ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ ఎదురుదాడికి దిగింది. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ ఐఎన్ఎస్ విరాట్ యుద్ధనౌకను సొంత ట్యాక్సీలా వాడుకున్నారంటూ ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపణలు చేసిన నేపథ్యంలో తన విమర్శలకు పదును పెట్టింది. ఐఎన్ఎస్ విరాట్‌ను రాజీవ్ సొంత అవసరాలకు వాడుకోలేని, అధికారిక కార్యక్రమాల కోసమే వాడారని చెబుతూనే.. మోదీపై ఎదురుదాడికి దిగింది. మోదీయే వైమానిక దళ యుద్ధ విమానాన్ని సొంత ట్యాక్సీలా వాడుకుంటున్నారని ఆరోపించింది. ఆ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా మాట్లాడుతూ.. యుద్ధ విమానాన్ని మోదీ సొంత అవసరాలకు వాడుకుంటున్నారు.ఈ ఏడాది జనవరి 15న మోదీ వినియోగించిన యుద్ధవిమానానికి బీజేపీ కేవలం రూ.744 చెల్లించిందని ఆరోపించారు. ‘స్కేర్డ్ ఆఫ్ యువర్ ఓన్ సిన్స్ హంటింగ్ యూ, యూ ఆర్ షేమ్లెస్లీ పాయింటింగ్ ఫింగర్స్ ఆన్ అదర్స్(నీ వైఫల్యాలు వెంటాడుతాయని భయపడుతున్నావ్. పైగా, సిగ్గు లేకుండా వేరొకరిపై వేలెత్తి చూపుతున్నావ్) అని మోదీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
‘ప్రధాని మోదీ చెప్పింది అబద్ధమని విశ్రాంత వైస్ అడ్మిరల్ వినోద్ పాస్రిచా టీవీ ఛానళ్లకు చెప్పారు. అధికారిక కార్యక్రమాల కోసమే రాజీవ్‌గాంధీ అందులో ప్రయాణించారు తప్ప అది విహారయాత్ర కాదు. మోదీకి నిజాలు ఏమీ పట్టవు’ కాంగ్రెస్ ప్రతినిధి పవన్ ఖేరా అని దుయ్యబట్టారు. తన వైఫల్యాలపై ఓట్లు అడుగుతున్న ఏకైక ప్రధాని మోదీయేనని ఎద్దేవా చేశారు. నోట్లరద్దు, నిరుద్యోగం, రాఫెల్ ఒప్పందం సహా తాము లేవనెత్తిన సమస్యలపై చర్చకు వచ్చేందుకు మోదీకి ధైర్యం సరిపోవడం లేదన్నారు.