(G. SrinivasaReddy,News18,Khammam)
ఈ సారి ఏదో ఒకటి తేలాల్సిందే.. ఎమ్మెల్సీ టికెట్ ఇస్తారో లేదో తేల్చుకోవాల్సిందే.. ఇస్తే ఓకే.. లేదంటే మన దారి మనం చూసుకోవాల్సిందే.. ముగ్గురు ఎమ్మెల్యేలతో కలసి సిట్టింగ్ ఎంపీ హోదాలో.. ఒక ప్రాంతీయ పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్న ఫళంగా రాష్ట్రాభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని పార్టీ మారితే.. తదుపరి ఎన్నికల్లో కనీసం సిట్టింగ్ టికెట్ ఇవ్వకపోయినా.. అయినా అధినేత పట్ల ఉన్న విధేయత.. పార్టీ కార్యనిర్వహక అధ్యక్షునితో ఉన్న అనుబంధం.. పార్టీ పట్ల ఉన్న కమిట్మెంట్కు విలువ ఇచ్చి ఓపికతో వేచిచూస్తున్నా పట్టించుకోకపోయినా.. ఇంకా పైపెచ్చు అడుగడుగునా అవమానాలు.. అందుకే ఈసారి ఏదో ఒకటి తేల్చుకోవాల్సిందే. అమీ తుమీ తేల్చుకోవాల్సిందే.. ఇదీ ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనుచర, అభిమానగణం మనోగతం.
ఒకేసారి ఎమ్యెల్యేల కోటా.. స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ రానున్న వేళ ఆశావహుల జాబితా చాంతాడంత పెరుగుతున్న సందర్భంలో ఈసారి తమ నేతకు ఎట్టి పరిస్థితుల్లోనూ అవకాశం ఇవ్వాల్సిందేనన్నది పొంగులేటి అనుచర గణం మాట. మరి పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ మనోగతం ఏంటి..? జిల్లా నుంచి ఎవరికి అవకాశం దక్కుతుందన్న విషయంలో ఎవరివకీ స్పష్టత లేని పరిస్థితి ఉంది.
పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఖమ్మం మాజీ ఎంపీ. సౌమ్యునిగా, కలుపుగోలు మనిషిగా ప్రజల్లో పేరున్న వ్యక్తి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో దాదాపు ప్రతి గ్రామంలోనూ తనకంటూ అభిమానులను సంపాదించుకున్న శ్రీనివాసరెడ్డి వైఖరి, నేటి రాజకీయాలకు 'ఓవర్ క్వాలిఫైడ్'గా విశ్లేషకులు చెబుతుంటారు. ఒక ప్రాంతీయ పార్టీలో ఇరక్కుపోయారన్న విమర్శ కూడా పొంగులేటి పైన ఉంది. అదే ఏదైనా ఒక జాతీయ పార్టీలో ఉండి ఉంటే ఆయన భవిష్యత్ మరోలా ఉండేదన్న చర్చ కూడా ఉమ్మడి జిల్లాలో ఉంది. ఒక సాధారణ కాంట్రాక్టరుగా జీవితాన్ని ప్రారంభించిన శ్రీనివాసరెడ్డి 2012లో వైఎస్సార్సీపీలో చేరి తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. తెలంగాణ ఉద్యమం అనంతరం కొత్త రాష్ట్రం ఏర్పాటైన వేళ వైసీపీ నుంచి ఖమ్మం ఎంపీగా తాను గెలవడమే కాకుండా, వైరా, పినపాక, అశ్వారావుపేట ఎమ్మెల్యేలను గెలిపించుకున్న చరిత్ర.
ఆ పార్టీకి రాష్ట్ర అధ్యక్షునిగా ఉంటూ అనంతర కాలంలో సీఎం కేసీఆర్ ఆహ్వానం మేరకు తెరాస పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు. తెరాసలో చేరేరోజు శ్రీనివాసరెడ్డి రాజకీయ భవిష్యత్తుకు నాది భరోసా అన్నది సీఎం కేసీఆర్ మాట. కానీ అనంతర కాలంలో జిల్లాలో చోటుచేసుకున్న పార్టీ అంతర్గత ఆధిపత్యపోరాటాలు, కుమ్ములాటల ఫలితం 2019 ఎన్నికల్లో తన సిట్టింగ్ స్థానాన్ని కూడా ఇవ్వకుండా మొండిచేయి చూపిన వైనం పార్టీ క్యాడర్ను తీవ్రంగా కలచి వేసిన సందర్భం. అయినా అధినేత పట్ల ఉన్న విశ్వాసంతో విధేయత చూపుతునే పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ వస్తున్నారు.
సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు సహా, స్థానిక సంస్థల ఎన్నికలు ఇలా దాదాపు అన్ని ఎన్నికల్లోనూ తన వనరులను దారాళంగా వెచ్చించినా పార్టీ పరంగా దక్కాల్సినంత గుర్తింపు, ఆదరణ దక్కడం లేదన్నది ఆయన అభిమానుల ఆవేదన. 2020లో ఖాళీ అయిన రాజ్యసభ స్థానాల్లో ఛాన్స్ వస్తుందని భావించినా అధినేత మొండిచేయి చూపించిన వైనం అప్పట్లో పెద్ద చర్చకు దారితీసింది.
అయితే ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చి మంత్రివర్గంలోకి తీసుకుంటారన్న చర్చ కూడా మధ్యలో జరిగినా ఎన్నికల షెడ్యూల్ విడుదల అనంతరం ఆశావహుల జాబితా క్రమంగా పెరుగుతుండడం, సామాజికవర్గాలను సమన్వయం చేయాల్సిన పరిస్థితి ఉండడం, ఇంకా పార్టీ పరంగా జిల్లాలో పలు వర్గాల మధ్య ఆధిపత్య పోరాటాలు.. వెరసి ఈసారైనా అవకాశం వస్తుందా లేదా అన్నది ఇప్పుడు జరుగుతున్న చర్చ. ప్రస్తుతం సిట్టింగ్గా ఉన్న బాలసాని లక్ష్మీనారాయణ మరోసారి తనకు అవకాశం ఇవ్వాలని గట్టిగా కోరుతుండగా, ఇంకా మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే జలగం వెంకటరావు, ప్రముఖ గ్రానైట్ వ్యాపారి వద్దిరాజు రవిచంద్ర అలియాస్ గాయత్రి రవిలు ఆశావహుల జాబితాలో ఉన్నారు.
ఒకవేళ ఇప్పుడున్నట్టు పద్దతిలో మరోసారి బీసీలకే ఛాన్స్ ఇవ్వాల్సి వస్తే బాలసాని లేదా గాయత్రి రవిలలో ఒకరికి ఛాన్స్ దక్కొచ్చన్నది చర్చ. కాకుండా వచ్చే సాధారణ ఎన్నికల దృష్ట్యా లోతుగా ఆలోచించి ఇవ్వాల్సి వస్తే పరిస్థితి మారే అవకాశం ఉంది. ఇక పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ మదిలో ఏముందో ఎవరికీ అంచనా అందని పరిస్థితి. అయితే ఈసారి అవకాశం కోసం అధినేతతో అమీతుమీ తేల్చుకోవాల్సిందేనన్నది మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై ఆయన అభిమానులు తెస్తున్న వత్తిడి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.