‘మేమంతా కోడెల కుటుంబ బాధితులం’.. పోలీస్ స్టేషన్లకు జనం క్యూ

కోడెల శివప్రసాద రావు (ఫేస్‌బుక్ ఫోటో)

మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుమారుడు కోడెల శివరామ క్రిష్ణ, కుమార్తె పూనాటి విజయలక్ష్మి లు సాగించిన అరాచకాలపై ఫిర్యాదు చేసేందుకు బాధితులు పోలీస్ స్టేషన్లకు క్యూ కడుతున్నారు.

 • Share this:
  గుంటూరు జిల్లా నరసరావుపేటలో మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుటుంబం అరాచకాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. తండ్రి పదవిని అడ్దం పెట్టుకొని ఆయన కుమారుడు కోడెల శివరామ క్రిష్ణ, కుమార్తె పూనాటి విజయలక్ష్మి లు సాగించిన అరాచకాలపై ఫిర్యాదు చేసేందుకు బాధితులు పోలీస్ స్టేషన్లకు క్యూ కడుతున్నారు. నరసరావుపేట శివారు రావిపాడు గ్రామ పంచాయితి పరిధిలో కోటపాటి మల్లిఖార్జున అనే వ్యక్తి బహుళ అంతస్తుల భవనం నిర్మాణం చేపట్టాడు. అయితే, తనను కోడెల శివరామ్ అనుచరులైన కళ్యాణం రాంబాబు, నాగప్రసాద్, ఇంజనీర్ వేణుగోపాల్ లు బెదిరించి రూ.14లక్షలు డిమాండ్ చేశారని బాధితుడు ఆరోపించాడు. డబ్బులు ఇవ్వనందుకు పంచాయతీ సెక్రటరి భార్గవ్ సహాయంతో నిర్మాణం ఆంపించివేశారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇంజనీర్ వేణుగోపాల్ తనని బలవంతంగా గుంటూరులోని కోడెల శివరామ్ ఆఫీసుకు తీసుకు వెళ్ళి రూ.25లక్షల వరకు డిమాండ్ చేసి చివరికి రూ.14లక్షలకు ఒప్పందం కుదిర్చారని ఆరోపించాడు. ఆ డబ్బుల గురించి తనను ఒత్తిడి చేస్తున్నారంటూ కాల్ రికార్డ్స్‌తో సహా పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

  మరో కేసులో ఒక మహిళ కేసానుపల్లి గ్రామ పరిధిలో రెండు ఎకరాల వ్యవసాయ భూమిని కొనుక్కున్నారని ఆభూమిని సాగుచేసుకోవాలంటే తనకు రూ.20లక్షలు చెల్లించాలంటూ కోడెల కుమార్తె పూనాటి విజయలక్ష్మి తనను బెదిరించిందని మరో ఫిర్యాదులో పేర్కొన్నారు.
  ఇక గతంలో ఉద్యోగాలు ఇప్పిస్తామని సుమారు 18మంది నిరుద్యోగుల వద్ద నుండి కోడెల శివరామ్, పూనాటి విజయలక్ష్మిలు ఒక్కొక్కరి వద్ద నుంచి సుమారు రూ.6లక్షల నుంచి రూ.10లక్షల వరకు అక్రమంగా వసూలు చేశారని, ఉద్యోగాలు ఇప్పించకపోగా తమ డబ్బు తమకి ఇవ్వమని అడిగితే కళ్యాణం రాంబాబు,మరికొంత మంది ద్వారా తమను బెదిస్తున్నారని బాధితులు నరసరావుపేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. తమ డబ్బులు తమకు ఇప్పించి తమకు న్యాయం చెయ్యాలని నిరుద్యోగులు పోలీసులని కోరుతున్నారు.

  వీటితోపాటు కోడెల కుమార్తె విజయలక్ష్మి రావిపాడు రోడ్డులో 22సెంట్ల స్థలాన్ని కబ్జా చేసిందని, నల్లపాడులో ఓ రైతు వద్దనుంచి సుమారు 5 ఎకరాల పొలం ఆక్రమించుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఇవి గాక వెన్నాదేవి భూ ఆక్రమణలు,సేఫ్ మెడికల్ కుంభకోణాలు, కేబుల్ దౌర్జన్యాలు, నిర్మాణ సంస్థల నుంచి అక్రమ వసూళ్ళు, రేషన్ బియ్యం దందాలు, ఇలా చెప్పుకుంటూ పోతే తండ్రి పదవిని అడ్డుపెట్టుకొని కోడెల కుమారుడు, కుమార్తె సాగించిన అక్రమాల చిట్టా చేంతాడంత అని చెబుతారు. నరసరావు పేటలో ‘కోడెల ట్యాక్స్’ అనే పేరు కూడా బలంగా ప్రచారంలో ఉంది.

  (రఘు అన్నా, గుంటూరు కరస్పాండెంట్, న్యూస్‌18)
  First published: