Pawan kalyan:ఆయనపై అత్యాచారం చేసిందెవరు? టెర్రరిస్టులా ఊగిపోతావేం? -మంత్రి Kannababu కౌంటర్

పవన్ కు కన్నబాబు కౌంటర్

Kannababu counter to Pawan kalyan | .. వరుస పర్యటనలు, సభలు, నిరసన కార్యక్రమాలతో జనసేనాని పవన్ కల్యాణ్ ఏపీ రాజకీయాల్లో కాక పుట్టిస్తున్నారు. శనివారం నాడు తూర్పు గోదావరి జిల్లాలో నిర్వహించిన శ్రమదానంలో పవన్ మరోసారి తీవ్ర రాజకీయ విమర్శలు చేశారు. మంత్రి కన్నబాబు తాజాగా మీడియాతో మాట్లాడుతూ పవన్ ను గాడ్సే అనునాయుడిగా పోల్చారు. టెర్రరిస్టు అనే ట్యాగ్ ను కూడా జోడించారు. తాను అత్యాచారానికి గురయ్యానన్న పవన్ కు కన్నబాబు అనూహ్య రీతిలో బదులిచ్చారు.

  • Share this:
వరుస పర్యటనలు, సభలు, నిరసన కార్యక్రమాలతో జనసేనాని పవన్ కల్యాణ్ ఏపీ రాజకీయాల్లో కాక పుట్టిస్తున్నారు. శనివారం నాడు తూర్పు గోదావరి జిల్లాలో నిర్వహించిన శ్రమదానంలో పవన్ మరోసారి తీవ్ర రాజకీయ విమర్శలు చేశారు. మంత్రి కన్నబాబు తాజాగా మీడియాతో మాట్లాడుతూ పవన్ ను గాడ్సే అనునాయుడిగా పోల్చారు. టెర్రరిస్టు అనే ట్యాగ్ ను కూడా జోడించారు. తాను అత్యాచారానికి గురయ్యానన్న పవన్ కు కన్నబాబు అనూహ్య రీతిలో బదులిచ్చారు.

రోడ్ల దుస్థితిపై నిరసనగా జనసేన చేపట్టిన శ్రమదానం కార్యక్రమంలో భాగంగా శనివారం రాజమండ్రి నగరంలోని హుకుంపేటలో పవన్ కల్యాణ్ పర్యటించారు. అక్కడ పాడైపోయిన రోడ్డుకు సిమెంట్ పూతపూశారు. అనంతరం భారీ జనసందోహాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ వైసీపీపై తీవ్ర విమర్శలు చేశారు. కులం, మతం, ప్రాంతం.. ఇలా సున్నితమైన అంశాలపైనే పవన్ ప్రసంగం సాగడంతో జగన్ ప్రభుత్వం అప్రమత్తమైంది. పవన్ సభ ముగిసిన కాసేపటికే మంత్రి కురసాల కన్నబాబు మీడియా ముందుకొచ్చి జనసేనాని వాదనకు కౌంటరిచ్చారు. ప్రెస్ మీట్ లో కన్నబాబు ఏం చెప్పారో ఆయన మాటల్లోనే..పవన్ గాడ్సే కల్యాణ్?
‘‘ఈ దేశానికి, యావత్ ప్రపంచానికి అహింసను బోధించి సత్యాగ్రహ మార్గంలో ఎలా నడుచుకోవాలో చూపించిన గొప్ప నేత గాంధీజీ జయంతి. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ సత్యాగ్రహాం పేరుతో కార్యక్రమాన్ని ప్రకటించింది. సరే, ఈ పిలుపుతో పవన్ ఏదో ఒక రోడ్డునైనా బాగు చేస్తారు కదాని నేను అనుకున్నాను. కానీ కచ్చితంగా 1నిమిషం, 8సెకన్ల పాటు మాత్రమే పార పట్టుకుని, ఫొటోలు, వీడియోలు రాగానే వాటిని పక్కనపెట్టేసి నేరుగా రాజకీయ ప్రసంగానికి దిగారు. గాంధీ నేర్పిన సత్యాగ్రహాన్ని బహుశా పవన్ కల్యాణ్ లాగా ఎవరూ ట్విస్ట్ చేసి ఉండరు, ఇదేదో స్టార్ట్, కెమెరా, యాక్షన్, కట్ మాదిరిగా చేసినట్లు నాకు అనిపిస్తోంది. అహింసాదినోత్సవం రోజున పవన్.. వైసీపీపై యుద్ధం ప్రకటిస్తున్నానని చెప్పాడు. గాంధీ జయంతి నాడు ఆయనను పొట్టన పెట్టున గాడ్సే తరహాలో యుద్ధ భాష మాట్లాడుతున్నారు. ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలని, స్వరాజ్యాన్ని అనుసరించాలని మహాత్ముడు చెప్పాడు. కానీ పవన్ మాత్రం యుద్ధాన్ని సగర్వంగా ప్రకటించారు. పైగా ఏ సైజు యుద్ధం కావాలో మీరే కోరుకోమంటున్నారు. జనసేనానికి నాదొక సూటి ప్రశ్న.. అసలు

యుద్దం ఎవరితో? ఎందుకు?
వైసీపీపై పవన్ కల్యాణ్ యుద్ధాన్ని ఎందుకు ప్రకటించారు? సీఎం జగన్ పేదరికంపై యుద్ధాన్ని ప్రకటించారు. సమాజంలో వ్యవస్థల మార్పు కోసం పోరాడుతున్నారు. ప్రజలకిచ్చిన మాటను నిలబెట్టుకోడానికి ఎలాంటి యుద్ధాలనైనా ఎదుర్కోడానికి సిద్దంగా ఉన్నారు. కొవిడ్ కష్టకాలంలో ప్రజల ఖాతాల్లోకి లక్షల కోట్లు వేసినందుకు జగన్ పై యుద్ధమా, జనం కడుపులు నింపుతున్నందుకు జనసేనకు కోపమా? ధనికులకు ఏమాత్రం తక్కువ కాకుండా పేద పిల్లలకు ఇంగ్లీష్ మీడియం బోధిస్తూ వసతులు కల్పిస్తున్నందుకు యుద్ధమా? మెరుగైన విద్యా, వైద్యం అందిస్తున్నందుకా? అసలు జనసేన యుద్దం ఎందుకు? ఎవరు?

నిజానికి 2009లోనే ఈ పవన్ కల్యాణ్ దివంగత నేత వైఎస్సార్ ను ఉద్దేశించి ఎన్ని అనుచితమైన మాట్లాడారో మనమంతా చూశాం. 2014లో టీడీపీకి మద్దతుగా పవన్ చేసిన యుద్ధమేటో చూశాం. 2019లో చెట్టుచాటు నుంచి సాయం చేసినట్లుగా ఆయన చేసిన యుద్ధమేంటో జనం చూశారు. విషయం ప్రజలకు తెలుసు కాబట్టే వారంతా జగన్ నాయకత్వాన్ని సమర్థించి, అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో వైసీపీకి వెన్నుదన్నుగా నిలిచారు. చంద్రబాబు కడుపుమంటను ఆయన స్నేహితుడైన పవన్ పంచుకుంటున్నట్లుంది.. వర్షాకాలం ముగిసిన వెంటనే రాష్ట్రమంతటా రోడ్ల మరమ్మతులు చేయాలిన ప్రభుత్వం ఇప్పటికే రూ.2వేల కోట్లు సిద్ధం చేసింది. నాలుగు రోజుల్లో రోడ్లు ఎలాగో బాగుపడబోతున్నాయి కాబట్టి, అదేదో జనసేన వల్లే అయినట్లు బిల్డప్ ఇచ్చుకోడానికి పవన్ చేస్తోన్న చీప్ ట్రిక్స్ లాగా ఇవాళ్టి శ్రమదానం కార్యక్రమం ఉంది. పవన్ పూడ్చిన రెండు గోతులతో సమస్య తీరిందా? ఎంతకాలం ఈ డ్రామా రాజకీయాలు చేస్తారు?

ముద్రగడను పట్టించుకున్నాడా?
ఏ స్థాయి యుద్ధం కావాలో తేల్చుకోవాలనడం గాడ్సే తరహా కాదా? మీకు యుద్ధాలు సరదాగా ఉందేమో. మాకైతే.. మీరు 12 ఏళ్లలో ఎక్కడా గెలవలేదే అని బాధపడుతున్నట్లుగా కనిపిస్తున్నాడు. జనసేన ప్రారంభం నుంచి కుల, మత ప్రస్తావన లేదని చెప్పారు. కానీ ఆయన ప్రతి మీటింగ్ లో ఆ రెండిటిని ప్రస్తావన కచ్చితంగా ఉంటోంది. ఇవాళైతే పూర్తిగా కులం గురించి తప్ప మరో మాటలేదు. కాపులు మాత్రమే తనను ఓన్ చేసుకోవడం ఇష్టం లేదని పార్టీ కొత్తలో చెప్పిన పవన్, ఇవాళ అదే కులం కార్డును వాడుతున్నారు. కాపు రిజర్వేషన్ నేత ముద్రగడ పద్మనాభం పేరును ప్రస్తావించారు. ముద్రగడ పోరాటం చేసిననాడు పవన్ ఎక్కడున్నాడు? చంద్రబాబు పంచన చేరి కనీసం నోరైనా ఎత్తాడా? ఆనాడు ముద్రగడ ఇంట్లోకి పోలీసులు చొరబడి అరెస్టు చేస్తే, చిరంజీవి స్పందించారేగానీ, పవన్ ఒక్కమాటైనా అన్నాడా?

గుంతలు పూడ్చుతానని కులం గోతులా?
కాపులు ముదుకొస్తే, తెలగ, బలిజ, ఒంటరి, కొప్పుల వెలమ, దళితులు అందరూ కలవాలని పవన్ అంటున్నాడు. అసలీ మాటలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? కమ్మ సామాజిక వర్గాన్ని వైసీపీ వర్గ శత్రువులగా చూస్తోందని పవన్ అంటున్నాడు. జగన్ సర్కారులో కమ్మ సామాజిక వర్గం భాగస్వామ్యంగా లేదా? సున్నితమైన కులం అంశం చుట్టూనే రాజకీయాలు చేయబోతున్నట్లు పవన్ చెప్పకనే చెప్పాడు. కులాన్నే అజెండాగా నీచానికి దిగజారబోతున్నట్లు అధికారికంగా వెల్లడించారు. బీజేపీతో కలిసున్నందుకు మతాన్ని కూడా వాడుకుంటారు. రాబోయే రోజుల్లో చంద్రబాబుతో కలిసి కుల రాజకీయాలు చేయబోతున్నట్లు పవన్ స్పష్టత ఇచ్చారు. నిజానికి బాబు, పీకే నిత్యం కలిసే ఉన్నారు. అయితే జగన్ మాత్రం సింహం తరహాలో సింగిల్ గానే రాజకీయాలు చేస్తారు. వచ్చిందేమో గోతులు పూడ్చేందుకు నిరసనకు, చేసిందేమో కులాల ప్రస్తావన. కాపుల్ని రెచ్చగొడుతూ, మిగతా కులాలు వారికి అండగా ఉండాలనడంలో పవన్ పరమార్థం ఏమిటి? జగన్ సీఎం అయితే రాజకీయాల నుంచి తప్పుకుంటానని పవన్ గతంలో అన్నారు. ఏమైంది? అప్పటికప్పుడే సీఎం.. సీఎం అరవాలని కోరతారు, అంతలోనే వద్దని కోప్పడతారు.. ఏం మాట్లాడాలో అభిమానులకు అర్థం కావట్లేదు.

పవన్ ఉగ్రవాదిలా ఊగుతున్నారు
జగన్ కోడికత్తి కేసును, వివేకానంద హత్య కేసును పవన్ పదే పదే ప్రస్తావిస్తున్నారు. జగన్ కేసును ఎన్ఐఏ, వివేకా కేసును సీబీఐ దర్యాప్తు చేస్తున్నాయి. అవి రెండూ కేంద్ర సంస్థలు. పవన్ మద్దతిచ్చిన బీజేపీనే కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి మీరైనా వారిని నిలదీయండి. కేసుల ఎందాకా వచ్చాయో తెలుసుకోండి. ఆలయాలపై దాడులుగానీ మరే ఇతర సున్నిత అంశాల్లో జాగ్రత్తగా వ్యవహరించకుండా రెచ్చగొట్టుడు ధోరణి తగదు. అసలు ప్రజాస్వామ్యంలో వర్గ శత్రువులు ఉంటారా? సత్యాగ్రహం చేసేవాళ్లు యుద్ధాన్ని కోరతారా? ఓటింగ్ వ్యవస్థపై పవన్ కు నమ్మకం లేదు కాబట్టే ఉగ్రవాదిలా మాట్లాడుతున్నాడు. జనాన్ని రెచ్చగొట్టి రాజకీయం చేస్తున్నాడు. పవన్ లాంటి భాష ఇంకెవరైనా మాట్లాడుతున్నారా? కేవలం కులాల ప్రాతిపదికనే రాజకీయాలు చేయబోతున్నట్లు ఇవాళ్టి పవన్ ప్రసంగంలో స్పస్టంగా వెల్లడైంది. అయితే,

దటీస్ పీకే ఫిలాసఫీ
కుల మతాలను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తే ఆదరించడానికి ప్రజలెవరూ సిద్ధంగా లేరు. జనం ఆ స్థాయిని ఎప్పుడో దాటేశారు. ఏపీలో జనం అన్నదమ్ముల్లా కలిసుంటున్నారు. కాపులు, బలిజలు, దళితలు, షెట్టి బలిజలు అంతా ఒక్కటిగా ఉంటున్నారు. బీసీలంటే బ్యాక్ వర్డ్ కాదు, బ్యాక్ బోన్ కులాలు అని చెప్పిన ఘనత జగన్ ది. 56కులాలకు ప్రత్యేకంగా కార్పొరేషన్లు పెట్టారు. పవన్ గోతులు పూడ్చాలనే వంకతో రోడ్లపైకొచ్చి కులాలను రెచ్చగట్టడం, ప్రజల మధ్య అంతరాల గోతుల్ని తొవ్వుతున్నాడు. విగ్నత ఉన్నవాళ్లెవరైనా ఇలా చేస్తారా? కొన్ని రోజులేమో లెఫ్ట్ పార్టీలతో, ఇంకొన్ని రోజులేమో రైట్ వింగ్ తో ప్రయాణం. ఏ పొలిటికల్ ఫిలాసఫీ లేకపోవడమే పవన్ కల్యాణ్ ఫిలాసఫీ అని అనిపిస్తోంది. వైసీపీ వాళ్లు నాపై మానసిక అత్యాచారం చేశారని పవన్ అంటున్నారు. అసలా మాటకు అర్థమేంటి? పవన్ గురించి ఆలోచించే లేదా మాట్లాడే తీరిక వైసీపీలో ఎవరికీ లేదు. కులం కార్డుతో రాజకీయం చేయాలనుకున్న ఎవరూ ఏపీలో సక్సెస్ అయినట్లు చరిత్రలో లేదు. అందరివాడు కాబట్టే జగన్ ను జనం ఆశీర్వదించారు.

ఆ బాడీ లాంగ్వేజ్ ఏందయ్యా?
పంచాయితీ నుంచి పార్లమెంటు దాకా ఏ సైజు యుద్ధాన్ని తీసుకున్నా అన్ని చోట్లా పవన్ చిత్తుగా ఓడిపోయిన విషయాన్ని ఆయన గుర్తించట్లేదు పాపం. ఆయన హైదరాబాద్ లోనే ఉంటున్నారు కాబట్టి ఏపీలో ఏం జరుగుతోందో సరిగా తెలియట్లేదు. జనసేన నిరసనలు తెలిపితేనే జగన్ జనానికి సంక్షేమ, అభివృద్ధి పనులు చేస్తారని పవన్ అనుకుంటున్నారా? కొవిడ్ సమయంలో జనం విలవిల్లాడొద్దనే వారి ఖాతాల్లోకి డబ్బులు ఇవ్వడాన్ని జగన్ ప్రాధాన్యంగా తీసుకున్నారు. అందుకే రోడ్లు పనులు ఆలస్యమై ఉండొచ్చు. అసలు పవన్ బాడీ లాంగ్వేజ్ ఏంటి? ఆవేశంతో ఊగిపోవడమేంటి? ఎవరైనా ప్రజలకు మాటిస్తారు, ఈయనేమో కులాలు, మతాలకు మాటిస్తాడట, ఆయన దృష్టిలో సమాజం అంటే కులాలు, మతాలేనా?, కోపాన్ని దాచుకునే విషయంలో గోదావరి జిల్లా వాసుల్ని రాయలసీమ జిల్లాలకు తీసుకెళ్లి ట్రైనింగ్ ఇస్తారట, పవన్ ఎన్ని రకాలుగా రెచ్చగొట్టినా జనం పట్టించుకోబోరు. తర్వాత రాయలసీమ వెళ్లి రోడ్లను పరిశీలిస్తారట.. దాన్ని కూడా జనం డ్రామాలానే భావిస్తారు’’ అని మంత్రి కన్నబాబు అన్నారు.
Published by:Madhu Kota
First published: