• HOME
 • »
 • NEWS
 • »
 • POLITICS
 • »
 • PONGULETI SRINIVAS REDDY RAJYA SABHA SEAT DEPENDS ON TRS WORKING PRESIDENT KTR BA

కేటీఆర్‌పైనే మాజీ ఎంపీ ఆశలు... పదవి వస్తుందా? రాదా?

కేటీఆర్‌పైనే మాజీ ఎంపీ ఆశలు... పదవి వస్తుందా? రాదా?

ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి( ఫైల్ ఫోటో)

తెలంగాణ కోటాలో వచ్చే నెలలో ఖాళీ కానున్న రెండు సీట్లలో ఒకటి పొంగులేటి దక్కనుందని చాణ్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది.

 • Share this:
  మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి భవితవ్యం ఏంటి..? త్వరలో ఖాళీ కానున్న రాజ్యసభ సీట్లలో అవకాశం లభిస్తుందా.. లేదా అన్న దానిపై ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని ఆయన అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఒకవేళ అవకాశం లభించకపోతే పరిస్థితి ఏంటన్న దానిపైనా చర్చ నడుస్తోంది. సామాన్య ప్రజానీకంతో మమేకమవుతూ ఆత్మీయంగా ఉండే తన వ్యవహారశైలితో చాలా తక్కువ కాలంలోనే ప్రజలకు దగ్గరయిన పొంగులేటి రాజకీయాల్లోకి వచ్చిన రెండేళ్లకే ఖమ్మం ఎంపీ అయ్యారు. వైఎస్ఆర్ సీపీ నుంచి తాను ఎంపీగా ఎన్నికవడమే కాకుండా.. ఉమ్మడి జిల్లా నుంచి మరో ముగ్గురు ఎమ్మెల్యేలను గెలిపించి తన సత్తాను చాటుకున్నారు. అయితే తదనంతర పరిణామాల్లో రాష్ట్ర విభజన.. వైసీపీ ఆంధ్రప్రదేశ్‌కు పరిమితం కావడం... తెలంగాణ అభివృద్ధి లక్ష్యంగా ఇక్కడి పార్టీ శాఖను టీఆర్ఎస్‌లో విలీనం చేయడం తెలిసిందే.

  No Ponguleti srinivasa reddy in jagan ktr meet, jagan ktr Khammam mp, kcr ponguleti srinivasa reddy, పొంగులేటి శ్రీనివాసరెడ్డి జగన్ కేటీఆర్, జగన్ కేటీఆర్ భేటీలో కనిపించిన ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి
  పొంగులేటి శ్రీనివాసరెడ్డి(Image: Facebook)


  టీఆర్ఎస్‌లో విలీనం సమయంలో సీఎం కేసీఆర్‌ తన రాజకీయ భవిష్యత్తుపై స్పష్టమైన హామీ ఇచ్చినా.. మారిన పరిస్థితుల్లో 2019 నాటి పార్లమెంట్ ఎన్నికల్లో పొంగులేటికి టికెట్‌ దక్కలేదు. దీనికి సామాజిక సమీకరణలు ఒక కారణమైతే... అంతకు ముందే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలో ఉద్దండులైన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, జలగం వెంకటరావు లాంటి వారు ఓటమి పాలవడానికి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పొషించిన పాత్ర కారణమని చర్చ జరగడం మరో కారణం. ఫలితంగా ఎంతో ప్రజాభిమానాన్ని కూడగట్టుకున్నా టికెట్‌ దక్కని దుస్థితి నెలకొంది. స్వతహాగా తాను కాంట్రాక్టర్‌ కావడం, వందల కోట్ల మేర బిల్లులు పెండింగ్‌లో ఉండడం, వేల కోట్ల మేర సాగునీటి ప్రాజెక్టులు నడుస్తుండడం మూలాన.. టికెట్‌ లభించకపోయినా.. పార్టీలో తన వర్గం నుంచి తీవ్రమైన వత్తిడి వచ్చినా ఎలాంటి తొందరపాటు ప్రదర్శించకుండా వేచిచూసే ధోరణిలోనే పొంగులేటి వ్యవహరించారు. ఎన్నికలు ముగిసినా ఎప్పటిలానే వారానికి మూడు రోజులు ఉమ్మడి జిల్లాలో తిరుగుతూ నిత్యం ప్రజలకు చేరువగానే ఉంటూ వస్తున్నారు.

  కేసీఆర్, పొంగులేటి


  కేటీఆర్‌ అండగా రాజ్యసభ సీటు దక్కేనా.. తెలంగాణ కోటాలో వచ్చే నెలలో ఖాళీ కానున్న రెండు సీట్లలో ఒకటి పొంగులేటి దక్కనుందని చాణ్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది. పార్టీలోని పొంగులేటి వర్గం, ఆయన అభిమానులు, శ్రేయోభిలాషులు ఈమేరకు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. రాజ్యసభ సభ్యుడు కేకే మరోసారి తనకు అవకాశం ఇవ్వాలని కోరుతుండగా, సీఎం కేసీఆర్‌ తనయ కవితకు అవకాశం దక్కుతుందని చెబుతున్నారు. వీరితో బాటుగా రకరకాల సామాజికవర్గ సమీకరణాలతో చాలామంది రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈసారి ఎట్టి పరిస్థితులలోనూ పొంగులేటికి రాజ్యసభ సీటు ఖాయమని ఆయన అభిమానులు ధీమాగా ఉన్నారు. పొంగులేటికి పార్టీ కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్‌ అండదండలు పుష్కలంగా ఉన్నాయి. రెండు రోజుల క్రితం ఖమ్మం నగరంలో జరిగిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి తనయుడు హర్ష రిసెప్షన్‌కు కేటీఆర్‌ ప్రత్యేకంగా హాజరయ్యారు. దాదాపు మూడు లక్షలకు పైగా భారీగా హాజరైన జనసందోహం శ్రీనివాసరెడ్డికి ఉన్న ప్రజాభిమానాన్ని మరోసారి చాటిచెప్పింది.

  ponguleti srinivas reddy,khammam ex mp,ponguleti son marriage in dubai,telangana news,పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి,ఖమ్మం మాజీ ఎంపీ,పొంగులేని శ్రీనివాస్ రెడ్డి కుమారుడి పెళ్లి
  కుమారుడి పెళ్లి వేడుకలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి


  పొంగులేటికి రాజ్యసభ ఇస్తే, మరి మరో సీనియర్‌ నేత తుమ్మలను ఎలా సంతృప్తి పరుస్తారన్న విషయం చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంలో జిల్లా మంత్రి అజయ్‌కుమార్‌ అభిప్రాయాన్ని కూడా సీఎం కేసీఆర్‌ పరిగణనలోకి తీసుకుంటారని చెబుతున్నారు. మరి ఆయన ఎటువైపు మొగ్గుతారో, ఎవరి అభ్యర్థిత్వానికి జై కొడతారో అన్న చర్చ కూడా ఉంది. అసలు ప్రాంతీయ పార్టీల్లో అభిప్రాయాలు అడగడం మాత్రమే ఉంటుందని.. నిర్ణయం ముందే జరిగిపోతుందన్న నిజాన్ని కూడా ఇక్కడ మరవకూడదు.

  ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఫైల్ ఫోటో..
  ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఫైల్ ఫోటో..(image:Facebook)


  ప్రస్తుతం పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావులు ఒకరికి పదవి ఇస్తే మరొకరు పార్టీకి దూరమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. సీనియారిటీ పరంగా తుమ్మలకు అవకాశం ఇద్దామని ఆలోచించినా, తుమ్మల పెద్దగా ఆసక్తి చూపడంలేదు. కొణ్నాళ్ల తర్వాతైనా మళ్లీ ఎమ్మెల్సీ అవకాశం కల్పించి మరోసారి మంత్రిగా అవకాశం కల్పించాలని కోరుతున్నారు. ఒకవేళ తుమ్మల కోరిక కొన్నాళ్లకైనా తీర్చే ఆలోచన అధినేత కేసీఆర్‌కు ఉంటే, పొంగులేటికి రాజ్యసభ దక్కే అవకాశాలు మెండుగా ఉన్నాయి. లేదంటే ప్రశాంతంగా ఉన్న ప్రస్తుత పరిస్థితులను కోరికోరి చెరుపుకునే ఆలోచన సీఎం కేసీఆర్‌ చేయకపోవచ్చు.

  పొంగులేటి ఓవర్‌ క్వాలిఫైడ్‌..?

  ప్రజాభిమానం, డబ్బు ఖర్చు చేయడం, ప్రజలతో మమేకమవడం, పాదరసంలా అల్లుకుపోవడం.. లాంటి లక్షణాలు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి నష్టంగా పరిణమిస్తున్నాయా..? అన్న చర్చ కూడా రెండు జిల్లాల్లో సాగుతోంది. పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో ఉండే సంబంధాలు, కడప జిల్లాకు చెందిన ఐవీఆర్సీఎల్‌ సంస్థ కుటుంబంతో అందుకున్న వియ్యం కూడా పొంగులేటి భవిష్యత్‌ బలాన్ని చాటుతోంది. దీంతో రోజురోజుకూ పెరుగుతున్న తన బలమే, రాజకీయాంగా అవకాశాలను దూరం చేస్తుందన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఏదిఏమైనా టీఆర్ఎస్ అధినాయకత్వం బలమైన నేతలకు అవకాశాలు కల్పించి పార్టీని మరింత బలోపేతం చేస్తుందా.. లేక మూస రాజకీయ ధోరణికి పరిమితం అవుతుందా అన్నది త్వరలోనే తేలనుంది.

  (జి.శ్రీనివాసరెడ్డి, ఖమ్మం, న్యూస్‌18 తెలుగు)
  Published by:Ashok Kumar Bonepalli
  First published: