విజయనగరం జిల్లా రామతీర్థం ఆలయంపై దాడి ఘటన రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. ఇటు వైసీపీ.. అటు టీడీపీ సవాళ్లు ప్రతిసవాళ్లతో పొలిటికల్ హీట్ రేగుతోంది. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రామతీర్థం పర్యటనకు సిద్ధమవుతున్నారు. చంద్రబాబు రామతీర్థం వెళ్లి ఘటనాస్థలిని పరిశీలిస్తారని తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. రాష్ట్రంలో ఆలయాలపై దాడులు దురదృష్టకరమని చంద్రబాబు నాయుడు అన్నారు. అలయాలపై దాడులు జరుగుతున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. జగన్ ప్రభుత్వంలో దేవుళ్లకే రక్షణ లేకుండాపోయింది. ప్రభుత్వ అలసత్వం వల్లే దాడులు చోటు చేసుకుంటున్నాయి. కనకదుర్గమ్మ గుడిలో మాయమైన సింహాల ప్రతిమలు ఇప్పటికీ గుర్తించలేదు. అంతర్వేది రథంతగలబెట్టిన నిందితులను ఇప్పటికీ అరెస్ట్ చేయలేదని ఆయన విమర్శించారు. వైసీపీ అదికారంలోకి వచ్చిన హిందూ ధర్మాలకు, సాంప్రదాయాలకు కళ్లెం పడిందని చంద్రబాబు ఆరోపించారు.
మరోవైపు ఆలయాలపై జరుగుతున్న దాడులను ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామృష్ణారెడ్డి ఖండించారు. దాడులపై టీడీపీ అసత్య ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. ఆలయాలపై దాడులు చేయించి సీఎం జగన్ తన కన్ను తానే పొడుచుకుంటారా..? అని ఆయన ప్రశ్నించారు. రామతీర్థం ఘటన జరిగిన రెండు రోజులకే రాజమండ్రిలో మరో ఆలయలో విగ్రహం ధ్వంసం చేయడం వెనుక కుట్రకోణం ఉందని సజ్జల అనుమానం వ్యక్తం చేశారు. సీఎం జగన్ అందిస్తున్న జనరంజక పాలన నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. పోలీసుల విచారణలో నిజాలు బయటపడతాయని సజ్జల అన్నారు. అలాగే వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కూడా దాడుల వెనుక చంద్రబాబు, లోకేష్ హస్తముందని సంచలన ఆరోణలు చేశారు. దీనిపై స్పందించిన లోకేష్.. సీఎంకు దమ్ముంటే సింహాచలం ఆలయంలో ప్రమాణం చేసేందుకు రావాలని సవాల్ విసిరారు.
ఆలయాలపై దాడుల విషయంలో ప్రభుత్వ తీరును బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తప్పుబట్టారు. రాజమండ్రిలోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో విగ్రహ ధ్వంసం అంశాన్ని లేవనెత్తిన ఆయన.. ఇలా నిరంతరాయంగా దేవలయాలపై దాడులు జరుగుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు. రాష్ట్ర హోంమంత్రి శ్రీమతి సుచరిత గారు జరుగుతున్న దాడులను అరికట్టేందుకు ఎలాంటి చర్యలు తీసుకోకుండా ప్రేక్షక పాత్ర పోషించడం చూస్తుంటే ప్రభుత్వ చిత్తశుద్ధి ఏ రకంగా ఉందొ అర్ధం చేసుకోవచ్చని పేర్కొన్నారు. ప్రజాగ్రహం పెల్లుబిక్కకముందే పరిస్థితులను చక్కదిద్దాలి మరియు దోషులను కఠినంగా శిక్షించాలి.. లేని పక్షంలో త్వరలో రాష్ట్ర బీజేపీ ఆధ్వర్యంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
ఆలయాలపై దాడుల విషయంలో రాజకీయ దుమారం రేగడంతో ప్రభుత్వం విచారణను వేగవంతం చేసింది. నిందితులను పట్టుకొని కఠినంగా శిక్షిస్తామని తెలింది. అటు రామతీర్థం, ఇటు రాజమండ్రి ఆలయాలను ఇప్పటికే పరిశీలించిన పోలీసులు.. ప్రత్యేక బృందాలతో దర్యాప్తు సాగిస్తున్నారు.
Published by:Purna Chandra
First published:January 01, 2021, 18:06 IST