news18-telugu
Updated: August 26, 2020, 8:54 PM IST
పవన్ కళ్యాణ్, జనసేన అధినేత
Pawan Kalyan on Amaravati Farmers arrest | అమరావతిలో రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు వెంటనే వార్షిక కౌలు చెల్లించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ ప్రభుత్వాన్ని కోరారు. అమరావతిలో భూములిచ్చిన రైతులకు కౌలు డబ్బులు ఇస్తున్నట్టు జూన్ 21న జీవో జారీ చేశారని, కానీ, ఇంతవరకు నిధులు మాత్రం విడుదల కాలేదన్నారు. వెంటనే వారికి కౌలు డబ్బులు రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు. ‘ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం కోసం భూములు త్యాగం చేసిన రైతులకు వార్షిక కౌలు చెల్లింపులో ప్రభుత్వం జాప్యం చేస్తున్న తీరు భావ్యం కాదు. ఒప్పందం ప్రకారం అమరావతికి భూమి ఇచ్చిన ప్రతి రైతుకీ ఏప్రిల్ మాసంలో వార్షిక కౌలు చెల్లించాలి. ఒప్పందంలోని నిబంధనను రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది కూడా ఉల్లంఘించి, కౌలు డబ్బులు ఆలస్యంగా ఇచ్చింది. వరుసగా రెండో యేడాది కూడా జాప్యం చేస్తూ ఆ సొమ్ములు వస్తాయో, రావో అనే ఆందోళనలోకి రైతాంగాన్ని నెట్టేసింది. 28వేల మందికి పైగా రైతులు తమ భూములను రాజధాని కోసం ఇచ్చారు. వీరికి ఈ యేడాది రూ.189.7 కోట్లు కౌలుగా చెల్లించాల్సి ఉంది. జూన్ 21న కౌలు విడుదల చేస్తున్నట్టు ప్రభుత్వం జీవోలు జారీ చేసింది. ఆ జీవోలు ఇచ్చి రెండు నెలలు దాటినా ఏ రైతు ఖాతాలోకి కూడా డబ్బులు వేయకపోవడం రైతులను క్షోభకు గురిచేయడమే. తమ ప్రాంతంలో రాజధాని నిలుపుకోవడం కోసం అమరావతి రైతులు 250 రోజులుగా పోరాటం చేస్తున్నారు. రైతులకు న్యాయం చేయాల్సిన సమయంలో కౌలు కూడా చెల్లించడంతో జాప్యం చేయడం ఒప్పందనల ఉల్లంఘన అవుతుంది. ఆ కౌలు డబ్బులు అడిగినందుకు సీఆర్డీఏ కార్యాలయానికి వెళ్లిన 180 మంది రైతులను పోలీసులు అరెస్టు చేయడాన్ని ఖండిస్తున్నాను. తమకు న్యాయం చేయాలని అడిగిన రైతులను అరెస్టు చేసిన తీరు గర్హనీయం. తక్షణహే రైతులకు రావాల్సిన కౌలు ఇచ్చి ఒప్పందాన్ని గౌరవించాలి.’ అని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు.
Published by:
Ashok Kumar Bonepalli
First published:
August 26, 2020, 8:54 PM IST