Home /News /politics /

Amaravati Padayatra: అమరావతి రైతుల పాదయాత్రలో టెన్షన్.. విరిగి లాఠీలు.. జగన్ కు భయం పట్టుకుందన్న చంద్రబాబు

Amaravati Padayatra: అమరావతి రైతుల పాదయాత్రలో టెన్షన్.. విరిగి లాఠీలు.. జగన్ కు భయం పట్టుకుందన్న చంద్రబాబు

అమరావతి రైతుల పాదయాత్రపై లాఠీ ఛార్జ్

అమరావతి రైతుల పాదయాత్రపై లాఠీ ఛార్జ్

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) కు అమరావతి రాజధానిగా (Capital Amaravathi) ఉండాలంటూ ఆ ప్రాంత రైతులు చేపట్టిన న్యాయస్థానం టు దేవస్థానం పాదయాత్రలో ఉద్రిక్తత చోటు చేసుకుంది.

  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) కు అమరావతి రాజధానిగా (Capital Amaravathi) ఉండాలంటూ ఆ ప్రాంత రైతులు చేపట్టిన న్యాయస్థానం టు దేవస్థానం పాదయాత్రలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రస్తుతం పాదయాత్ర ప్రకాశం జిల్లా (Prakasham District)లో కొనసాగుతోంది. గురువారం నాగులుప్పలపాడు మండలం చదలవాడ చేరుకున్న పాదయాత్రలో టెన్షన్ వాతావరణం రేగింది. పాదయాత్రకు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో రైతులు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. సంతనూతలపాడుకు చెందిన నాగార్జున అనే రైతుకు చేయి విరిగినట్లు తెలుస్తోంది. రైతుల పాదయాత్రలో పాల్గొనకుండా ఇప్పటికే పలువురు టీడీపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల వలయంలో పాదయాత్ర కొనసాగుతోంది.

  ఇదిలా ఉంటే అమరావతి రైతుల పాదయాత్రపై లాఠీ ఛార్జ్ ను మాజీ సీఎం, టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. భయంతోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైతులపై లాఠీ ఛార్జ్ చేయించారని చంద్రబాబు ఆరోపించారు. అమరావతి రైతులు చేపట్టిన మహాపాదయాత్రకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల ప్రజల నుంచి వస్తున్న విశేషమైన స్పందనను చూసి సీఎం జగన్ భయపడుతున్నారని ఆయన అన్నారు. ప్రజాస్వామ్యయుతంగా చేపట్టిన యాత్రకు లక్షలాది మంది ప్రజలు తమ సంఘీభావాన్ని తెలుపుతుంటే ప్రభుత్వం మాత్రం అడుగడుగునా ఆటంకాలు సృష్టిస్తోందని మండిపడ్డారు. శాంతియుతంగా పాదయాత్ర చేస్తున్న రైతులపై, మీడియా ప్రతినిధులపై పోలీసులు లాఠీచార్జ్ చేయడం దుర్మార్గమన్నారు.

  ఇది చదవండి: భూమిలో నుంచి వింత శబ్ధాలు.. హడలిపోతున్న ఊరిజనం.. దెయ్యాలు పగబట్టాయా..?


  “జగన్ రెడ్డి అప్రజాస్వామిక చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రభుత్వ దమనకాండకు ఈ సంఘటన అద్దం పడుతోంది. 13 జిల్లాల అభివృద్ధికి, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే అమరావతి నిర్మాణాన్ని నిలిపివేస్తూ.. 3 రాజధానులంటూ విధ్వంసకర రాజకీయాలను జగన్మోహన్ రెడ్డి కొనసాగిస్తున్నారు. ప్రజా మద్దతుతో సాగుతున్న మహాపాదయాత్రను అణచివేయాలనే కుట్రతో పోలీసులను అడ్డుపెట్టుకుని అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నారు. మొదటి రోజు నుంచీ మహాపాదయాత్రకు ఆటంకాలు కల్పిస్తూనే ఉన్నారు. రైతుల పాదయాత్రకు మద్దతుగా వస్తున్న ప్రజలను రానివ్వకుండా రోడ్లు దిగ్బంధించి చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం ప్రభుత్వ కక్షసాధింపు చర్యలకు నిదర్శనం. అమరావతి రైతుల పాదయాత్రను జరుపుకోనివ్వాలన్న న్యాయస్థానం ఆదేశాలను సైతం బేఖాతరు చేస్తున్నారు. హైకోర్టు ఆదేశాల ప్రకారం మహాపాదయాత్రను కొనసాగిస్తున్న అమరావతి రైతులను అడ్డుకోవడం మానుకోవాలి. పాదయాత్రలో గాయపడిన రైతులకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలి.” అని చంద్రబాబు డిమాండ్ చేశారు.

  ఇది చదవండి: చేదెక్కుతున్న బెల్లం.. 120ఏళ్ల చరిత్ర ఉన్నా వీడని సంక్షోభం.. ప్రభుత్వం ఆదుకుంటుందా..?

  అమరావతి పరిరక్షణ సమితి, రాజధాని ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో నడుస్తున్నఈ మహాపాదయాత్ర 45 రోజుల పాటు కొనసాగనుంది. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లోని 70 ప్రధాన గ్రామాల గుండా కొనసాగుతుంది. ఈ పాదయాత్ర డిసెంబర్ 15న తిరుపతిలో ముగుస్తుంది.
  Published by:Purna Chandra
  First published:

  Tags: Amaravathi, Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, Chandrababu naidu

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు