news18-telugu
Updated: July 23, 2020, 4:43 PM IST
పవన్ కళ్యాణ్
ఆంధ్రప్రదేశ్‌లో అమరావతి మరో నందిగ్రాం కావొద్దని కోరుకుంటున్నట్టు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా బయట ప్రపంచానికి దూరంగా ఉన్న పవన్ కళ్యాణ్ యూట్యూబ్‌లో ఓ ఇంటర్వ్యూను పోస్ట్ చేశారు. జనసేన అధికారిక యూట్యూబ్ అకౌంట్లో ఈ వీడియోను రిలీజ్ చేశారు. అందులో పేదలకు ఇళ్ల స్థలాలు, మూడు రాజధానులు, దళితులపై దాడులు వంటి అంశాలపై స్పందించారు.
అమరావతిలో కేవలం 2వేల ఎకరాల్లో రాజధాని నిర్మించాలని ప్రధాని మోదీ చెప్పినా కూడా టీడీపీ ప్రభుత్వం వినకుండా భారీ ఎత్తున భూమిని సేకరించిందన్నారు. టీడీపీ హయాంలో సింగపూర్ తరహా రాజధాని అంటూ ఎలా ప్రచారం చేశారో ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ది వికేంద్రీకరణ అంటూ ఊదరగొడుతున్నారన్నారు. గత ప్రభుత్వం ఏమైనా తప్పులు చేస్తే దాన్ని సవరించి ముందుకు వెళ్లాలన్న పవన్ కళ్యాణ్ దీనిపై ప్రజాభిప్రాయ సేకరణ జరగాలని అభిప్రాయపడ్డారు. ఇప్పుడు మూడు రాజధానులు అంటున్న వైసీపీ అప్పుడెందుకు అమరావతికి మద్దతు పలికిందని ప్రశ్నించారు. అదేదో అప్పుడే చెప్పి ఉండాల్సింది కదా అన్నారు.

పవన్ కళ్యాణ్
200 రోజులుగా నిరసన తెలుపుతున్న అమరావతి రైతులను పట్టించుకోకుండా ప్రభుత్వం వారి మీద లాఠీలు ఝళిపించడం సరికాదన్నారు. టీడీపీ, వైసీపీ ఆధిపత్యపోరులో రైతులు నలిగిపోతున్నారని, పవన్ కళ్యాణ్ చెప్పారు. చిన్న సమస్య అని వదిలేస్తే అది భావోద్వేగంగా మారి మరో నందిగ్రాంగా మారే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

పవన్ కళ్యాణ్
పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ అనేది రాజకీయ నాయకులు చేసే మోసమని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. భూమి అందుబాటులో లేక అపార్ట్ మెంట్లు కడుతుంటే.. పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తామనడం, దాని కోసం మళ్లీ పేదలు, దళితుల వద్ద స్థలాలు లాక్కోవడం చేస్తున్నారన్నారు. ఈ ప్రాసెస్‌లో తక్కువ ధరలున్న భూములను ఎక్కువ ధరకు కొంటూ దళారులు, కొందరు రాజకీయ నేతలు ప్రజాధనాన్ని దోచుకుంటున్నారని పవన్ కళ్యాణ్ ఆరోపించారు.

పవన్ కళ్యాణ్
దళితులపై దాడుల గురించి కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడారు. డాక్టర్ సుధాకర్ ఒక్క మాట అనగానే వేగంగా స్పందించిన ప్రభుత్వ వ్యవస్థలు.. రాజమండ్రిలో బాలికపై అత్యాచారం జరిగినప్పుడు, యువకుడికి శిరోముండనం చేయించినప్పుడు, న్యాయమూర్తి మీద దాడి జరిగినప్పుడు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఒక దళిత హోంమంత్రి ఉన్న రాష్ట్రంలోనే దళితులపై దాడులు జరుగుతున్నా పట్టించుకోకపోవడం, కనీసం కేసులు కూడా పెట్టకపోవడం అంటే ఈ దాడులకు ప్రభుత్వ మద్దతు ఉందనే అనుకోవాలన్నారు.
Published by:
Ashok Kumar Bonepalli
First published:
July 23, 2020, 4:43 PM IST