PM NARENDRA MODI WILL EXPANDS HIS COUNCIL OF MINISTERS TODAY AND THE LIST WILL BE REVEALED AT 6 PM VB
Union Cabinet Expansion: నేడు కేంద్ర మంత్రి వర్గ విస్తరణ.. వారికే ఎక్కువ ప్రాధాన్యత.. ఆ సమయంలో జాబితా వెల్లడి..
ప్రధాని మోదీ, మంత్రి అమిత్ షా (ఫైల్)
Union Cabinet Expansion: నేడు సాయంత్రం 6 గంటలకు కేంద్ర మంత్రివర్గ విస్తరణ జాబితా బహిర్గతం అయ్యే అవకాశం ఉంది. ఇందులో ఎక్కువగా యువత, మహిళలు, విద్యావంతులకు, వెనుకబడిన(ఓబీసీ) వర్గాల వారికి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చినట్లుగా ప్రభుత్వ ఉన్నత వర్గాలు మంగళవారం సిఎన్ఎన్-న్యూస్ 18 కి తెలిపారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ప్రధాని నరేంద్రమోదీ తన క్యాబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారు చేశారు. బుధవారం సాయంత్రం ఆరు గంటలకు మంత్రివర్గ విస్తరణ జరుగుతుందని ప్రభుత్వ ఉన్నత వర్గాలు మంగళవారం సిఎన్ఎన్-న్యూస్ 18 కి తెలిపారు. ఈ క్యాబినెట్ విస్తరణలో వచ్చే ఏడాది ప్రారంభంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్‌లతోపాటు ఐదు రాష్ట్రాలకే పెద్ద పీట వేస్తారని తెలుస్తోంది. ఈ మంత్రి మండలి విస్తరణలో ‘సోషిత్, పిడిట్, వంచిత్ మరియు ఆదివాసీ’(నిరుపేద మరియు గిరిజన సంఘాలు) ప్రాతినిధ్యంపై ప్రత్యేక దృష్టి సారిస్తుందని సమాచారం. మోదీ కేబినెట్లో యువతకు గతంలో ఎన్నడు లేని విధంగా ఈసారి ప్రాతినిధ్యం లభిస్తుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. యువకులు, బీసీలు, మహిళలకు ప్రత్యేకించి విద్యావంతులకు క్యాబినెట్ విస్తరణలో ప్రాధాన్యం లభిస్తుందని తెలిపారు. దీనిలో ఇతర వెనుకబడిన తరగతులకు (ఓబిసి) చెందిన 24 మంత్రులను చేర్చుకుంటారని వారు తెలిపారు. మొత్తం 81 మంది కేంద్ర మంత్రులుగా ఉండేందుకు అవకాశం ఉండగా ప్రస్తుతం 53 మంది మంత్రులే ఉన్నారు.
మరో 20 నుంచి 27 మంది మంత్రి వర్గంలో చేరే అవకాశం ఉంది. కాగా తాజా మంత్రివర్గ విస్తరణలో కేబినెట్ హోదాలో ఆరుగురు, మంత్రులుగా 20 మందికి ఛాన్స్ దక్కే అవకాశం ఉంది. మోదీ తన క్యాబినెట్లో 24 మంది మహిళలకు చోటు కల్పించే అవకాశమున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఇక ప్రస్తుత కేంద్ర మంత్రుల్లో ఒకటి కంటే ఎక్కువ శాఖల బాధ్యతలు నిర్వహిస్తున్న వారిపై పనిభారం తగ్గించాలని ప్రధాని మోదీ భావిస్తున్నారు. అసలు పనితీరు సరిగ్గా లేని వారికి ఉద్వాసన పలికే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ఇప్పటికే క్యాబినెట్ విస్తరణపై కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, బీజేపీ సంస్థాగత వ్యవహారాల కార్యదర్శి బీఎస్ సంతోష్‌లతో పలు సార్లు ప్రధాని మోదీ చర్చించారు. ఇటీవల మరణించిన రాం విలాస్ పాశ్వాన్, సురేశ్ అంగడీ, రాజీనామా చేసిన అకాలీదళ్ నాయకురాలు హర్ సిమ్రత్ కౌర్, శివసేనకు చెందిన అరవింద్ సావంత్ స్థానాలను భర్తీ చేయనున్నారు. ముఖ్యంగా యూపీకి ఎక్కువ పదవులు దక్కే అవకాశం ఉంది. మిత్రపక్షాల విషయానికొస్తే జేడియూకు కచ్చితంగా అవకాశం ఇస్తారని భావిస్తున్నారు. తమకు నాలుగు మంత్రి పదవులు ఇవ్వాలని బీహార్ సీఎం నితీష్‌కుమార్ ప్రధాని మోదీని కోరినట్టు తెలుస్తోంది.
మధ్యప్రదేశ్ నుంచి జ్యోతిరాదిత్య సింథియా, అసోం మాజీ ముఖ్యమంత్రి శర్వానంద్ సోనోవాల్, బీజేపీ సీనియర్ నేత సుశీల్ కుమార్ మోదీలకు మంత్రివర్గంలో బెర్త్ ఖాయమని ప్రచారం జరుగుతోంది. ఇక దిలీప్ ఘోష్, నాంగ్యాల్, మనోజ్ తివారీకి చోటు దక్కే అవకాశముంది. జూన్ 5 న రైతులు, యువత, ఎస్సీ / ఎస్టీ, మహిళలతో సహా బిజెపి మోర్చా చీఫ్‌లతో మోడీ మాట్లాడిని విషయం తెలిసిందే. ఒక రోజు తరువాత ఆయన పార్టీ ప్రధాన కార్యదర్శులను కలిశారు. ప్రస్తుత మంత్రివర్గం బుధవారం ఉదయం 11 గంటలకు సమావేశమవుతుంది. ఈ సమావేశంలో హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్, బిజెపి చీఫ్ జెపి నడ్డా, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ తదితరులు పాల్గొంటారు. ఈ సమావేశం మూడు నుంచి ఐదు గంటల వరకు జరగనుంది. ఈ సమావేశానికి కేబినెట్‌తో పాటు రాష్ట్ర మంత్రులు కూడా దీనికి హాజరు కావాలని కోరారు. తర్వాత 6 గంటలకు మంత్రుల జాబితా బహిర్గతం కానుంది. ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, గుజరాత్, గోవా, మణిపూర్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్లు వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొంటున్నందున అక్కడ నుంచి ఎక్కువ మందికి మంత్రి పదవులు ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
2019లో మోదీ రెండో విడత ప్రధాని పదవి చేపట్టిన తర్వాత నుంచి ఇప్పటివరకూ మంత్రివర్గ విస్తరణ చేపట్టలేదు. నిబంధనల ప్రకారం..కేంద్ర మంత్రివర్గంలో గరిష్ఠంగా 81 మంది మంత్రులు ఉండొచ్చు. అయితే ప్రస్తుతం కేబినెట్లో 53 మంది మాత్రమే ఉన్నారు. చాలా మంత్రుల వద్ద ఒకటికంటే ఎక్కువ మంత్రిత్వ శాఖలున్నాయి. దీంతో మంత్రివర్గ విస్తరణపై దృష్టి పెట్టారు ప్రధాని. ఈ నేపథ్యంలో పలువురి పేర్లు తెరపైకి వస్తున్నాయి. ఇప్పటికే అసోం మాజీ సీఎం శర్వానంద్ సోనోవాల్, జ్యోతిరాదిత్య సింధియా , నారాయణ్ రాణే ఢిల్లీకి చేరుకున్నారు.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.