జూనియర్ ఎన్టీఆర్‌ను టీడీపీ దూరం పెడుతున్నది అందుకేనా..?

2009లో జూనియర్ ఎన్టీఆర్‌తో ప్రచారం చేయించుకున్న అదే పార్టీ ఇప్పుడు ఆయన అవసరం లేదని అనడం ఎంత వరకు కరెక్ట్ అని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు.

news18-telugu
Updated: November 18, 2019, 10:17 AM IST
జూనియర్ ఎన్టీఆర్‌ను టీడీపీ దూరం పెడుతున్నది అందుకేనా..?
జూనియర్ ఎన్టీఆర్ (jr ntr TDP)
  • Share this:
ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. టీడీపీ నేతలు సొంత పార్టీపైనే విమర్శలు గుప్పిస్తూ పార్టీని వీడుతున్నారు. ఏకంగా పార్టీ అధినేత తనయుడిపైనే వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. దీంతో ఎన్నడూ లేనంతగా పార్టీలో అభిప్రాయబేధాలు తారా స్థాయిలో బయటపడుతున్నాయి. వాస్తవానికి, టీడీపీ అధికారం కోల్పోయినప్పటి నుంచే ఆ పార్టీకి గడ్డు కాలం మొదలైంది. వైసీపీ అధికారంలోకి రావడం.. గతంలో ఆ పార్టీ నుంచి చేర్చుకున్న 23 ఎమ్మెల్యేలకు బదులుగా 2019 ఎన్నికల్లో టీడీపీకి 23 సీట్లే దక్కడం.. ఇవన్నీ ఆ పార్టీని ఇబ్బంది పెట్టినట్లుగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అదే సమయంలో.. టీడీపీ నుంచి బీజేపీలోకి భారీగా వలసలు వెళ్లడంతో ఆ పార్టీకి దెబ్బ గట్టిగానే పడిందని వెల్లడిస్తున్నారు. అయితే.. తాజాగా, ఆ పార్టీకి చెందిన నేతలే.. సొంత పార్టీపై, పార్టీ అధినేత చంద్రబాబుపై, ఆయన కుమారుడు లోకేష్‌పై తమ అక్కసు వెళ్లగక్కుతుండటం చేటు చేస్తోందని అంటున్నారు. ఈ తరుణంలో పార్టీకి పూర్వ వైభవం తేవాల్సిన అవసరం ఉందని, దానికి పార్టీలో సమూల మార్పులు, క్రమశిక్షణ చర్యలు కఠినంగా ఉండాల్సిందేనని చెబుతున్నారు.

పార్టీ కేడర్ పోకుండా ఉండాలన్నా, మళ్లీ అధికారం చేపట్టాలన్నా మాస్ ఇమేజ్ ఉన్న జూనియర్ ఎన్టీఆర్‌ను ప్రత్యక్ష రాజకీయాల్లోకి తీసుకు రావాలని ఇప్పటికే చంద్రబాబుకు పలువురు సూచించినట్లు వార్తలు వచ్చాయి. అయితే.. ఆ పార్టీ సీనియర్ నేత వర్ల రామయ్య ‘ఎన్టీఆర్ కంటే చంద్రబాబు స్ట్రాంగ్ లీడర్ అని.. మాకు ఆయన అవసరం లేదు’ అని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పార్టీలో కొత్త చర్చకు దారి తీస్తున్నాయి. 2009లో జూనియర్ ఎన్టీఆర్‌తో ప్రచారం చేయించుకున్న అదే పార్టీ ఇప్పుడు ఆయన అవసరం లేదని అనడం ఎంత వరకు కరెక్ట్ అని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు.

నిజానికి, పార్టీ పీకల్లోతు కష్టాల్లో ఉన్నపుడు ప్రజలను ఆకర్షించే నాయకుడు కావాలని.. ఎన్టీఆర్ అలాంటి నాయకుడు అవుతారని.. రాజకీయ పండితులు భావిస్తున్నారు. అలాంటిది ఆయన అవసరం లేదని చెప్పడం వెనక పెద్ద మతలబే ఉందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు.. తన తర్వాత పార్టీలో పెద్ద నేతగా తన కుమారుడు లోకేష్‌ను తీర్చి దిద్దాలని చూస్తున్నారని, అందుకే ఎన్టీఆర్‌ను పక్కనబెడుతున్నారని అంటున్నారు. మాస్ ఇమేజ్ ఉన్న ఎన్టీఆర్‌ను ప్రజలు ఆదరిస్తే.. తన కుమారుడికి నష్టమని చంద్రబాబు ఆలోచిస్తున్నారని చెబుతున్నారు. ఎన్టీఆర్‌కు రాజకీయ భవిష్యత్తే లేకుండా చంద్రబాబు చేశారని సొంత పార్టీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ చేసిన వ్యాఖ్యలు కూడా ఇందుకు అద్దం పడుతోందని అంటున్నారు.

అటు.. సీనియర్ ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి కూడా జూనియర్ ఎన్టీఆర్ గుణం గురించి మాట్లాడారు. లోకేష్ కంటే ఎన్టీఆర్ వంద రెట్లు బెటర్ అని, ఆయనకు నటన, ప్రజలను మెప్పించే చాతుర్యం, మంచి భాష, వాక్చాతుర్యం, ఉందని ఆమె అన్నారు. అయితే.. టీడీపీని ఎన్టీఆర్ కాపాడాతారా? లేదా? అన్నది తనకు తెలీదని, దాని గురించి తాను చెప్పలేనని లక్ష్మీ పార్వతి స్పష్టం చేశారు.
First published: November 18, 2019, 10:17 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading