సీఎం జగన్ కేబినెట్‌లో ఇద్దరు మంత్రులకు పదవీగండం...?

ఆంధ్రప్రదేశ్‌లో శాసనమండలి భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకుంటున్న వేళ అదే సభలో సభ్యులుగా ఉన్న ఇద్దరు మంత్రులు కూడా తమ పదవులు కోల్పోయే ప్రమాదం పొంచి ఉంది.

news18-telugu
Updated: January 25, 2020, 5:13 PM IST
సీఎం జగన్ కేబినెట్‌లో ఇద్దరు మంత్రులకు పదవీగండం...?
వైఎస్ జగన్
  • Share this:
ఆంధ్రప్రదేశ్‌లో శాసనమండలి భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకుంటున్న వేళ అదే సభలో సభ్యులుగా ఉన్న ఇద్దరు మంత్రులు కూడా తమ పదవులు కోల్పోయే ప్రమాదం పొంచి ఉంది. ప్రస్తుతం డిప్యూటీ సీఎం కమ్ రెవెన్యూ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, మార్కెటింగ్ శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణారావు మండలి సభ్యులుగా ఉన్నారు. మండలి రద్దయితే మిగిలిన సభ్యులతో పాటు వీరిద్దరూ సభ్యత్వాన్ని కోల్పోతారు. అప్పుడు మంత్రి పదవులను సైతం వదులుకోవాల్సి వస్తుంది.
ఏపీలో శాసనమండలి రద్దు కోసం ప్రభుత్వం తీవ్రంగా కసరత్తు చేస్తోంది. మూడు రాజధానులకు ఉద్దేశించిన రెండు కీలక బిల్లులను మండలి ఛైర్మన్ సెలక్ట్ కమిటీకి పంపాలని నిర్ణయించిన నేపథ్యంలో శాసనసభ దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబించని మండలి మనకు అవసరమా అనే ప్రశ్నను సీఎం జగన్ సహా వైసీపీ మంత్రులంతా వ్యక్తం చేశారు. ప్రజల చేత ఎన్నుకోబడిన సభ్యులతో కూడిన శాసనసభ తీసుకున్న నిర్ణయాన్ని పరోక్షంగా ఎన్నికైన మండలి సభ్యులు అడ్డుకోవడం ప్రజల్లో తప్పుడు సంకేతాలు పంపుతుందని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో మండలి రద్దు కోసం అవసరమైన కసరత్తు చేస్తోంది. అదే సమయంలో మండలి రద్దు నిర్ణయం కనుక ఫైనల్ అయితే అందులో సభ్యులుగా ఉన్న ఇద్దరు మంత్రులు సహా మరో ఏడుగురు వైసీపీ సభ్యులు కూడా తమ పదవులు కోల్పోతారు. మండలి సభ్యత్వం కోల్పోవడం ఓ ఎత్తయితే మంత్రి పదవులను కూడా త్యాగం చేయాల్సి రావడం ఇద్దరు మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణారావుకు తప్పని సరిగా మారుతుంది. అయినా ప్రభుత్వ నిర్ణయాన్ని గౌరవించి పదవులు త్యాగం చేసేందుకు కూడా సిద్ధమని ఇద్దరు మంత్రులు శాసనసభలోనే ప్రకటించారు.

పిల్లి సుభాష్ చంద్రబోస్


తాజా పరిణామాల నేపథ్యంలో ఒకవేళ మండలి రద్దయి మంత్రులుగా ఉన్న ఇద్దరు తమ పదవులను వదులుకోవాల్సి వస్తే వారికి సీఎం జగన్ ఎలాంటి హామీ ఇవ్వబోతున్నారనేది కూడా కీలకమే. గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసిన బోస్, మోపిదేవి ఓటమి పాలయ్యారు. తూర్పుగోదావరి జిల్లా మండపేట నుంచి పోటీ చేసిన బోస్, గుంటూరు జిల్లా రేపల్లె నుంచి పోటీ చేసిన మోపిదేవి తమ ప్రత్యర్ధుల చేతిలో ఓటమి పాలయ్యారు. అయినా గతంలో వైఎస్ఆర్ కుటుంబం పట్ల వీరిద్దరూ చూపిన విధేయతను దృష్టిలో ఉంచుకుని జగన్ వీరిద్దరికీ మంత్రి పదవులు ఇచ్చి గౌరవించారు. గతంలో వీరిద్దరూ చేసిన త్యాగాలను ఓసారి గమనిస్తే వైఎస్ కుటుంబం పట్ల వీరి విధేయత అర్ధమవుతుంది. వైఎస్ మరణం తర్వాత సీఎం అయిన రోశయ్య మంత్రివర్గంలో కూడా పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి మంత్రులుగా ఉన్నారు. అయితే బోస్ మాత్రం వైఎస్ లేని కేబినెట్ లో తానూ ఉండలేనంటూ తన మంత్రి పదవిని వదులుకున్నారు. అప్పట్లో జగన్ స్దాపించిన వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరి ఆయనకు అండగా నిలిచారు. అప్పటి నుంచి పార్టీకి వీర విధేయుడిగానే ఉన్నారు. దీంతో జగన్ తన తొలి కేబినెట్ లోనే ఆయనకు రెవెన్యూ మంత్రితో పాటు డిప్యూటీ సీఎం పదవిని ఇచ్చి గౌరవించారు.

మోపిదేవి వెంకటరమణ (పశు సంవర్దక శాఖ, మత్స్యశాఖ, మార్కెటింగ్)


అదే కోవలో మోపిదేవి వెంకటరమణారావు కూడా వైఎస్ తర్వాత రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గాల్లో పనిచేశారు. బోస్ తరహాలో మంత్రిపదవికి రాజీనామా చేయకపోయినా జగన్ అక్రమాస్తుల కేసులో ఆయనతో పాటు జైలుకు వెళ్లారు. ఆ తర్వాత బెయిల్ పై బయటికి వచ్చారు. ఓ దశలో మోపిదేవి జైల్లో ఉండగానే ఆయన ఆరోగ్యం తీవ్రంగా క్షీణించింది. అయినా తాను ఆ పరిస్ధితికి రావడానికి జగన్ కానీ ఆయన కుటుంబ సభ్యులు కానీ కారణమని ఏనాడూ నిందించలేదు. బెయిల్ పై బయటికి వచ్చాక వైసీపీలో చేరడమే కాకుండా జగన్ కు మొన్నటి ఎన్నికల్లో అండగా నిలిచారు. దీంతో మోపిదేవికి కూడా మార్కెటింగ్, పశుసంవర్ధక శాఖల మంత్రిగా జగన్ అవకాశం కల్పించారు. విథేయతే ప్రామాణికంగా రాజకీయాలు నడిపిన బోస్, మోపిదేవి ఇద్దరూ ఇప్పుడు జగన్ కనుక శాసనమండలి రద్దు నిర్ణయం తీసుకుంటే మరోసారి పదవులు కోల్పోక తప్పదు. కానీ అందుకు వారిద్దరూ సిద్ధపడుతున్నారంటే జగన్ మీద వారికి ఉన్న నమ్మకమేంటో తెలుస్తుంది.

(సయ్యద్ అహ్మద్, అమరావతి కరస్పాండెంట్, న్యూస్‌18)
Published by: Ashok Kumar Bonepalli
First published: January 25, 2020, 5:13 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading