భారత ప్రధాని నరేంద్ర మోదీ CNN NEWS18కి ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఎన్నికల వేళ ఆయన ఇచ్చిన ఈ ఇంటర్వ్యూలో చాలా అంశాలపై సమగ్రమైన సమాధానాలిచ్చారు. జాతీయవాదం మొదలుకుని దేశంలోని సమస్యలు, ప్రతిపక్షాల ఆరోపణలు, ఐదేళ్ల పాలనలో అందించిన పథకాలు, ఎన్నికల ఫలితాలపై ఉన్న అంచనాలు.. ఇలా అనేక అంశాలపై మోదీ తన మనోగతాన్ని వినిపించారు. ఇదే ఇంటర్వ్యూలో.. కాంగ్రెస్ 'న్యాయ్' పథకంపై మోదీ పలు విమర్శలు గుప్పించారు.
న్యాయ్ పథకం గురించి ప్రస్తావిస్తున్న కాంగ్రెస్.. మరి 1984లో చెలరేగిన సిక్కు వ్యతిరేక అల్లర్ల బాధితులకు ఏం న్యాయం చేస్తుందని ప్రశ్నించారు. ఛత్తీస్గఢ్,రాజస్తాన్, మధ్యప్రదేశ్ రైతులకు ఇచ్చిన రుణమాఫీ హామీ ఏమైందని నిలదీశారు. అధికారంలోకి వచ్చిన పది రోజులకే రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి.. 100 రోజులైనా అమలుచేయలేదని మండిపడ్డారు. వాళ్లకు ఇంకెప్పుడు న్యాయం జరుగుతుందని ప్రశ్నించారు.
సంఝౌతా ఎక్స్ప్రెస్ పేలుళ్ల తర్వాత కాంగ్రెస్ 'హిందు టెర్రర్' పదాన్ని ప్రయోగించడం మొదలుపెట్టిందని మోదీ ఆరోపించారు. సంఝౌత్ పేలుళ్లతో సంబంధం ఉందని ఎంతోమంది అమాయకులను కాంగ్రెస్ జైలు పాలు చేసిందని.. దీనిపై తమకు న్యాయం జరగాల్సిందేనని హిందువులు అడుగుతున్నారని మోదీ అన్నారు. చేయని తప్పుకు ఏళ్లుగా శిక్ష అనుభవించినవారు తమకు న్యాయం కావాలంటున్నారని చెప్పారు. హిందువులైన తమకు టెర్రరిస్టులుగా ఎందుకు ముద్రవేశారో తెలుసుకోవాలనుకుంటున్నారని పేర్కొన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bjp, Congress, Lok Sabha Election 2019, Narendra modi, Pm modi, Rahul Gandhi