news18-telugu
Updated: November 17, 2020, 4:41 PM IST
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్(ఫైల్ పొటో)
Janasena contest in GHMC Elections: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేస్తుందని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్పష్ట చేశారు. ఈ మేరకు పవన్ కళ్యాణ్ ఓ ప్రకటన జారీ చేశారు. ‘గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేయాలని యువ కార్యకర్తల విజ్ఞప్తి మేరకు నిర్ణయించాం. తెలంగాణ రాష్ట్రంలోనూ, GHMC పరిధిలోను పార్టీలో క్రియాశీలకంగా ఉన్న కార్యకర్తలు, యువ జనసైనికులు నుంచి ఈ అంశంపై పలు విజ్ఞప్తులు వచ్చాయి. వారి వినతి మేరకు GHMC ఎన్నికల్లో పోటీ కి సన్నద్ధం కావాలని పార్టీ నాయకులను, నగర పరిధిలోని కమిటీలకు స్పష్టం చేశాను. నా వద్దకు వచ్చిన కార్యకర్తలు, కమిటీల ప్రతినిధులు ఇప్పటికే పలు దఫాలు సమావేశమై చర్చించుకున్నారు. GHMCలోని పలు డివిజన్లలో ఉన్న జనసేన కమిటీలు క్షేత్రస్థాయిలో పని చేస్తూ... ఇప్పటికే ప్రజల పక్షాన నిలబడ్డాయి. తమ కార్యకలాపాలపై సమగ్రంగా సమీక్షించుకుంటున్నాయి. ఈ ఎన్నికల్లో పోటీ చేయాలని క్షేత్ర స్థాయిలోని కార్యకర్తలు బలంగా కోరుకొంటున్నారు. వారి అభీష్టానికి అనుగుణంగా జనసేన పార్టీ GHMC ఎన్నికల్లో అభ్యర్థులను నిలుపుతుంది.’ అని ఆ ప్రకటనలో పవన్ కళ్యాణ్ చెప్పారు. అయితే, జనసేన ఒంటరిగా పోటీ చేస్తుందా? లేకపోతే బీజేపీతో కలసి పోటీకి దిగుతుదా అనే దానిపై ఆయన క్లారిటీ ఇవ్వలేదు.
ఏపీలో బీజేపీ-జనసేన పొత్తు వుంది. తెలంగాణలోనూ వుంటుందనుకుంటారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడైన తర్వాత బండి సంజయ్ పవన్‌తో సమావేశం కూడా అయ్యారు. గ్రేటర్ ఎన్నికల కోసమే వీరు కలిశారన్న మాటలు అప్పుడు వినిపించాయి. ఇప్పడు కూడా జనసేన పోటీ చేస్తుందని చెప్పారు గానీ, బీజేపీతో పొత్తు వుంటుందా, వుండదా మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. గ్రేటర్ హైదరాబాద్‌లో భారీ సంఖ్యలో సీమాంధ్ర ఓటర్లున్నారు. కార్పొరేటర్ల గెలుపోటములను ప్రభావితం చెయ్యగలరు. తెలంగాణ ప్రజానీకంలోనూ పవన్ కల్యాణ్‌కు, ఫాలోయింగ్ వుంది. ఇటు సీమాంధ్ర, అటు తెలంగాణ అభిమానుల ఓట్లపైనే జనసేన ఆశలు. అంతేకాదు, కాపువర్గం ఓట్లు కూడా చెప్పుకోగదగ్గ సంఖ్యలో వున్నాయి. ఇలా సీమాంధ్ర ఓట్లు, అటు కాపుసామాజికవర్గం లెక్కలు జనసేన బరిలో దిగేందుకు ఊతం ఇచ్చాయని భావిస్తున్నారు.
జీహెచ్ఎంసీ ఎన్నికల షెడ్యూల్
జీహెచ్ఎంసీ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారధి షెడ్యూల్, నోటిఫికేషన్ జారీ చేశారు. డిసెంబరు 1న పోలింగ్ నిర్వహించనున్నట్లు స్టేట్ ఎలక్షన్ కమిషనర్ పార్థసారథి ప్రకటించారు. ఈ రోజు ఆయన ఎన్నికల షెడ్యూల్ విడుదల చేశారు. ఈ సారి మేయర్ పీఠం జనరల్ మహిళకు కేటాయించిన్నట్లు తెలిపారు. రేపటి నుంచే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుందని వివరించారు. 18, 19, 20 తేదీల్లో నామినేషన్లు స్వీకరించనున్నట్లు వెల్లడించారు. 21న వాటిని పరిశీలిస్తామన్నారు. 22న మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లను విత్ డ్రా చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. అదే రోజు తుది అభ్యర్థుల జాబితాను, కేటాయించిన గుర్తులను ప్రకటిస్తామన్నారు. డిసెంబర్ 1 ఎన్నికలను నిర్వహిస్తామని ప్రకటించారు. ఆ రోజు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ ఉంటుందని ప్రకటించారు. 4న ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి ఉంటుంది.
Published by:
Ashok Kumar Bonepalli
First published:
November 17, 2020, 4:27 PM IST