అభిమానుల మృతిపై స్పందించిన పవన్ కల్యాణ్.. వారికి ఇక నేనే బిడ్డను

తల్లిదండ్రుల గర్భ శోకాన్ని అర్ధం చేసుకోగలనన్న ఆయన... వారికి తానే ఇకపై బిడ్డగా నిలుస్తానని తెలిపారు. ఆర్థికంగా ఆ కుటుంబాలను తానే ఆదుకుంటానని చెప్పారు పవన్ కల్యాణ్.

news18-telugu
Updated: September 1, 2020, 11:03 PM IST
అభిమానుల మృతిపై స్పందించిన పవన్ కల్యాణ్.. వారికి ఇక నేనే బిడ్డను
పవన్ కళ్యాణ్, జనసేన అధినేత
  • Share this:
జనసేన అధినేత పవన్ కల్యాణ్ బర్త్ డే వేళ విషాద ఛాయలు అలుముకున్నాయి. చిత్తూరు జిల్లాలో ఫ్లెక్సీ కడుతుండగా కరెంట్ షాక్ తగిలి ముగ్గురు అభిమానులు మరణించారు. ఈ ఘటనపై పవన్ కల్యాణ్ స్పందించారు. గుండెల నిండా తనపట్ల అభిమానం నింపుకున్న ముగ్గురు యువకులు విద్యుత్ షాక్‌తో మరణించడం దిగ్భ్రాంతికి గురిచేసిందని ఆయన అన్నారు. ఇది మాటలకందని విషాదమని పేర్కొన్నారు జనసేనాని. ఆ తల్లిదండ్రుల గర్భ శోకాన్ని అర్ధం చేసుకోగలనన్న ఆయన... వారికి తానే ఇకపై బిడ్డగా నిలుస్తానని తెలిపారు. ఆర్థికంగా ఆ కుటుంబాలను తానే ఆదుకుంటానని చెప్పారు పవన్ కల్యాణ్.

గాయపడిన మరో ముగ్గురు జనసైనికులకు మెరుగైన వైద్య సాయం అందేలా చూడాలని స్థానిక నాయకులకు సూచించారు పవన్ కల్యాణ్. వారు త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. గాయపడిన అభిమానుల కుటుంబాలకు అవసరమైన తక్షణ సాయం చేయాలని చిత్తూరు జిల్లా నాయకులను ఆయన కోరారు.


చిత్తూరు జిల్లా శాంతిపురంలో పవన్ అభిమానులు బర్త్ డే బ్యానర్‌లు కడుతున్న సమయంలో అపశృతి జరిగింది. ఏడవ మైల్ వద్ద ఫ్లెక్సీలు కడుతుండగా ఐదు మంది విద్యుత్ షాక్ తగిలింది. విద్యుదాఘాతంలో ముగ్గురు పవన్ కల్యాణ్ అభిమానులు సోమశేఖర్, రాజేంద్ర, అరుణాచలం మరణించారు. హరికృష్ణ, పవన్, సుబ్రమణ్యంకు తీవ్ర గాయాలు కావడంతో పీఈఎస్ మెడికల్ కాలేజీకి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. మృతుల్లో ఇద్దరు అన్నాదమ్ముళ్లు ఉండడంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి.

ఘటనపై స్థానిక శాసన సభ్యులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతిని, ప్రగాఢ విచారాన్ని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలను, బాధితులను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి ఆదుకోవాలని, ఆర్ధిక సాయం అందించడంతో పాటు క్షతగాత్రులకు అత్యున్నత వైద్యం అందించాలని కోరారు.
Published by: Shiva Kumar Addula
First published: September 1, 2020, 10:40 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading