• HOME
 • »
 • NEWS
 • »
 • POLITICS
 • »
 • PONGULETI SRINIVAS REDDY COMMENTS CREATES POLITICAL HEAT IN KHAMMAM TRS SU KMM

ఖమ్మం జిల్లా టీఆర్‌ఎస్‌లో ముసలం.. ఒక్కసారిగా బరస్ట్ అయిన మాజీ ఎంపీ.. అది హెచ్చరికేనా?

ఖమ్మం జిల్లా టీఆర్‌ఎస్‌లో ముసలం.. ఒక్కసారిగా బరస్ట్ అయిన మాజీ ఎంపీ.. అది హెచ్చరికేనా?

ప్రతీకాత్మక చిత్రం

ఖమ్మం జిల్లా రాజకీయాల్లో సౌమ్యుడు.. సహనశీలి.. ఎల్లప్పుడూ చెరగని చిరునవ్వుకు చిరునామాగా ఉన్న ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఒక్కసారిగా కోపం వచ్చింది. ఆయన ఆగ్రహం కట్టలు తెంచుకుంది.

 • Share this:
  ఖమ్మం జిల్లా రాజకీయాల్లో సౌమ్యుడు.. సహనశీలి.. ఎల్లప్పుడూ చెరగని చిరునవ్వుకు చిరునామాగా ఉన్న ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఒక్కసారిగా కోపం వచ్చింది. ఆయన ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఒక పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా ఉండి.. పార్టీని విలీనం చేసి ముగ్గురు ఎమ్మెల్యేలతో కలసి టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నా.. సిట్టింగ్‌నైన తనకు టికెట్‌ నిరాకరించి.. తన భవితవ్యంపై తేల్చకుండా నాన్చుతూ అదిగో ఇదిగో అంటూ ఊరిస్తున్న పార్టీ అధిష్టానాన్ని ఇప్పటిదాకా పల్లెత్తు మాట కూడా అనలేదు పొంగులేటి. అలాగే తన పుట్టినరోజున ఖమ్మంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించినా కూడా కిమ్మనని పొంగులేటి.. తాజాగా ఒక్కసారిగా బరస్ట్‌ అయ్యారు. బహుశా ఆయన తన రాజకీయ ప్రస్థానంలో ఇప్పటిదాకా ఏనాడూ ఎవరి పైనా ఈ స్థాయిలో విమర్శలు చేయలేదు. 'తాను ప్రజా ప్రతినిధిని కానని.. ఎవరికీ చెప్పి లేదా ఎవరి అనుమతి తీసుకుని పర్యటనలు చేయాల్సిన అవసరం లేదంటూ.. ప్రజాభిమానమే తనకు పదవి అంటూ.. వచ్చే రోజున ఏదీ ఆగదని, పోయేది చెప్పి పోదని చెప్పారు. తన అభిమానులను వేధించే ఎవరైనా దీనికి ప్రతిఫలం చెల్లించాల్సిందేనని, అదీ చక్రవడ్డీతో చెల్లిస్తారు' అని హెచ్చరించారు.

  తన పర్యటనలో తనను ఫాలో అవుతున్న పార్టీ కార్యకర్తలు, అభిమానులను టార్గెట్‌ చేస్తున్న టీఆర్‌ఎస్ నేతల తీరుపై పొంగులేటి విరుచుకుపడ్డారు. ఆయన వ్యాఖ్యల్లో ఒకింత వేదాంతం ధ్వనించినా.. అందులో హెచ్చరికలు దాగున్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ప్రతిపక్ష పార్టీలను సైతం విధాన పరంగా తప్ప వ్యక్తిగతంగా ఎన్నడూ టార్గెట్‌ చేయని పొంగులేటి తాజాగా అధికార పార్టీ ప్రజా ప్రతినిధులను లక్ష్యంగా చేసుకుంటూ హెచ్చరికలు జారీ చేయడంలో ఆంతర్యం ఏంటన్న చర్చ ఖమ్మం జిల్లా రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం హాట్‌ టాపిక్‌గా మారింది.

  ponguleti srinivas reddy, political heat in Khammam, Khammam TRS, TRS, ponguleti srinivas reddy Comments, KTR, Thummala Nageswara Rao, Nama Nageswara Rao, Puvvada Ajay Kumar, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, టీఆర్‌ఎస్, ఖమ్మం, కేటీఆర్, నామా నాగేశ్వరరావు, తుమ్మల నాగేశ్వరరావు, పువ్వాడ అజయ్ కుమార్
  ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి( ఫైల్ ఫోటో)


  అసలేంజరుగుతోంది..?
  కాంట్రాక్టర్‌గా ప్రస్థానం ప్రారంభించిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి దాదాపు రెండు దశాబ్దాల పాటు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు విశ్వసనీయునిగా మెలిగారు. అనంతరం 2013లో వైఎస్సార్‌సీపీలో చేరడం.. ఉమ్మడి జిల్లాలో వైఎస్‌ షర్మిలతో కలసి పాదయాత్ర చేయడం.. అనంతరం జరిగిన ఎన్నికల్లో ఖమ్మం ఎంపీగా విజయం సాధించారు. రాష్ట్ర విభజన ప్రభావాన్ని ఎదుర్కొని మరీ వైరా, అశ్వారావుపేట, పినపాక ఎమ్మెల్యేలను తన సొంత బలంతో గెలిపించుకోవడంతో పొంగులేటి ఇమేజ్‌ అనూహ్యంగా పెరిగింది. అనంతర పరిణామాలలో టీఆర్‌ఎస్‌లో చేరారు. జిల్లాల విభజన తర్వాత.. తనకంటూ ఒక ప్రత్యేకమైన శైలితో రెండు జిల్లాలలోనూ పటిష్టమైన అనుచరగణం, అభిమానులను సొంతం చేసుకున్నారు. అప్పటి మంత్రి తుమ్మలతో పొసగకపోయినా, తనకంటూ ఓ బలమైన వర్గాన్ని అన్ని నియోజకవర్గాల్లో గ్రామస్థాయికి విస్తరించగలిగారు.

  2018 చివర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క ఖమ్మం మినహా అన్ని స్థానాల్లో తమ ఓటమికి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కారణమంటూ ఓటమిపాలైన తెరాస నేతలంతా సీఎం కేసీఆర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో పార్లమెంట్‌ ఎన్నికల్లో సిట్టింగ్‌ అయినప్పటికీ ఆయనకు టికెట్‌ నిరాకరించి నామా నాగేశ్వరరావుకు ఇచ్చి గెలిపించే బాధ్యతను పొంగులేటికి అప్పగించారు. అయినా తనకు జరిగిన అవమానాన్ని దిగమింగుకుని పార్టీ కోసం పనిచేసి నామాను గెలిపించడంలో కీలక పాత్ర పోషించారు. లోక్‌సభ ఎన్నికల సమయంలో వేలాదిగా ఆయన నివాసానికి తరలివచ్చిన అభిమానులు తెగింపుతో ఏదో ఒక నిర్ణయాన్ని తీసుకోవాలని పదేపదే ఒత్తిడి చేసినా చలించకుండా.. మరోవైపు అటు కాంగ్రెస్‌, ఇటు బీజేపీలు పొంగులేటి కోసం చివరి నిమిషం దాకా ట్రాక్‌ చేసినా స్పందించకపోవడంపై ఇప్పటికీ అభిమానుల్లో అసంతృప్తి కనిపిస్తుంటుంది. సమయం చూసి రాజ్యసభకు పంపుతామన్న హామీ ఉండడంతోనే అప్పట్లో పొంగులేటి సంయమనం పాటించారన్న చర్చ కూడా జరిగింది. దీనికితోడు తనకు చెందిన ఇన్‌ఫ్రా సంస్థకు పెద్ద ఎత్తున కాంట్రాక్టులు ఉండడం.. వాటికి ఎలాంటి ఇబ్బందులు రాకూడదన్న కారణంగానే ఆయన వెనుకడుగు వేశారన్న ప్రత్యర్థుల విమర్శలకు పొంగులేటి చిరునవ్వుతోనే సమాధానం ఇస్తుంటారు.

  ponguleti srinivas reddy, political heat in Khammam, Khammam TRS, TRS, ponguleti srinivas reddy Comments, KTR, Thummala Nageswara Rao, Nama Nageswara Rao, Puvvada Ajay Kumar, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, టీఆర్‌ఎస్, ఖమ్మం, కేటీఆర్, నామా నాగేశ్వరరావు, తుమ్మల నాగేశ్వరరావు, పువ్వాడ అజయ్ కుమార్
  కేసీఆర్, పొంగులేటి (ఫైల్ ఫొటో)


  ఆగని ఆధిపత్యపోరు..
  ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన ఏడాదిన్నరకే ఎంపీగా గెలుపొందడం, మారిన పరిస్థితుల్లో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో ఉన్న సాన్నిహిత్యం వల్ల వైసీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షునిగా బాధ్యతలు అప్పగించడం.. అయినా సాగునీటి ప్రాజెక్టుల విషయంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై స్పందించి పార్టీ మారడంతో సీఎం కేసీఆర్‌కు సన్నిహితునిగా మారారు. అదే సమయంలో కేసీఆర్‌ కుటుంబంలో మంత్రులు కేటీఆర్‌, హరీష్‌రావుతో సైతం సాన్నిహిత్యం పెరిగింది. జిల్లాలో తన ప్రాపకాన్ని పెంచుకునే క్రమంలో సొంత పార్టీలో వర్గ రాజకీయాలకు తెరతీసి తుమ్మల, జలగం వెంకటరావు సహా ప్రభావవంతమైన నాయకులను నిలువరిస్తూ, తన వర్గాన్ని కాపాడుకుంటూ వచ్చారు.

  ఒకే ఒక్క ఎమ్మెల్యేగా గెలిచిన పువ్వాడ అజయ్‌కుమార్‌కు మంత్రి పదవి ఇవ్వడం.. అప్పటిదాకా తనతో ఉన్న కొందరు నాయకులు అనంతర పరిణామాల్లో అజయ్‌కుమార్‌ పక్షాన చేరడం పొంగులేటికి ఇబ్బందిగా మారింది. అయితే మాజీ మంత్రి తుమ్మలకు నమ్మకస్తునిగా పేరున్న డీసీసీబీ మాజీ ఛైర్మన్‌ విజయ్‌బాబు గత కొద్ది కాలంగా పొంగులేటితో కలసి తిరగడం సత్తుపల్లి నియోజకవర్గ రాజకీయాల్లో మంటలు రేపింది. దీంతో సహజంగానే రాజకీయ ఎత్తుగడల్లో ఆరితేరిన సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పొంగులేటి పర్యటనలపై కేటీఆర్‌కు ఫిర్యాదులు చేసినట్టు.. దీనిపై కేటీఆర్‌ పెద్దగా పట్టించుకోలేదని.. పైగా గత డిసెంబరు 7న జిల్లాలో పర్యటించిన కేటీఆర్‌ హెలిప్యాడ్‌ నుంచి నేరుగా పొంగులేటి నివాసానికి చేరుకుని.. అక్కడే బ్రేక్‌ఫాస్ట్‌ చేసిన సందర్భంలో ప్రోటోకాల్‌లో భాగంగా కలసిన జిల్లా ఉన్నతాధికారులకు మాజీ ఎంపీ పొంగులేటి అభ్యర్థనలను కన్సిడర్‌ చేయాలంటూ కేటీఆర్‌ సూచించడం.. తాజా రాజకీయ వేడికి కారణంగా చెబుతున్నారు. ఎన్నికల్లో పోటీ చేయకపోయినా రాజకీయంగా ప్రబల శక్తిగా మారిన పొంగులేటి ఏడాదిన్నరగా వారం వారం క్రమం తప్పకుండా ఉమ్మడి జిల్లాలో పర్యటిస్తూ తన ప్రాబల్యాన్ని పెంచుకుంటునే ఉన్నారు.

  కేటీఆర్‌ సీఎం అయితే..
  ఓ మంచి ముహూర్తం చూసి తనయుడు కేటీఆర్‌ను సీఎం చేయాలన్న కేసీఆర్‌ ఆలోచనలో ఉన్నాడనే ప్రచారం.. పొంగులేటి రాజకీయ భవితవ్యం టీఆర్‌ఎస్‌లో మరింత ప్రజ్వలం కాబోతోందన్న సంకేతాలు జిల్లాలో ఆయన అభిమానులకు వెళ్లిపోయాయి. త్వరలో ఖాళీ కానున్న ఎమ్మెల్సీ స్థానాన్ని ఇచ్చి, మంత్రి పదవి ఇస్తారన్న ప్రచారం ఊపందుకుంది. దీంతో సొంత పార్టీలోని పొంగులేటి రాజకీయ ప్రత్యర్థులు తాజాగా ఆయనను కార్నర్ చేశారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మరోవైపు కేటీఆర్‌తో సన్నిహిత సంబంధాలున్న పొంగులేటికి మంత్రి పదవి దక్కడం ఖాయం అన్న ప్రచారం జరుగుతోంది. ఫిబ్రవరిలోనో.. లేక శ్రీరామనవమి అనంతరం తనయుని పట్టాభిషేకానికి కేసీఆర్‌ ముహూర్తం పెట్టారన్న వార్తల నేపథ్యంలో తాజా రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.

  అయితే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రాజకీయ ప్రాబల్యం ఉన్న వ్యక్తిగా ఉన్న పొంగులేటిని గత కొద్దికాలంగా దూకుడు ప్రదర్శిస్తున్న బీజేపీ ట్రాక్‌ చేస్తోందని, ఆ పార్టీకి అవకాశం ఇవ్వకూడదన్న కోణంలోనే పొంగులేటికి ఆశలు పెడుతున్నారని, ఇవన్నీ ఆచరణరూపం దాల్చడం సాధ్యమేనా అన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఎవరెన్ని చెప్పినా, ఎన్నికోణాల్లో విశ్లేషించినా పొంగులేటి అవకాశాలను దెబ్బతీయలేరని ఆయన అభిమానులు ధీమాతో కూడిన విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆదివారం నాడు సత్తుపల్లిలో పర్యటించిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒకింత అసహనంతో కూడిన ఆగ్రహాన్ని ప్రదర్శించడం చర్చకు దారితీసింది.
  Published by:Sumanth Kanukula
  First published: