపీ నేతలు.. ఆయన్ను అడ్డుకునేందుకు కూడా యత్నించారు. దీంతో కుప్పంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. మొదటిరోజు బాబు పర్యటన సాఫీగానే జరిగింది. ఐతే రెండో రోజు పర్యటన సందర్భంగా కలకలం రేగింది. చంద్రబాబు బస చేసిన కుప్పంలోని ఆర్ఆండ్బీ గెస్ట్ హౌస్ కు విద్యుత్ సరఫరా నిలిపివేయడం చర్చనీయాంశమైంది. గంటకుపైగా కరెంట్ లేకపోవడం, జనరేటర్ కూడా అందుబాటులో ఉంచకపోవడంతో అధికారులపై టీడీపీ నేతలు మండిపడ్డారు. చంద్రబాబు పర్యటనకు ఆటంకాలు సృష్టించేందుకే ప్రభుత్వం ఇలా వ్యవహరిస్తోందని ఆరోపించారు.

  చంద్రబాబు ఉన్న సమయంలోనే కరెంట్ కట్ చేయడం దారణమని.. ఇది కక్ష సాధింపు చర్యేనని టీడీపీ నేత, మాజీ మంత్రి అమరనాథ్ రెడ్డి మండిపడ్డారు. గెస్ట్ హౌస్ కు కావాలనే కరెంట్ కట్ చేశారన్న అమరనాథ్ రెడ్డి.. కనీసం జనరేటర్, బ్యాటరీ కూడా ఇవ్వలేదన్నారు. రాబోయే రోజుల్లో తాము కూడా షాక్ లు ఇస్తామంటూ హెచ్చరించారు. వైసీపీ ప్రభుత్వం టీడీపీ నేతలను ఇబ్బందులకు గురిచేస్తోందని.. చంద్రబాబు పర్యటనలో ప్రొటోకాల్ పాటించడం లేదన్నారు. గతంలో ఎప్పుడూ జరగని ఘటనలు ఇప్పుడు జరుగుతున్నాయని విమర్శించారు. ఐతే ఇది సాంకేతిక లోపం వల్ల జరిగిందా.. లేక మరేదైన కారణం వల్లా అనేది మాత్రం తెలియలేదు.

  మరోవైపు కుప్పంలో రెండోరోజు పర్యటిస్తున్న చంద్రబాబు నాయుడు మొదటిరోజు కుప్పం, గుడుపల్లె మండలాల నేతలతో సమీక్ష నిర్వహించారు. ఇవాళ శాంతిపురం మండలంలో పర్యటిస్తున్నారు. పంచాయతీ ఎన్నికల తర్వాత నియోజకవర్గంలో చోటు చేసుకున్న పరిస్థితులు, పార్టీ బలోపేతంపై స్థానిక నేతలతో చంద్రబాబు చర్చిస్తున్నారు. ఇక గురువారం జరిగిన కార్యకర్తల సమావేశంలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎంగా ఉన్నప్పుడు కార్యకర్తలను పట్టించుకోలేని మాట వాస్తవమేనని.. రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి పెట్టడం వల్ల కార్యకర్తలకు దూరమయ్యాయని.. వారికి ఎక్కువ సమయం ఇవ్వలేకపోయానని చెప్పారు. ఇకపై నిత్యం కార్యకర్తలతోనే ఉంటానన్న చంద్రబాబు.., అన్ని విషయాల్లో వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

  ఐతే చంద్రబాబు వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశమవుతున్నాయి. పంచాయతీ ఎన్నికల్లో కుప్పంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ అంతగా ప్రభావం చూపలేకపోవడంతో చంద్రబాబు రూటు మార్చారని రాజకీయ విశ్లేషకులంటున్నారు. మున్సిపల్, ఎంపీటీ, జడ్పీటీసీ ఎన్నికల్లో కార్యకర్తలు ఉత్సాహంగా పనిచేయాలనే ఉద్దేశంతోనే బాబు ఇళాంటి కామెంట్స్ చేసినట్లు అభిప్రాయపడుతున్నారు. కుప్పం నియోజకవర్గ పరిధిలోని 89 గ్రామపంచాయతీల్లో ఎన్నికలు జరగ్గా 75 చోట్ల వైసీపీ విజయం సాధించింది. దీంతో చంద్రబాబు స్వయంగా రంగంలోకి దిగి తన సొంత నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికలు రానున్న నేపథ్యంలో కుప్పం ప్రజలను తనవైపు తిప్పుకునే వ్యూహంలో భాగంగానే చంద్రబాబు కుప్పంలో పర్యటిస్తున్నట్లు తెలుస్తోంది.
  Published by:Purna Chandra
  First published: