POLITICAL SITUATION CHANGED AFTER SURGICAL STRIKE CONGRESS TRYING ALLIANCE WITH SP BSP PS
సర్జికల్ స్ట్రైక్స్‌తో యూపీలో మారిన రాజకీయం.. ఎస్పీ, బీఎస్పీలతో కాంగ్రెస్ పొత్తు?
మాయావతి, రాహుల్ గాంధీ, అఖిలేశ్ యాదవ్
పుల్వామా దాడులకు ప్రతీకారంగా భారత వాయుసేన పాకిస్తాన్‌లోని ఉగ్రస్థావరాలపై జరిపిన సర్జికల్ స్ట్రైక్‌ను యావత్ దేశం ప్రశంసింది. ఇక, ప్రస్తుతం కేంద్రంలో ఉన్నది బీజేపీ ప్రభుత్వం కాబట్టి.. ఎంతో కొంత క్రెడిట్ ఆ పార్టీ ఖాతాలోకి వెళ్లిపోయింది. దీంతో దేశంలోని రాజకీయ పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి.
పుల్వామా దాడులకు ప్రతీకారంగా భారత వాయుసేన పాకిస్తాన్‌లోని ఉగ్రస్థావరాలపై జరిపిన సర్జికల్ స్ట్రైక్‌ను యావత్ దేశం ప్రశంసింది. ఇక, ప్రస్తుతం కేంద్రంలో ఉన్నది బీజేపీ ప్రభుత్వం కాబట్టి.. ఎంతో కొంత క్రెడిట్ ఆ పార్టీ ఖాతాలోకి వెళ్లిపోయింది. దీంతో దేశంలోని రాజకీయ పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. అందుకు అనుగుణంగానే విపక్షాలు.. అధికార బీజేపీని ఎదుర్కొనేందుకు వ్యూహాలు మార్చుతున్నాయి. ముఖ్యంగా ఢిల్లీ పీఠానికి దగ్గరి దారిగా చెప్పబడే యూపీలో.. కాంగ్రెస్‌ను పట్టించుకోకుండా ఇప్పటికే పొత్తులు ఖరారు చేసుకున్న ఎస్పీ, బీఎస్పీలు పునరాలోచనలో పడినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ కూడా ఆ రెండు పార్టీలతో పొత్తుకోసం ప్రయత్నాలు మొదలెట్టినట్టు తెలుస్తోంది. యూపీలో ఎంపీ అభ్యర్థుల లిస్టును అన్ని పార్టీల కంటే ముందే ప్రకటించాలనుకున్న కాంగ్రెస్ పార్టీ... ఇప్పుడు ఆ ఆలోచనకు బ్రేక్ వేసినట్టు తెలుస్తోంది. ఎస్పీ, బీఎస్పీలతో కలిసి పొత్తుకు వెళ్లాలని కాంగ్రెస్ సారథి రాహుల్ గాంధీ ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఇటీవల కాంగ్రెస్‌ను లెక్కలోకి తీసుకోకుండా కేవలం రెండు సీట్లు మాత్రం వదిలేసి.. చెరో 38 స్థానాల్లో పోటీ చేయాలని ఎస్పీ, బీఎస్పీలు నిర్ణయించాయి. అయితే, దీనిపై కాంగ్రెస్ పార్టీ సీరియస్‌గానే తీసుకుంది. ప్రియాంక గాంధీని రంగంలోకి దింపింది. ఆ రెండు పార్టీలకు చెందిన పలువురు నేతలను తమ పార్టీలో చేర్చుకుంది. 80 లోక్‌సభ స్థానాల్లో ఒంటరిగానే బరిలో నిలవాలని నిర్ణయించింది. అయితే, ఇప్పడు సర్జికల్ స్ట్రైక్స్ కారణంగా రాజకీయ ముఖచిత్రం మారిపోవడంతో.. ఒంటరిగా వెళ్లడం కంటే ఎస్పీ, బీఎస్పీలతో కలిసి వెళ్లడమే శ్రేయస్కరమని కాంగ్రెస్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి తెరవెనుక చర్చలు కూడా సాగుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. అటు ఎస్పీ, బీఎస్పీలు సైతం కాంగ్రెస్‌తో కలిసి వెళ్లడమే మంచిదనే ఆలోచనకు వచ్చాయని తెలుస్తోంది.
జాయింట్ ప్రెస్ మీట్లోమాయావతి, అఖిలేష్ యాదవ్ ఫైల్ ఫోటోస్
కాంగ్రెస్ పార్టీని తమ కూటమిలో చేర్చుకోవడం వల్ల.. తమ ద్వారా కాంగ్రెస్‌కు జరిగే లాభమే తప్ప, కాంగ్రెస్ వల్ల తమకు ఒరిగే లాభమేమీ ఉండదని బీఎస్పీ అధినేత్రి మాయావతి గతంలో వ్యాఖ్యానించారు. అయితే ఇప్పుడు పరిస్థితులు మారిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి రాయ్ బరేలీ, అమేథీలతో కలిసి 10 స్థానాలు కేటాయిస్తే మంచిదనే అభిప్రాయం రెండు వైపులా వినిపిస్తోంది. అది కూటమికి కలిసొస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.