ఏపీకి వస్తోన్న ప్రధాని.. అందరి దృష్టీ మోదీ టూర్‌పైనే..

ప్రధాని నరేంద్ర మోదీ ( ఫైల్ ఫోటో )

ఏపీ రాజకీయవర్గాల్లో ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్ర పర్యటనే కీలకంగా మారింది. ఏ రాజకీయ పార్టీలో చూసినా ఈ అంశంపైనే ప్రధానంగా చర్చ జరుగుతోంది. మరి.. ఈ పార్టీలు, ప్రజాసంఘాలన్నీ మోదీని అడ్డుకునేందుకు, నిరసన తెలిపేందుకు ఏం చేయబోతున్నాయి?

 • Share this:
  ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనకు సమయం దగ్గరపడుతుండటంతో... రాష్ట్ర రాజకీయాల్లో వేడి రాజుకుంటోంది. రాష్ట్రానికి కేంద్రం తీరని అన్యాయం చేసిందని భావిస్తున్న అన్ని పార్టీలు, ప్రజాసంఘాలు.. మోడీ టూర్‌ను అడ్డుకునేందుకు సిద్ధమవుతున్నాయి. ఏపీకి ప్రత్యేక హోదాను డిమాండ్‌ చేస్తూ తాజాగా, నంద్యాలలో ఓ లాయర్ ఆత్మహత్యాయత్నం చేయడంతో... పరిస్థితి ఉద్రిక్తతలకు దారి తీసే అవకాశం ఉంది. టీడీపీ, కాంగ్రెస్, వామపక్ష పార్టీలు ఎల్లుండి రాష్ట్రానికి రానున్న నరేంద్రమోదీని లక్ష్యం చేసుకోబోతున్నాయి. ఇప్పటికే ప్రధాని టూర్‌ను వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేపడుతున్న పలు పార్టీలు, ప్రజాసంఘాలు.. మోదీటూర్‌లో ఎక్కడికక్కడ నిరసన తెలిపేలా ప్లాన్ చేస్తున్నాయి.

  గన్నవరం విమానాశ్రయంలో దిగి రోడ్డుమార్గంలో వచ్చే ప్రధానికి.. రహదారులపైనే నిరసన తెలపాలని నిర్ణయించినట్టు ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ న్యూస్ 18కు తెలిపారు. ప్రజల భావోద్వేగాలతో ఆటలాడుకుంటున్న కేంద్రానికి ఎన్నికల వేళ సెగ తగలాలంటే అన్ని పార్టీలూ తమతో కలిసిరావాలని ప్రజాసంఘాలు పిలుపునిచ్చాయి. అందుకు ప్రధాని మోడీ పర్యటనే సరైన సందర్భమని చెబుతున్నాయి. ఇప్పటికే జాతీయ స్ధాయిలో మోడీకి వ్యతిరేకంగా పనిచేస్తున్న టీడీపీ, కాంగ్రెస్ పార్టీల శ్రేణులు.. ఇటీవల పలాసలో పర్యటించిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు నిరసన తెలిపాయి. అయితే, ఈసారి ఈ రెండు పార్టీలకు కృష్ణా, గుంటూరు జిల్లాల్లో క్రియాశీలకంగా ఉండే లెఫ్ట్ పార్టీలు కూడా తోడు కానున్నాయి.

  ఇక, మోడీ టూర్ కు నిరసనలు తెలిపే విషయంలో వామపక్షాలతో భాగస్వామిగా ఉన్న జససేన గానీ, ప్రధాన ప్రతిపక్షం వైఎస్ఆర్‌సీపీగానీ ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటించలేదు. విభజన హామీలపై ఇప్పటికే పార్లమెంటులో పోరాటం చేశామని చెప్తున్న వైసీపీ నేతలు... మోడీ టూర్‌లో నిరసలు తెలిపే అంశంలో తటస్థ వైఖరిని అవలంభించే అవకాశం ఉంది. అదే జరిగితే బీజేపీకి వైసీపీ రహస్య మిత్రపక్షమని ఆరోపిస్తున్న టీడీపీకి మరో పదునైన అస్త్రం చిక్కినట్టే అవుతుంది.
  మరోవైపు, మొన్నటి అమిత్ షా టూర్‌కు నిరసనల సెగ నేపథ్యంలో ప్రధాని మోదీ టూర్‌కు సంబంధించి ఏపీ బీజేపీ నేతలు మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రాష్ట్రంలో పరిస్థితులను ఎప్పటికప్పుడు బీజేపీ హైకమాండ్‌తో పాటు కేంద్రానికి చేరవేస్తున్న ఆ పార్టీ నేతలు.. అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తున్నారు. గత అనుభవాల నేపథ్యంలో కేంద్రం ఈసారి మోడీ టూర్ కు ఎస్పీజీతో పాటు సీఆర్పీఎఫ్, ఇతర బలగాలతో అదనపు భద్రత కల్పించే అవకాశం ఉంది.
  First published: