ఏపీలో టీడీపీ ఎమ్మెల్సీ రాజీనామా, జగన్‌కు జై కొట్టిన మహిళా నేత

ఎమ్మెల్సీ పోతుల సునీత తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు శాసనమండలి చైర్మన్‌కు లేఖ రాశారు. జగన్ మోహన్ రెడ్డికి మద్దతు ప్రకటించారు.

news18-telugu
Updated: October 28, 2020, 5:47 PM IST
ఏపీలో టీడీపీ ఎమ్మెల్సీ రాజీనామా, జగన్‌కు జై కొట్టిన మహిళా నేత
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
Potula Sunitha: ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీకి షాక్ తగిలింది. మహిళా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఎమ్మెల్సీ పోతుల సునీత తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు శాసనమండలి చైర్మన్‌కు లేఖ రాశారు. ‘నేను నా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నాను. గత 15 మాసాలుగా ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ అనుసరిస్తున్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల ప్రజల ప్రయోజనాలకు వ్యతిరేకంగా అడుగడుగుగా కోర్టులను అడ్డుపెట్టుకుని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు, ఆయన కుమారుడు అడ్డుకుంటున్నారు. టీడీపీ వైఖరి రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ స్ఫూర్తికి తూట్టు పొడుస్తోంది. దీనికి నిరసనగా నా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నాను.’ అని లేఖలో పేర్కొన్నారు. మరోవైపు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి జై కొట్టారు పోతుల సునీత. ‘ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల అభివృద్ది లక్ష్యంగా కొనసాగిస్తున్న పాలనకు మద్దతుగా నిలవాలని రాజీనామా నిర్ణయం తీసుకున్నాను. నా రాజీనామాను ఆమోదించగలరు.’ అంటూ పోతుల సునీత తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు.

ఈ ఏడాది జనవరి 22న పోతుల సునీత టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరారు. ఏపీ శాసనమండలిలో పాలనా వికేంద్రీకరణ బిల్లులు, సీఆర్డీఏ రద్దు బిల్లులపై ఓటింగ్ జరిగిన సమయంలో టీడీపీకి ఆమె షాక్ ఇచ్చారు. టీడీపీ విప్‌‌కు వ్యతిరేకంగా పోతుల సునీత, శివనాథ్ రెడ్డి ఓటు వేశారు. అయితే, పోతుల సునీత మీద అనర్హత వేటు వేయాలంటూ శాసనమండలి చైర్మన్ షరీఫ్‌కు గతంలోనే టీడీపీ ఫిర్యాదు చేసింది. దీనిపై చైర్మన్ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. టీడీపీ పిటిషన్ మీద విచారణ జరుగుతున్న సమయంలోనే పోతుల సునీత ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు.

పోతుల సునీత రాజీనామా లేఖ


గతంలో డొక్కా మాణిక్య వరప్రసాద్ టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరారు. ఆయన్ను మరోసారి శాసనమండలికి పంపింది వైసీపీ అధిష్టానం. ఇక మూడు రాజధానులను వ్యతిరేకిస్తూ మరో టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి తన పదవికి రాజీనామా చేశారు. దీనిపై చైర్మన్ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. మరోవైపు టీడీపీ నుంచి ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు కూడా వైసీపీకి మద్దతు పలుకుతున్నారు. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్, చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం, గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ రావు, కొన్ని రోజుల క్రితం విశాఖ సౌత్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కూడా జగన్‌కు మద్దతు పలికారు. తమ కుమారులను వైసీపీలో చేర్చారు. అయితే, వారు తమ ఎమ్మెల్యే పదవులకు రాజీనామాలు చేయలేదు.

టీడీపీని బలహీనం చేసేందుకు వైసీపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రతిపక్షం ఎప్పుడైనా యాక్టివ్‌ అయితే, ఆ వెంటనే వైసీపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోందని, ఈ క్రమంలోనే పోతుల సునీత రాజీనామా చేశారనే వాదన వినిపిస్తోంది. మరోవైపు గతంలోనే శాసనమండలిని రద్దు చేస్తూ ఏపీ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసింది. ఈ బిల్లు ఢిల్లీలో పెండింగ్‌లో ఉంది.
Published by: Ashok Kumar Bonepalli
First published: October 28, 2020, 5:10 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading