హైదరాబాద్ లో కలకలం రేపిన కిడ్నాప్ కేసు. మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ అరెస్ట్. ఆపై కస్టడీకి కోర్టు అనుమతి. ఇవన్నీ చకచకా అత్యంత వేగంగా జరిగిపోయాయి. అఖిల ప్రియను రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే అరెస్ట్ చేశారని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అసలు అఖిల ప్రియను అరెస్ట్ ఎలా చేశారు? ఏ సాక్ష్యం ఆధారంగా ఆమెను దోషిగా తేల్చారు.? అని ఆమె కుటుంబ సభ్యులు ప్రశ్నాస్త్రాలు కురిపిస్తున్నారు. అయితే వారి అనుమానాలకు, ప్రశ్నలకు పోలీసులు సమాధానం చెప్పేశారు. అసలు ఏ ఆధారంతో అఖిల ప్రియే, ఈ కిడ్నాప్ కు సూత్రధారి అన్నది తేల్చారో వెల్లడించారు. అఖిల ప్రియను దోషిగా తేల్చడానికి ఉపయోగపడిన కీలకమైన క్లూను పోలీసులు బయటపెట్టారు. సోమవారం ప్రత్యేకంగా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మరీ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ కొన్ని సంచలన విషయాలను వెల్లడించారు.
‘ప్రవీణ్ రావు, అతడి సోదరుల కిడ్నాప్ జరిగిన రాత్రి పోలీసులు 15 బృందాలుగా ఏర్పడ్డారు. ముఖ్యమంత్రి బంధువుల కిడ్నాప్ అనే వార్తలు మీడియాలో ప్రముఖంగా రావడంతో కిడ్నాపర్లు కూడా కాస్త ఒత్తిడికి గురయ్యారు. ఈ కిడ్నాప్ వ్యవహారాన్ని ప్రభుత్వంలోని పెద్ద పెద్ద నేతలు స్వయంగా పర్యవేక్షిస్తున్నారని తెలిసి ఆ కిడ్నాపర్లు వెనక్కు తగ్గారు. వారిని వదిలేయాలని నిర్ణయించుకున్నారు. వారి వద్ద ఉన్న ఓ ఫోన్ ను ఇచ్చి మేం సురక్షితంగా ఉన్నాం.. అన్న సమచారాన్ని ఎవరికైనా చెప్పుకో అన్నారు. దీంతో ప్రవీణ్ రావు ఆ ఫోన్ నెంబర్ ద్వారా పోలీసులకు ఫోన్ చేసి, కిడ్నాపర్లు వదిలేసిన సంగతిని చెప్పారు. ఆ తర్వాత కిడ్నాపర్లు వెళ్లిపోగా, ప్రవీణ్ రావు, అతడి సోదరులు క్షేమంగా బయటపడ్డారు.
కిడ్నాపర్లు వాడిన కార్లు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి కానీ ఆ నెంబర్లను మార్చడంతో నిందితులను పట్టుకోలేకపోయాం. అయితే కిడ్నాపర్లు వాడిన ఓ ఫోన్ నుంచే, ప్రవీణ్ రావు మాకు ఫోన్ చేశాడని గుర్తుకొచ్చి, ఆ ఫోన్ కాల్ డేటాను తీశాం. ఆ సిమ్ కొత్తగా కొన్నదే అని అర్థమయింది. కేవలం కిడ్నాప్ చేసేందుకే ఈ ఫోన్ నెంబర్ ను తీసుకున్నారని గ్రహించాము. ఈ ఫోన్ నెంబర్ నుంచి, మాజీ మంత్రి అఖిల ప్రియకు ఫోన్ వెళ్లింది. ఆమెతో పలుమార్లు సంప్రదింపులు జరిపారు. ఈ ఆధారంగానే అఖిలప్రియను అరెస్ట్ చేశాం.‘ అని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ స్పష్టం చేశారు. కాగా, అఖిలప్రియ బెయిల్ పిటిషన్ ను సోమవారం కోర్టు కొట్టేసింది. పోలీస్ కస్టడీకి అనుమతించింది. రాజకీయ నేత కావడం వల్ల సాక్ష్యాలను ప్రభావితం చేసే అవకాశం ఉందని పోలీసు తరపున న్యాయవాది వాదనలను కోర్టు పరిగణనలోకి తీసుకుంది.
Published by:Hasaan Kandula
First published:January 12, 2021, 11:10 IST