news18-telugu
Updated: December 12, 2019, 7:43 PM IST
పవన్ కల్యాణ్, కొడాలి నాని
ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని మీద జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సెటైర్లు వేశారు. కాకినాడలో రైతు సౌభాగ్య దీక్ష ముగింపు సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడారు. రాష్ట్రంలో రైతుల పరిస్థితి దీనంగా ఉందని, రైతులు తాము పడిన శ్రమకు కనీసం గిట్టుబాటు ధర కూడా దక్కించుకోలేకపోతున్నారనిచెప్పారు. కేంద్రప్రభుత్వం నిబంధనల ప్రకారం ధాన్యంలో 17 శాతం తేమ ఉన్నా తీసుకోవచ్చని చెబుతున్నా, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మాత్రం 14 శాతం కంటే ఎక్కువ తేమ ఉంటే తీసుకోబోమని చెబుతోందని విమర్శించారు. తమకు మేలు చేసిన సర్ ఆర్థర్ కాటన్‌ను రైతులు గుండెల్లో పెట్టుకున్నారని, అలాంటిది మేలు చేయని జగన్‌ను గుండెల్లో నుంచి తీసేయడం ఎంత పని అని అన్నారు. రైతులకు మేలు చేస్తే కొడాలి నానికి వజ్రాల దండలు వేస్తారని, జగన్‌కు జనం సూట్‌కేసులో ధాన్యం పంపిస్తారని పవన్ కళ్యాణ్ ఎద్దేవా చేశారు.
రైతుల కోసం తాను యూనియన్ పెట్టాలని అనుకుని కూడా మనసు మార్చుకున్నట్టు పవన్ చెప్పారు. రైతులకు కూడా పార్టీలు అంటగట్టి విడదీస్తారన్న ఆలోచనతో వెనక్కి తగ్గానన్నారు. రైతులు కూడా సంఘటితం కావాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. రైతుల సమస్యలు తెలుసుకునేందుకు జనవరి నుంచి పర్యటనలు చేస్తానని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ప్రకటించారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోనూ రైతుల సమస్యలను తెలుసుకుంటానన్నారు. రైతులు అడగాల్సింది గిట్టుబాటు ధర కాదని, లాభసాటి ధర అడగాలని డిమాండ్ చేశారు. బస్తాకు రూ.1500 చెల్లించాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు.
Published by:
Ashok Kumar Bonepalli
First published:
December 12, 2019, 7:43 PM IST