బీజేపీలో ‘రైల్వే జోన్’ హడావిడి... విశాఖలో ప్రధాని మోదీ ప్రకటిస్తారా ?

Vishaka Railway Zone issue | మార్చి మొదటివారంలో విశాఖ రాబోతున్న ప్రధాని నరేంద్రమోదీ... అక్కడే రైల్వే జోన్‌ అంశంపై ప్రకటన చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ మేరకు రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్‌తో ఏపీ బీజేపీ నేతలు చర్చలు జరిపారు.

news18-telugu
Updated: February 23, 2019, 4:46 PM IST
బీజేపీలో ‘రైల్వే జోన్’ హడావిడి... విశాఖలో ప్రధాని మోదీ ప్రకటిస్తారా ?
ప్రధాని నరేంద్ర మోదీ (File)
  • Share this:
రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి ఇచ్చిన అనేక హామీలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తుంగలో తొక్కిందని విపక్షాలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఏపీ బీజేపీ నేతలు మాత్రం ఏపీకి విభజన చట్టం ప్రకారం రావాల్సిన నిధుల కంటే కేంద్రం ఎక్కువే ఇస్తోందని వాదిస్తోంది. ఈ క్రమంలోనే విభజన చట్టంలో ఏపీకి ఇస్తామని ప్రకటించిన రైల్వే జోన్ హామీని నిలబెట్టుకునేందుకు కేంద్రం కసరత్తు చేస్తున్నట్టు కనిపిస్తోంది. కేంద్ర రైల్వేశాఖ మంత్రి పియూష్ గోయల్‌తో సమావేశమైన ఏపీ బీజేపీ నేతలు కంభంపాటి హరిబాబు, కన్నా లక్ష్మీనారాయణ, పురంధేశ్వరి, విష్ణుకుమార్ రాజు, మాధవ్ తదితరులు... ఈ అంశంపైనే ఎక్కువగా చర్చించారని తెలుస్తోంది. దీంతో ఏపీకి కేంద్రం ప్రత్యేక రైల్వే జోన్ ప్రకటించబోతోందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

మార్చి మొదటివారంలో విశాఖలో ప్రధాని నరేంద్రమోదీ పర్యటించబోతున్నారు. విశాఖ ప్రజల అకాంక్ష అయిన ప్రత్యేక రైల్వే జోన్ హామీ నెరవేర్చడం వల్ల... అనేక రాజకీయ ప్రయోజనాలు ఉంటాయని బీజేపీ భావిస్తోంది. 2014లో విశాఖ ఎంపీ సీటుతో పాటు విశాఖలోని ఓ ఎమ్మెల్యే సీటును గెలుచుకున్న బీజేపీ... మళ్లీ అక్కడ తన పట్టు నిలుపుకోవాలని భావిస్తోంది. ఇందుకోసం విశాఖ రైల్వే జోన్ హామీని నెరవేరిస్తే బాగుంటుందని ఏపీ బీజేపీ నేతలు కేంద్రం పెద్దల దృష్టికి తీసుకెళ్లారని... వారు కూడా ఇందుకు సానుకూలంగా స్పందించారని ప్రచారం జరుగుతోంది. విశాఖకు రాబోతున్న ప్రధాని నరేంద్రమోదీ ప్రకటన చేస్తారా లేక అంతకంటే ముందే కేంద్రమంత్రి పియూష్ గోయల్ దీనిపై ప్రకటన చేస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది.


First published: February 23, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>