news18-telugu
Updated: January 18, 2020, 3:42 PM IST
పవన్ కళ్యాణ్
పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో జనసేన నాయకులు బొలిశెట్టి శ్రీనివాస్, మారిశెట్టి పవన్ బాలాజి లపై నమోదు చేసిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. స్థానిక ఎం.ఎల్.ఏ. కొట్టు సత్యనారాయణ పోలీసులను ఆయుధంగా వాడుకుని చేసిన వేధింపులను తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. ‘మొన్న కాకినాడ, ఇప్పుడు తాడేపల్లిగూడెం అదే తీరు. మారిశెట్టి పవన్ బాలాజి చేసిన నేరం ఏమిటి? అతనిని దౌర్జన్యంగా పోలీస్ స్టేషన్ కు తీసుకురావడమే కాకుండా అక్రమంగా కేసు బనాయించడం కోసం ప్రజాప్రతినిధి అయివుండి ఇంతగా దిగజారిపోతారా? మీరు చేసిన విమర్శలకు సమాధానం చెప్పడమే పవన్ బాలాజి చేసిన ఘోరమైన నేరమా? ఇళ్లకు పోలీసులను పంపి ఇంటిలోని మహిళలను భయభ్రాంతులకు గురిచేస్తారా? అక్రమ అరెస్టును ప్రశ్నించడానికి పోలీస్ స్టేషన్ కు వెళ్లిన మాజీ మున్సిపల్ చైర్మన్ బొలిశెట్టి శ్రీనివాస్ పట్ల పోలీసులు వ్యవహరించిన తీరును తీవ్రంగా గర్హిస్తున్నాము. మీ అధికార బలంతో పోలీసులను అడ్డుపెట్టుకుని మీరు చేస్తున్న ఆగడాలను భరించే స్థితిలో ప్రజలు లేరని గమనించండి. వైసీపీ ప్రజాప్రతినిధులు తమ తీరు మార్చుకోకపోతే ప్రజలే బుద్ది చెబుతారు. జనసేన క్రియాశీలక కార్యకర్త పవన్ బాలాజి పై పెట్టిన అక్రమ కేసును వెంటనే రద్దు చేయాలని పోలీస్ ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాను.’ అని పవన్ కళ్యాణ్ ఆ లేఖలో కోరారు.
Published by:
Ashok Kumar Bonepalli
First published:
January 18, 2020, 3:42 PM IST