దేశంలో బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ఏర్పాటు చేస్తున్న మహాకూటమిపై విమర్శలు గుప్పించారు ప్రధాని మోదీ. కూటమిలో ఒక్కో పార్టీ.. ఒక్కో స్వరం వినిపిస్తోందని.. మోదీని గద్దె దింపడమే లక్ష్యంగా పనిచేస్తోంది తప్ప దేశం కోసం కాదని ఆరోపించారు. అసలు, మహాకూటమి ఎందుకు ఏర్పాటు చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. ఈ మహాకూటమికి ఇప్పటికే పలు రాష్ట్రాల్లో తగిన బుద్ధి చెప్పారని గుర్తు చేశారు. మహాకూటమికి తెలంగాణలో తొలి దెబ్బ తగిలిందని మోదీ చెప్పారు.
ఇక, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్న కూటమి గురించి తనకు తెలియదని మోదీ చెప్పారు. ఏపీ ముఖ్యమంత్రి నాయుడు కడుతున్న కూటమికి మాత్రం.. తెలంగాణ ప్రజలు తగిన బుద్ధి చెప్పారన్నారు. రాబోయే రోజుల్లోనూ ఇదే పునరావృతం అవుతుందన్నారు. ప్రతిపక్షాలు ఏర్పాటు చేస్తున్న మహాకూటమి ప్రజల కోసం కాదన్నారు. తెలంగాణ సహా అస్సాం, జమ్ముకశ్మీర్ రాష్ట్రాల్లో మహాకూటమి పూర్తిగా విఫలమైందన్నారు. తమతో పనిచేసి బయటకు వెళ్లిన పార్టీలను కాంగ్రెస్ నామరూపాల్లేకుండా చేసిందని, తామలా చేయబోమని, అందరి వాదనలూ వింటామని మోదీ స్పష్టం చేశారు. రాబోయే ఎన్నికల్లో తమతో ఎవరు కలుస్తారో, ఎవరు కలువరో అనే అంశాన్ని ఇప్పుడే చెప్పలమేన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Chandrababu naidu, CM KCR, Congress, Mahakutami, Pm modi