పార్టీ విస్తృతస్థాయి సమావేశం మధ్యలోనే ఢిల్లీ బయలుదేరి వెళ్లిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్... ఇవాళ ఉదయం 11 గంటలకు విశాఖ రానున్నారు. ఆ తర్వాత విశాఖ నుంచి రోడ్డుమార్గంలో తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడకు వెళ్తారు. కాకినాడ వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అభిమానుల దాడిలో గాయపడినవారిని జనసేన కార్యకర్తల్ని పవన్ పరామర్శిస్తారు. వారికి పార్టీ అండగా ఉంటుందని హామీ ఇవ్వనున్నారు. ఆ తర్వాత పార్టీ ముఖ్య నేతలతో సమావేశం అవుతారు. ఢిల్లీ టూర్ విశేషాల్ని వారికి వివరిస్తారు. ఐతే... పవన్ కాకినాడ పర్యటనపై ఏపీ రాజకీయాల్లో జోరుగా చర్చ సాగుతోంది. ఆదివారం ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఇంటి దగ్గర ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. ద్వారంపూడి చంద్రశేఖర్.. పవన్ కళ్యాణ్‌పై నోటికొచ్చినట్లు మాట్లాడటంతో... జనసేన కార్యకర్తలు ఫైర్ అయ్యారు. ద్వారంపూడి ఇంటి దగ్గర ర్యాలీ చేశారు. అంతే... జనసేన కార్యకర్తలు, ద్వారంపూడి మద్దతుదారుల గొడవ జరిగింది. ద్వారంపూడి అభిమానులు... రాళ్లతో కొట్టడంతో... జనసేన కార్యకర్తలకు గాయాలయ్యాయి. ఐతే... పోలీసులు జనసేన నేతలపై కేసులు పెట్టారు. దాంతో పవన్ కళ్యాణ్ ఫుల్లుగా ఫైర్ అయ్యారు. ఢిల్లీ నుంచి నేరుగా కాకినాడకు వచ్చి విషయం తేల్చేస్తానని అనడంతో పోలీసులు కాస్త మెత్తబడ్డారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కాకినాడ వచ్చి... ఎలా రియాక్ట్ అవుతారన్నది చర్చనీయాంశం అయ్యింది. ఆయన రాక కోసం అభిమానులు, కార్యకర్తలు ఎదురుచూస్తున్నారు.
మరోవైపు పవన్ కళ్యాణ్ తన ఢిల్లీ పర్యటనలో... బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డాను కలిశారు. ఏపీలో బీజేపీతో పొత్తు అంశంతో పాటు రాజధాని తరలింపు వంటి విషయాలపై చర్చించినట్లు తెలిసింది. అమరావతి అంశంలో రైతులకు అండగా నిలవాలనీ... రాజధానిని తరలించకుండా అడ్డుకోవాలని పవన్ కోరినట్లు సమాచారం. ఐతే... దీనిపై నడ్డా ఎలాంటి హామీ ఇవ్వలేదని తెలిసింది. ఈ విషయంపై ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో మాట్లాడాలని పవన్‌కు సూచించినట్లు సమాచారం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: AP News, AP Politics, Pawan kalyan