POLITICAL STRATEGIST PRASHANTH KISHORE MEETS YS JAGAN DISCUSSED ABOUT TEMPLE POLITICS PRN
YS Jagan: పీకేతో సీఎం జగన్ సీక్రెట్ మీటింగ్..! అసలు కారణం అదేనా..?
సీఎం జగన్ తో ప్రశాంత్ కిషోర్ (ఫైల్)
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రంలో విగ్రహాల రాజకీయం ముదిరిన నేపథ్యంలో ప్రతిపక్షాలు అధికార పార్టీని టార్గెట్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YSR Congress) డ్యామేజ్ కంట్రోల్ పై దృష్టి పెట్టింది.
రాష్ట్రంలో విగ్రహాల రాజకీయం ముదిరిన నేపథ్యంలో ప్రతిపక్షాలు అధికార పార్టీని టార్గెట్ చేస్తున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిర్లక్ష్యంతోనే హిందూ ఆయాలపై దాడులు జరుగుతున్నట్లు ప్రధాన ప్రతిపక్షం తెలుగు దేశం పార్టీతో పాటు జనసేన, బీజేపీలు ఆరోపిస్తున్నాయి. అంతేకాకుండా సీఎం జగన్ మతాన్ని ఉదాహరణగా చూపిస్తూ రాష్ట్రంలో హిందువులకు రక్షణ లేదని.., ప్రస్తుత పరిస్థితికి సీఎం వైఖరే కారణమనే ఆరోణపలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నాయి. అటు ప్రభుత్వం కూడా ప్రతిపక్ష పార్టీలకు తనదైన స్టైల్లో కౌంటర్లు ఇస్తోంది. విగ్రహాలపై దాడులకు టీడీపీనే కారణమని చెప్పే ప్రయత్నం చేస్తున్నా.., ప్రతిపక్షాలు వైసీపీపై హిందుత్వ వ్యతిరేక ముద్ర వేస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి., మరో సారి తన పొలిటికల్ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తో భేటీ అయ్యారు.
ప్రశాంత్ కిషోర్ పర్యటనను ప్రభుత్వం అత్యంత గోప్యంగా ఉంచింది. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో జగన్ ను ప్రశాంత్ కిషోర్ బేటీ అవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇద్దరి మధ్య తాజా రాజకీయ పరిస్థితులు, ఆలయాలపై దాడుల అంశంలో ప్రభుత్వం, పార్టీపై ప్రభావంతో పాటు పలు కీలక అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాలపై దాడులు జరగడం, ఈ విషయంలో ప్రతిపక్షాలు అధికార పార్టీనే టార్గెట్ చేస్తుండటంతో దాని ప్రభావం వైసీపీపై ఎలా ఉంది. విగ్రహాల రాజకీయంతో జరిగిన నష్టాన్ని ఎలా భర్తీ చేయాలనే విషయంలో సీఎం జగన్.. ప్రశాంత్ కిషోర్ సాయం కోరినట్లు సమాచారం.
2019 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రశాంత్ కిషోర్ వ్యూహకర్తగా పనిచేశారు. పార్టీ మేనిఫెస్టోతో పాటు టీడీపీ వైఫల్యాలను సోషల్ మీడియా ద్వారా క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లారు. ముఖ్యంగా నవరత్నాల పేరుతో రెండు పేజీల మేనిఫెస్టో, బై.. బై.. బాబు అంటూ చంద్రబాబు ఓటమి ఖాయమంటూ ప్రచారాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ప్రశాంత్ కిషోర్ సక్సెస్ అయ్యారు. పీకే వ్యూహాలతోనే ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే వైఎస్ఆర్సీపీ అఖండ విజయాన్ని సాధించింది. పార్టీ వ్యూహాలను సమర్ధవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడమే కాకుండా, ప్రత్యర్థులకు అదే స్థాయిలో కౌంటర్లు ఇవ్వడంలో పీకే దిట్ట.. అందుకే విగ్రహాల రాజకీయంలో ప్రభుత్వానికి పెద్ద నష్టం జరగకుండా సరైన వ్యూహాన్ని అమలు చేయాలని జగన్ కోరినట్లు తెలుస్తోంది.
విగ్రహ రాజకీయాలతో పాటు తిరుపతి ఉప ఎన్నిక, త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు వస్తే ఎలా ముందుకెళ్లాలనే అంశంపై చర్చ జరిగినట్లు సమాచారం. అత్యంత గోప్యంగా జరిగిన ఈ భేటీలో సీఎం జగన్ తో పాటు పార్టీకి చెందిన కీలక నేతలు పాల్గొన్నట్లు తెలుస్తోంది.