ఆంధ్రప్రదేశ్ (Andhra pradesh) కృష్ణాజిల్లా (Krishna District) గుడివాడ (Gudivada) నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Janasena Chief Pawan kalyan) రోడ్ షో నిర్వహించారు. స్థానిక మంత్రి కొడాలి నానిని (Kodali Nani) టార్గెట్ చేస్తూ విమర్శలు సంధించారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ కృష్ణాజిల్లాలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా అధికార పార్టీని టార్గెట్ చేస్తూ విమర్శలు సంధిస్తున్నారు. నివర్ తుఫాన్ బాధిత రైతులను ఆదుకోవాలని కోరుతూ కలెక్టర్ ఇంతియాజ్ కు వినతిపత్రం ఇచ్చేందుకు పవన్ భారీ ర్యాలీతో మచిలీపట్నం వెళ్లారు. ఈక్రమంలో విజయవాడ నుంచి రోడ్డు మార్గాన కంకిపాడు, మానికొండ మీదుగా గుడివాడ చేరుకున్న పవన్ కల్యాణ్ కు జనసేన కార్యకర్తలు, నేతలు ఘనస్వాగతం పలికారు. గుడివాడకు తొలిసారిగా వచ్చానని.. ఇంతటి అపూర్వ స్వాగతం పలికినందుకు ప్రతి ఒక్కరికీ రుణపడి ఉంటానని పవన్ అన్నారు. గుడివాడ నెహ్రూ చౌక్ సెంటర్లో మాట్లాడిన పవన్.. స్థానిక ఎమ్మెల్యే, మంత్రి కొడాలి నానిపై విరుచుకుపడ్డారు. నేరుగా కొడాలి నాని పేరును ప్రస్తావించకపోయినా.. స్థానిక సమస్యలను లేవనెత్తుతూ విమర్శలు సంధించారు.
గుడివాడ సెంటర్లో ఉండి చెప్తున్నా..!
మంత్రి కొడాలి నాని సొంత నియోజకవర్గం కావడంతో పవన్ కల్యాణ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రజాప్రతినిథులు బాధ్యతగా ఉండకపోతే ప్రజలు రోడ్లపై పడేస్తారని హెచ్చరించారు. భయపెట్టి పాలిస్తామంటే సహించడానికి ఎవరూ సిద్ధంగా లేరన్నారు. కంకిపాడు నుంచి గుడివాడ వచ్చేవరకు రోడ్డు దారుణంగా ఉంటే ప్రజాప్రతినిథులు ఏం చేస్తున్నారని పవన్ కల్యాణ్ నిలదీశారు. ప్రజలు ఇక్కడి ప్రజాప్రతినిథి గట్టిగా ప్రశ్నించాలని పిలుపునిచ్చారు. వైసీపీ ప్రజాప్రతినిథులు పేకాట క్లబ్బులు నిర్వహించిన సమర్ధవంతంగా ప్రభుత్వాన్ని నడపలేకపోతున్నారని పవన్ విమర్శించారు. దాష్టీకం చేసేవారిని.. నోటి దురుసుగా మాట్లాడేవారు ఎవరైనా సరే జనసేన బలంగా ఎదుర్కొంటుందని స్పష్టం చేశారు. గుడివాడ నడిబొడ్డున నిలబడి చెప్తున్నా.. ఆంధ్రప్రజలందరికీ నా అంతిమ శ్వాస వరకూ అండగా నిలబడతానని పవన్ అన్నారు.
సినిమాలు చేస్తే రాజకీయం చేయకూడదా..?
తాను సినిమాల్లో నటించడంపై వస్తున్న విమర్శలకు పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. సినిమాలు చేసేవాళ్లు రాజకీయాలు చేసే అర్హత లేదని ఎలా చెప్తారని పవన్ అన్నారు. పేకాట క్లబ్బులు నిర్వహించేవాళ్లకు రాజకీయాలు చేసే అర్హత ఉందా అని నిలదిశారు. అలాగే సిమెంట్ ఫ్యాక్టరీలు, మీడియా సంస్థలున్నవాళ్లు రాజకీయాల్లో ఉంటే లేని సమస్యల సినిమావాళ్లుంటే ఎందుకన్నారు. ఇష్టమొచ్చినట్లు అక్రమాలు చేస్తుంటే చొక్కాపట్టుకొని ప్రశ్నిస్తామని.. ఎదురుతిరిగే రోజులు ఎంతో దూరంలో లేవని జనసేనాని అన్నారు.
సాధారణంగా స్థానిక సమస్యలే ఎజెండాగా విమర్శలు చేసే జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈసారి పేకాట క్లబ్బులు, నోటి దురుసు అంటూ పదును పెంచడం జనసేన కార్యకర్తల్లో ఉత్సాహం పెంచింది. మరి పవన్ కల్యాణ్ వేసిన పంచులకు కొడాలి నాని రియాక్షన్ ఎలా ఉంటుంందో చూడాలి.