Rahul Gandi - Hathras: నన్ను కింద పడేసి లాఠీచార్జ్ చేశారు: రాహుల్ గాంధీ

Hathras Gangrape Case: ‘పోలీసులు నన్ను తోసేశారు. లాఠీచార్జీ చేశారు. కింద పడేశారు. ఈ దేశంలో మోదీ ఒక్కరే నడవాలా? మామూలు మనుషులు నడవడానికి వీల్లేదా?’ అంటూ రాహుల్ గాంధీ ప్రశ్నించారు.

news18-telugu
Updated: October 1, 2020, 4:05 PM IST
Rahul Gandi - Hathras: నన్ను కింద పడేసి లాఠీచార్జ్ చేశారు: రాహుల్ గాంధీ
హత్రాస్ పర్యటనకు వెళ్తున్న రాహుల్ గాంధీని అడ్డుకుంటున్న పోలీసులు
  • Share this:
తన మీద పోలీసులు లాఠీచార్జ్ చేశారని, పోలీసులు కింద పడేశారని కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ రాహుల్ గాంధీ ఆరోపించారు. ఉత్తర్ ప్రదేశ్‌లోని హత్రాస్‌లో దళిత యువతిపై అత్యాచారం జరిగిన విషయం తెలిసిందే. ఆ బాధితురాలు చనిపోయింది. బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించేందుకు రాహల్ గాంధీ, ప్రియాంకా గాంధీ వాద్రా ఢిల్లీ నుంచి యూపీ బయలుదేరారు. అయితే, వారిని పోలీసులు అడ్డుకున్నారు. వారి వాహనాలను నిలిపివేశారు. హత్రాస్‌లో 144 సెక్షన్ అమల్లో ఉందని, అలాగే, ప్రస్తుతం పాండమిక్ యాక్ట్ (కరోనా వైరస్ మహమ్మారి కారణంగా) అమల్లో ఉందని, ఈ సమయంలో గుంపులు, గుంపులుగా వెళ్లడానికి వీల్లేదని పోలీసులు స్పష్టం చేశారు. రాహుల్, ప్రియాంకా గాంధీ వాద్రాలను అడ్డుకున్నారు. దీంతో వారిద్దరూ కారు దిగి నడక ప్రారంభించారు. తాను ఒక్కడినే నడుచుకుంటూ వెళ్తానంటూ రాహుల్ గాంధీ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. యూపీ ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

‘ఇప్పుడే పోలీసులు నన్ను తోసేశారు. లాఠీచార్జీ చేశారు. కింద పడేశారు. ఈ దేశంలో మోదీ ఒక్కరే నడవాలా? మామూలు మనుషులు నడవడానికి వీల్లేదా? మా వాహనాలను ఆపేశారు. దీంతో మేం నడక ప్రారంభించాం.’ అని యమునా ఎక్స్ ప్రెస్ వే మీద రాహుల్ గాంధీ చెప్పారు. దీనికి సంబంధించిన వీడియోను ఏఎన్ఐ వార్తా సంస్థ ట్వీట్ చేసింది.
యూపీలోని హత్రస్ జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన దళిత యువతి.. తన పొలంలో గడ్డి కోయడానికి వెళ్లింది. ఆ యువతితో పాటు తన అమ్మ, సోదరి, సోదరుడు కూడా ఉన్నారు. అమ్మ, సోదరులకు దూరంగా ఆ యువతి పని చేస్తుండగా వెనుకనుంచి వచ్చిన నలుగురు యువకులు.. ఆమెను పక్కనే ఉన్న చేనులోకి ఎత్తుకెళ్లారు. అత్యంత కిరాతకంగా ఆ యువతిని ఒకరి తర్వాత ఒకరుగా రేప్ చేశారు. అనంతరం ఆమె నాలుక కూడా కోశారు. యువతి ఆర్తనాదాలు విన్న ఆమె తల్లి.. ముందుగా ఈ దారుణాన్ని గుర్తించింది. తనకోసం వెతుక్కుంటూ వెళ్లేసరికే రేప్ చేసిన దుండగులు అక్కడ్నుంచి పారిపోయారు. తీవ్ర గాయాలపాలైన ఆ యువతిని హత్రాస్ లోని జిల్లా కేంద్రంలో ఉన్న ప్రభుత్వాస్పత్రిలో చేర్పించారు. తర్వాత ఆమెను ఢిల్లీకి తరలించారు. రెండు వారాలుగా చావు బతుకుల మధ్య పోరాటం సాగించిన ఆ యువతి చివరికి ప్రాణాలు కోల్పోయింది. సెప్టెంబర్ 14న ఈ దారుణం జరగ్గా, సెప్టెంబర్ 28న ఆమె చనిపోయింది. అగ్రకులానికి చెందిన నిందుతులు ఉండడం వల్ల వారిని యూపీలోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం కాపాడుతోందంటూ ప్రతిపక్షాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. పలు ప్రజా సంఘాలు కూడా బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.


దీంతో పాటు బాధితురాలి అంత్యక్రియలను పోలీసులు అర్ధరాత్రి హడావిడిగా నిర్వహించడం కూడా విమర్శలకు తావిచ్చింది. తెల్లవారిన తర్వాత అంత్యక్రియలు చేపడతామని బాధితురాలి కుటుంబసభ్యులు చెబుతున్నా కూడా వినకుండా పోలీసులు బలవంతంగా అంత్యక్రియలు కానిచ్చేశారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. యూపీలో అత్యాచారాలు పెరిగిపోయాయని, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తన పదవికి రాజీనామా చేయాలని బీఎస్పీ అధినేత్రి మాయావతి డిమాండ్ చేశారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: October 1, 2020, 3:30 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading