POLITICAL DISCUSSION OVER JR NTR POLITICAL ENTRY IN ANDHRA PRADESH PRN
Jr.NTR: జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ.. కలకలం రేపుతున్న ఫ్లెక్సీలు..!
ప్రకాశం జిల్లాలో టీడీపీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రకాశం జిల్లా ( Prakasham District)లో రాజకీయ దుమారం రేగింది. ఏపీకి కాబోయో ముఖ్యమంత్రి జూనియర్ ఎన్టీఆర్ (Jr.NTR) అంటూ ఫ్లెక్సీలు వెలిశాయి.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన ఎప్పుటూ ఉంటూనే ఉంటుంది. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని టీడీపీ కార్యకర్తలతో పాటు నందమూరి కుటుంబ అభిమానుల బలమైన కోరిక. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ గురించి పుకార్లు షికార్లు చేస్తూనే ఉంటాయి. ఎన్నికలు వచ్చినప్పుడైతే ఇంకేముంది ఎన్టీఆర్ రంగంలోకి దిగబోతున్నట్లు ప్రచారం జరుగుతుంటుంది. ఇప్పుడు మరోసారి ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ హాట్ టాపిక్ గా మారింది. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం లో ఏపీ నెక్స్ట్ సీఎం జూనియర్ ఎన్టీఆర్ అంటూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు కలకలం సృష్టిస్తున్నాయి. నూతన సంవత్సర శుభాకాంక్షలతో టీడీపీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో ఎన్టీఆర్ ఫోటోతో పాటు కాబోయే ముఖ్యమంత్రి అని రాశారు.
ఫ్లెక్సీలపై చిన్నరాముడు ఫోటోలతో పాటు టీడీపీ నేతల ఫోటోలు కూడా ఉన్నాయి. జిల్లా రాజకీయాల్లో ఈ ఫ్లెక్సీలపై దుమారం రేగుతోంది. వీటిని చూసి టీడీపీ కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తుండగా.. ఇతర పార్టీల వారు మాత్రం కార్యకర్తల అత్యుత్సాహమని అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో ఈ ఫ్లెక్సీలే హాట్ టాపిక్ గా మారాయి. తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు తర్వాత బలమైన నాయకుడు ఎవరని ప్రశ్నిస్తే.. ఆ పార్టీ నేతలు టక్కున జూనియర్ ఎన్టీఆర్ అని చెప్పేస్తారు. ఎన్టీఆర్ ఒక్కడే టీడీపీని గట్టెక్కించగలడని చాలా సార్లు బహిరంగంగానే ప్రకటించిన సందర్భాలున్నాయి. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓటమి పాలైన తర్వాత ఎన్టీఆర్ అవసరం పార్టీకి చాలా ఉందని కొంతమంది నేతలు వ్యాఖ్యానించారు. పార్టీ పూర్వవైభవం ఎన్టీఆర్ తోనే సాధ్యమని కూడా చెప్పారు. కానీ ఈ డిమాండ్లపై అటు ఎన్టీఆర్ గానీ.. ఇటు చంద్రబాబు గానీ స్పందించలేదు.
ప్రకాశం జిల్లా, ఎర్రగొండపాలెెంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ
ఐతే యాక్టివ్ పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇవ్వడంపై ప్రశ్నించిన ప్రతిసారీ ఎన్టీఆర్ మాత్రం మౌనంగానే ఉంటున్నారు. అప్పుడప్పుడు మాత్రం తెలుగుదేశం పార్టీ తమదేనని.. ప్రత్యేకంగా చేరాల్సిన అవసరం ఏముందని కామెంట్ చేశారు. 2009 ఎన్నికల సమయంలో మాత్రం టీడీపీకి మద్దతుగా ఎన్టీఆర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఐతే అప్పట్లో ఎన్టీఆర్ ప్రచారం చేసిన చోట పార్టీకి ఓటమే ఎదురైంది. ఓవరాల్ గా ఎన్నికల్లో టీడీపీ ఓటమి పాలవడంతో రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.
ఐతే టీడీపీ అధినేత చంద్రబాబునాయుడే ఎన్టీఆర్ ను ఎన్నికల కోసం వాడుకొని వదిలేశారన్న విమర్శలు కూడా ఉన్నాయి. ప్రస్తుత వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న కొడాలి నాని, ఎమ్మెల్యే వల్లభనేని వంశీ లాంటి వారు కూడా ఇదే విషయాన్ని పలుసార్లు లేవనెత్తారు. తన కుమారుడు లోకేష్ కోసమే చంద్రబాబు.. ఎన్టీఆర్ ను పక్కనబెట్టారని నాని, వంశీ ఆరోపించారు. ఐతే ఈ విమర్శలపై ఎన్టీఆర్ ఇంతవరకూ స్పందించకపోయినా తెలుగుదేశం పార్టీకి మాత్రం అంటీ ముట్టనట్లుగానే వ్యవరిస్తూ వస్తున్నారు.
కొన్నాళ్లుగా టీడీపీలో నాయకత్వ మార్పుపై గట్టిగానే చర్చ సాగుతోంది. నాయకత్వ మార్పు జరగాల్సిందేనని కార్యకర్తలు, ద్వితీయశ్రేణి నాయకులు డిమాండ్ చేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ పేరుతో ఫ్లెక్సీలు పెట్టడం ఆసక్తికరంగా మారింది. కాగా జూనియర్ ఎన్టీఆర్ మామ నార్నే శ్రీనివాసరావు 2019 ఎన్నికల ముందు వైసీపీ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే..
Published by:Purna Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.