ప్రధాని నరేంద్ర మోదీ త్వరలోనే కేంద్ర మంత్రివర్గ విస్తరణ చేపట్టనున్నట్టు రాజకీయ వర్గాల్లో విస్తృతమైన చర్చ సాగుతోంది. మోదీ రెండోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టి రెండేళ్లు గడవడం, ప్రస్తుత మంత్రివర్గంలో ఖాళీలు ఏర్పరడం, వచ్చే ఏడాది ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు నేపథ్యంలో మంత్రి వర్గ విస్తరణ దిశగా అడుగులు పడినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం కరోనా ఉధృతి కూడా తగ్గడంతో మంత్రివర్గ విస్తరణకు ముమ్మరంగా కసరత్తు సాగుతోంది. ఈ క్రమంలోనే ప్రధాని మోదీ పలు శాఖల అధికారులతో సమీక్ష జరిపినట్టుగా సమాచారం. ఇదిలా ఉంటే మంత్రివర్గ విస్తరణ వార్తల నేపథ్యంలో.. పలువురికి కేంద్ర కేబినెట్లో చోటు దక్కనుందనే ప్రచారం కూడా జరుగుతుంది.
ప్రస్తుతం కేంద్ర మంత్రి వర్గంలో 53 మంది మంత్రులు ఉండగా.. విస్తరణలో ఆ సంఖ్య 81కి చేరనుందని Times Now శుక్రవారం ఒక కథనాన్ని ప్రసారం చేసింది. కేబినెట్ విస్తరణలో భాగంగా.. 28 మంది కొత్తవారికి చోటు కల్పించనున్నట్టుగా పేర్కొంది. త్వరలోనే ఇందుకు సంబంధించిన ప్రకటన వెలువడనుందని తెలిపింది. ప్రస్తుతం ఒకటి కంటే ఎక్కువ శాఖలు చూస్తున్న మంత్రుల వద్ద ఉన్న అదనపు శాఖలను.. కొత్తవారికి కేటాయించే అవకాశం ఉంది.
ఇక, వచ్చే ఏడాది ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో.. కేబినెట్లో మిత్రపక్షాలకు చెందిన వారికి కూడా సముచిత స్థానం కల్పించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఉత్తరప్రదేశ్ నుంచి బీజేపీ మిత్రపక్షంగా ఉన్న అప్నా దళ్(ఎస్) నాయకురాలు అనుప్రియ పటేల్(Anupriya Patel)కు కేబినెట్లో చోటు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. అప్నా దళ్(ఎస్).. 2014 లోక్‌సభ ఎన్నికల సమయం నుంచి బీజేపీ మిత్రపక్షంగా ఉంది. మొదటి దఫా మోదీ ప్రభుత్వంలో అనుప్రియ పటేల్ కేంద్ర మంత్రిగా కొనసాగిన సంగతి తెలిసిందే. ఇక, బీజేపీ ఎంపీలు వరుణ్ గాంధీ(Varun Gandhi), రీటా బహుగుణ, జోషి(Rita Bahuguna Joshi)లకు కూడా కేబినెట్లో చోటు దక్కే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది.
బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్.. జూన్ 22న న్యూఢిల్లీలో పర్యటించడంతో.. జేడీయూ మోదీ ప్రభుత్వంలో భాగస్వామ్యం కానుందని, మంత్రి పదవులు పొందనుందని ఊహాగానాలు కూడా వెలువడ్డాయి.
ఇక, మోదీ కేబినెట్ విస్తరణలో.. బిహార్ డిప్యూటీ సీఎం సుశీల్ మోదీ, మధ్య ప్రదేశ్ నుంచి జ్యోతిరాదిత్య సింధియా, అస్సాం మాజీ ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్, బీజేపీ జనరల్ సెక్రటరీ భూపేందర్ యాదవ్(రాజస్తాన్), మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నారాయణ్ రానేలకు చోటు దక్కే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. వీరిలో జ్యోతిరాదిత్య సింధియా గతేడాది కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. దీంతో మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోయి.. బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైంది. ఈ క్రమంలోనే జ్యోతిరాదిత్య సింధియాకు సముచిత స్థానం కల్పించాలని బీజేపీ అధిష్టానం భావిస్తోంది.
గత నెలలో ప్రధాని నరేంద్ర మోదీ పలువురు బీజేపీ అగ్ర నాయకులు, కేంద్ర మంత్రులతో 7, లోక్ కల్యాణ్ మార్గ్‌లోని తన నివాసంలో చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. మంత్రివర్గ విస్తరణలో భాగంగానే ఆయన ఈ చర్చలు జరిపినట్టుగా తెలుస్తోంది.
Published by:Sumanth Kanukula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.