KCR Vs Amit Shah: కేసీఆర్ వర్సెస్ అమిత్ షా... మార్చిలో పొలిటికల్ వార్

సీఏఏకు వ్యతిరేకంగా హైదరాబాద్‌లో పెద్ద ఎత్తున సమావేశం ఏర్పాటు చేయాలని భావిస్తున్న కేసీఆర్‌కు అంతకంటే ముందే గట్టి కౌంటర్ ఇవ్వాలని బీజేపీ యోచిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

news18-telugu
Updated: February 20, 2020, 12:26 PM IST
KCR Vs Amit Shah: కేసీఆర్ వర్సెస్ అమిత్ షా... మార్చిలో పొలిటికల్ వార్
కేసీఆర్, అమిత్ షా(ఫైల్ ఫోటో)
  • Share this:
తెలంగాణ రాజకీయాల్లో టీఆర్ఎస్ ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్సే అయినా... కొంతకాలంగా బీజేపీ, టీఆర్ఎస్ మధ్యే రాజకీయ యుద్ధం ఎక్కువగా సాగుతోంది. బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంటడం... తెలంగాణలో బలహీనపడిన కాంగ్రెస్ స్థానాన్ని ఆక్రమించాలని ప్రయత్నిస్తుండటం కూడా ఇందుకు కారణమని చెప్పొచ్చు. భవిష్యత్తులో బీజేపీతో తమకు ఎక్కువగా ముప్పు ఉంటుందని భావిస్తున్న టీఆర్ఎస్... బీజేపీని ఎదుర్కోవడానికి తమవంతు వ్యూహాలను సిద్ధం చేసి పెట్టుకుంటోంది. ఈ క్రమంలోనే కేంద్రం తీసుకొచ్చిన సీఏఏ చట్టాన్ని వ్యతిరేకించాలని నిర్ణయించిన తెలంగాణ అధికార పార్టీ... ఇందుకోసం అసెంబ్లీలో తీర్మానం చేయాలని కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.

అయితే టీఆర్ఎస్ తీసుకున్న ఈ నిర్ణయం కారణంగా మరోసారి కేసీఆర్ వర్సెస్ అమిత్ షా మధ్య పొలిటికల్ వార్ జరిగే అవకాశం ఉందని ఊహాగానాలు మొదలయ్యాయి. వచ్చే నెలలో జరగబోయే బడ్జెట్ సమావేశాల్లోనే సీఏఏకు వ్యతిరేకంగా తీర్మానం చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై అసెంబ్లీలో చర్చ జరిగితే... సీఎం కేసీఆర్ కేంద్రాన్ని తనదైన శైలిలో విమర్శించే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. అయితే కేసీఆర్ ఈ విషయంలో తమను టార్గెట్ చేయడానికి ముందుగానే ఆయనను కార్నర్ చేయాలని బీజేపీ భావిస్తోంది.

ఇందుకోసం తెలంగాణ బడ్జెట్ సమావేశాలకు ముందుగానే హైదరాబాద్‌లో సీఏఏ అనుకూల సభను భారీ ఎత్తున నిర్వహించాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది. మార్చి 15 ఈ మేరకు ఎల్బీ స్టేడియంలో సభను ఏర్పాటు చేయడానికి బీజేపీ సన్నాహాలు చేస్తోంది. కేంద్ర హోంమంత్రి, బీజేపీ మాజీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఈ సమావేశానికి హాజరవుతారని తెలుస్తోంది. ఆయనే సీఏఏ విషయంలో కేసీఆర్‌పై పదునైన విమర్శనాస్త్రాలు సంధిస్తారని సమాచారం.

సీఏఏకు వ్యతిరేకంగా హైదరాబాద్‌లో పెద్ద ఎత్తున సమావేశం ఏర్పాటు చేయాలని భావిస్తున్న కేసీఆర్‌కు అంతకంటే ముందే గట్టి కౌంటర్ ఇవ్వాలని బీజేపీ యోచిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికి అటు బీజేపీ, ఇటు టీఆర్ఎస్ వ్యూహాలను చూస్తుంటే... మార్చిలో కేసీఆర్, అమిత్ షా మధ్య పొలిటికల్ వార్ ఖాయంగా కనిపిస్తోంది.






First published: February 20, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు