news18-telugu
Updated: January 22, 2020, 7:49 PM IST
కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిసిన పవన్ కళ్యాణ్, బీజేపీ నేతలు
అమరావతిపై బీజేపీ - జనసేన బలమైన కార్యాచరణను త్వరలోనే ప్రకటిస్తామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న పవన్ కళ్యాణ్ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిశారు. బీజేపీ నేతలు కన్నా లక్ష్మీనారాయణ, జీవీఎల్ నరసింహారావు, పురందేశ్వరి, జనసేన నుంచి పవన్ కళ్యాణ్, నాదెండ్ల ఈ సమావేశానికి హాజరయ్యారు. రాష్ట్రానికి కేంద్ర సాయంతో పాటు అమరావతి, రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయాల గురించి చర్చించారు. సుమారు గంట సేపు వారి మధ్య చర్చ జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం నుంచి భారీ ఎత్తున నిధులు అందిస్తున్నా... గతంలో టీడీపీ, ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం కూడా యుటిలిటీ సర్టిఫికెట్లను సమర్పించడం లేదని సీతారామన్ వారికి చెప్పినట్టు నేతలు తెలిపారు. నిర్మలా సీతారామన్‌తో భేటీ తర్వాత కన్నా లక్ష్మీనారాయణ, పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడారు.
‘ఏపీ ఆర్థిక పరిస్థితి, అమరావతి రాజధాని అంశాలపై చర్చించాం. విభజన నుంచి ఇప్పటి వరకు కేంద్రం చేసిన సాయం గురించి కేంద్ర మంత్రి చెప్పారు. అమరావతిలో 5 కోట్ల ప్రజలు, రైతులకు మాటిస్తున్నా. అమరావతే ఏపీ శాశ్వత రాజధాని. దీనిపై బీజేపీ - జనసేన బలమైన కార్యాచరణను త్వరలో ప్రకటిస్తాం. విశాఖలో రిపబ్లిక్ డే నిర్వహించాలనుకుని సగం పనులు చేసిన తర్వాత మళ్లీ వెనక్కి తగ్గారు. రేపు రాజధాని కూడా అంతే. మూడు రాజధానులకు కేంద్ర సమ్మతి ఉందని వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోంది. కేంద్రం సమ్మతి లేదు. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంటే వాళ్లు చేస్తారే తప్ప దీంట్లో కేంద్రం సమ్మతి, అసమ్మతితో సంబంధం లేదు. ’ అని పవన్ కళ్యాణ్ అన్నారు.
వైఎస్ జగన్ ప్రభుత్వం కేంద్ర ప్రాజెక్టులను అటకెక్కించి కేవలం రాజకీయాల మీదే దృష్టి పెట్టిందని కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. రూ.15వేల కోట్ల విలువైన చెన్నై - విశాఖ కారిడార్ ప్రాజెక్టు మీద రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందన్నారు. రాజధాని ఫండింగ్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి వరల్డ్ బ్యాంక్ సహకారం అందిస్తామన్నా జగన్ ప్రభుత్వం దానికి సహకరించలేదన్నారు.
Published by:
Ashok Kumar Bonepalli
First published:
January 22, 2020, 5:27 PM IST