బీజేపీకి పవన్ హెచ్చరిక.. జనసేనాని అసలు వ్యూహం ఇదే

బీజేపీ పంచన చేరి వైసీపీ ప్రభుత్వంపై పోరాడితే క్యాడర్ ను కాపాడుకోవచ్చని భావించిన పవన్ కు బీజేపీ-వైసీపీ పొత్తు వార్తలు మరో షాకిచ్చాయి. దీంతో పరిస్ధితిని గమనించిన పవన్.. వైసీపీ, బీజేపీ నేతల కంటే ముందుగా తానే క్లారిటీ ఇచ్చేశారు.

news18-telugu
Updated: February 18, 2020, 8:40 PM IST
బీజేపీకి పవన్ హెచ్చరిక.. జనసేనాని అసలు వ్యూహం ఇదే
పవన్ కళ్యాణ్, కన్నా లక్ష్మీనారాయణ
  • Share this:
(సయ్యద్ అహ్మద్, న్యూస్ 18 విజయవాడ కరెస్పాండెంట్)

ఏపీ సీఎం వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన నేపథ్యంలో వైసీపీ, బీజేపీ మధ్య పొత్తు చిగురించవచ్చన్న అంచనాలు మొదలయ్యాయి. గతంతో పోలిస్తే ప్రధాని మోడీతో పాటు హోంమంత్రి అమిత్ షా, న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ కూడా జగన్ కు రెడ్ కార్పెట్ స్వాగతం పలకడమే దీనికి కారణం. అదే సమయంలో ఏపీలో శాసనమండలి రద్దుకు కూడా కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందన్న వార్తలు గుప్పుమన్నాయి. అయితే బీజేపీ-వైసీపీ పొత్తుపై వారిద్దరి కంటే ప్రస్తుతం కాషాయ పార్టీతో భాగస్వామిగా ఉన్న జనసేనాని పవన్ ఎందుకు కలవరపడుతున్నారనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

ఏపీలో త్వరలో స్ధానిక సంస్ధల ఎన్నికలకు రంగం సిద్దమవుతోంది. గతేడాది సార్వత్రిక ఎన్నికల్లో ఘోర ఓటమితో డీలాపడిన టీడీపీ, జనసేన పార్టీలు వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు రోజువారీ కార్యక్రమాలతో బిజీగా ఉంటున్నాయి. అమరావతి నుంచి రాజధాని తరలింపుతో పాటు అంతకు ముందు ఇసుక కొరత, ఇంగ్లీష్ మీడియం వంటి ప్రభుత్వ విధానాలను ఇరు పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించడంతో పాటు ఆందోళనలకు దిగాయి. అయితే వీటి వల్ల ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీకి కాస్తోకూస్తో మైలేజ్ దక్కగా.. జనసేనకు మాత్రం ఎలాంటి ఊరట దక్కలేదు. దీంతో ఢిల్లీలో బీజేపీ పెద్దలను కలిసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాషాయ పార్టీతో పొత్తుకు సిద్ధమయ్యారు. 2024 ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా బీజేపీతో కలిసి పనిచేయాలని నిర్ణయించిన పవన్.. ఉమ్మడి కార్యాచరణ చేపట్టాలని భావించారు. అయితే బీజేపీ కేంద్ర పెద్దల ఆలోచనలు వేరుగా ఉండటంతో రాష్ట్రంలో ఆ పార్టీతో కలిసి ఉమ్మడిగా కార్యాచరణ ప్రకటించలేని పరిస్ధితి పవన్ కు ఎదురవుతోంది.

అదే సమయంలో వైసీపీ అధినేత కమ్ ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ పర్యటనతో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. రాజధాని అమరావతి విషయంలో కేంద్రం జోక్యం చేసుకుంటుందని తనను కలిసిన రైతులకు హామీ ఇచ్చిన పవన్ కు కేంద్రం ఒక్కసారిగా షాకిచ్చింది. రాజధాని రాష్ట్ర పరిధిలోని వ్యవహారమంటూ కేంద్రమంత్రులు తేల్చిచెప్పడంతో టీడీపీతో పాటు పవన్ కూడా షాకయ్యారు. మరోవైపు బీజేపీతో పొత్తు నాటికి జనసేనలో కాస్తోకూస్తో పేరున్న నేతలంతా ఇతర పార్టీలకు క్యూకట్టేశారు. మిగిలిన నేతలు కూడా రాబోయే స్ధానిక సంస్ధల ఎన్నికల నాటికి ఉంటారో లేదో తెలియదు. దీంతో బీజేపీ పంచన చేరి వైసీపీ ప్రభుత్వంపై పోరాడితే క్యాడర్ ను కాపాడుకోవచ్చని భావించిన పవన్ కు బీజేపీ-వైసీపీ పొత్తు వార్తలు మరో షాకిచ్చాయి. దీంతో పరిస్ధితిని గమనించిన పవన్.. వైసీపీ, బీజేపీ నేతల కంటే ముందుగా తానే క్లారిటీ ఇచ్చేశారు. బీజేపీ-వైసీపీ పొత్తు పెట్టుకుంటే తాను బీజేపీని వీడతానంటూ హెచ్చరికలు కూడా పంపారు. వీటి వెనుక భారీ వ్యూహమే ఉన్నట్లు అర్ధమవుతోంది.గతేడాది సార్వత్రిక ఎన్నికల్లో పరాజయం, ఆ తర్వాత పార్టీని ఒక్కొక్కరుగా వీడిపోతున్న నేతలు, బీజేపీతో పొత్తుతో స్ధానిక సంస్ధల ఎన్నికల్లో కనీసం పరువు కాపాడుకోవచ్చన్న ప్రయత్నాల్లో ఉన్న పవన్ కు బీజేపీ-వైసీపీ పొత్తు పెట్టుకుంటే తన పరిస్ధితి ఏమిటన్న సందేహాలు మొదలయ్యాయి. దీంతో ఓవైపు పార్టీ క్యాడర్ ను కాపాడుకోవాలన్నా, స్దానిక సంస్దల ఎన్నికల్లో కనీస ప్రభావం చూపాలన్నా బీజేపీతో పొత్తును తప్పనిసరిగా పవన్ భావిస్తున్నారు. దీంతో ఆ పార్టీ వైసీపీతో పొత్తు కోసం చేస్తున్న ప్రయత్నాలను మొగ్గలోనే తుంచేయాలన్న ఆలోచనతోనే పవన్ .. వైసీపీ-బీజేపీ కంటే సీరియస్ గా స్పందించి అలాంటి అవకాశమే లేదని తేల్చేసినట్లు అర్ధమవుతోంది.
First published: February 18, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు