Pawan Kalyan: అంతర్వేది రథం దగ్ధం ఘటనపై పవన్ కళ్యాణ్ సంచలన ఆరోపణలు

Pawan Kalyan on Antarvedi: ‘వైసీపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను.. ఒక మాజీ న్యాయమూర్తితో విచారణ జరిపించండి. ఎందుకంటే పోలీసుల మీద ప్రజలకు నమ్మకం లేదు.’ అని పవన్ కళ్యాణ్ అన్నారు.

news18-telugu
Updated: September 8, 2020, 8:10 PM IST
Pawan Kalyan: అంతర్వేది రథం దగ్ధం ఘటనపై పవన్ కళ్యాణ్ సంచలన ఆరోపణలు
పవన్ కళ్యాణ్, జనసేన అధినేత
  • Share this:
Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్‌లోని అంతర్వేది శ్రీ లక్ష్మీనృసింహస్వామి వారి ఆలయంలో రథం కాలిపోయిన ఘటనపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. మొన్న పిఠాపురం.. కొండబిట్రగుంట... ఇప్పుడు అంతర్వేది ఘటనలు యాధృచ్ఛికాలుకావన్నారు. ఎన్ని విగ్రహాల ధ్వంసాలు... రథాల దహనాలు యాధృచ్ఛికంగా జరుగుతాయని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. విశ్వాసాలను దెబ్బతీస్తున్న తీరుపై ఆడపడుచులందరూ మంగళ, శుక్రవారాల్లో హారతులిస్తూ తమ నిరసన తెలపాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని పలు అంశాలపై పవన్ కళ్యాణ్ పలు ప్రశ్నలు లేవనెత్తారు. అవి ఆయన మాటల్లోనే.

‘దేవాలయాలు, మత విశ్వాసాలకు సంబంధించిన ఘటనలు ఏవైనా చాలా సున్నితమైన అంశాలు. గత కొద్ది నెలలుగా వరుస క్రమంలో జరిగిన అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన పిఠాపురంలో దుర్గాదేవి, వినాయకుడు, సాయిబాబా విగ్రహాలను ధ్వంసం చేసిన విధానం, విజయవాడలోని శ్రీ కాశీవిశ్వేశ్వరాలయం భూములకు సంబంధించి, సింహాచలం మాన్సాస్ ట్రస్ట్ కి సంబంధించిన వివాదంగానీ, నెల్లూరు జిల్లా కొండబిట్రగుంటలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారిని తీసుకువెళ్లే రథాన్ని తగులబెట్టేయడం గురించి కచ్చితంగా మాట్లాడాలి. ఇది ఆలయాలను, ధార్మిక కేంద్రాలను అపవిత్రం చేసే విధానమే.

ఈ కారణాలు నమ్మశక్యమేనా?
ఇది ఒక సంఘటనో రెండు సంఘటనలో అయితే చిన్న స్థాయిలో స్పందించి వదిలేసేవాడిని. కానీ వరుస క్రమంలో జరుగుతూ ఉంటే మౌనంగా ఉండలేం. పిఠాపురంలో మొదలయ్యింది. సాక్షాత్తూ దత్తాత్రేయ స్వరూపుడయిన శ్రీపాద శ్రీ వల్లభుడు పుట్టిన ఊరది. అలాగే అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన పీఠం అది. అలాంటి చోట దుర్గాదేవి విగ్రహాలను, గణపతి విగ్రహాలను, సాయిబాబా విగ్రహాలను ధ్వంసం చేసేశారు. అది ఎవరు చేశారు అంటే ఒక మతిస్థిమితం లేని వ్యక్తి చేశాడు అన్నారు. ఆహ...అనుకున్నాం. నెల్లూరు జిల్లాలోని కొండ బిట్రగుంటలో స్వామి వారి రథాన్ని తగులబెట్టేస్తే దాన్ని కూడా మతిస్థిమితం లేని వాడు తగులపెట్టేశాడన్నారు. నాకేం అర్ధం కాలేదు. ఓహో ఇలా జరుగుతాయా అనుకున్నా. ఇప్పుడు అంతర్వేదిలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో 40 అడుగుల పవిత్ర రథంపైన ఏదో తేనె పట్టు ఉందంట.. ఆ తేనె పట్టుని తీయడం కోసం వీళ్లు తగులపెట్టేశారంట. అలాకాకుండా ఇప్పుడు ఒక మతిస్థిమితం లేని వ్యక్తులెవరో చేసిన పనేమో అంటున్నారు. ఇదీ ఆ జాబితాలో చేర్చారు. యాదృచ్చికంగా జరిగినవంటున్నారు. ఎన్ని జరుగుతాయి యాదృచ్చికంగా..?

ఖచ్చితంగా వైసీపీ ప్రభుత్వం దీని మీద చాలా బలంగా స్పందించాలి. నాణాలు విసిరేస్తే ఏడుకొండలవాడి పింక్ డైమండ్ పగిలిపోయింది. ముక్కలు చెల్లాచెదురైపోయాయి. అలాగే స్వామివారి రథాలు కాలిపోతున్నా, విగ్రహాలు ధ్వంసం చేస్తున్నా ఎవరో పిచ్చివాళ్లు చేసిన పని అని చెబుతుంటే స్కూల్ కి వెళ్లే చిన్న పిల్లలు కూడా నవ్వుతారు. తాము చెబుతున్న కారణాలు అసలు నమ్మశక్యంగా ఉన్నాయా లేదా అన్నది వాళ్ళే ఆలోచించుకోవాలి. దీని మీద నేను కోరుకునేది ఒకటే. సమగ్ర విచారణ జరపాలి. మీరు చెప్పినట్టు మతిస్థిమితం లేని వాళ్లు అనేది కాకుండా పకడ్బందీ కారణాలతో సాగుతున్నాయా అనే కోణంలో విచారించాలి.

మానవ నైజాన్ని ఆవిష్కరింప చేసే కొన్ని పుస్తకాలు చదివినప్పుడు ఏన్షియంట్ గ్రీస్ లో వాళ్లు ఆరాధించే విగ్రహాన్ని ఒకతను ధ్వంసం చేస్తా ఉంటాడు. అతన్ని పట్టుకుంటే అందరూ నన్ను గుర్తించాలని నేను ధ్వంసం చేస్తున్నాను అంటాడు. ఈ మాట ఎందుకు చెబుతున్నానంటే.. ఒక వేళ ఈ విధ్వంసం చేస్తున్న వాళ్లు తమ ఉనికి కోసం చేస్తున్నారా? వాళ్లు ఏ మతస్తులు... ఏ కారణాలతో చేస్తున్నారు... వాళ్ళ
వెనకాల ఎవరైనా ఉన్నారా? అని తేల్చాలి. వారికి ఉగ్రవాద నేపథ్యం ఉందా గొడవలు రేపేసి మతకలహాలు రేపేసి తద్వారా అస్థిరత సృష్టించడానికి ఇలాంటి పన్నాగాలు పన్నుతున్నారా? దీని వెనుక ఉగ్రవాదుల చర్యలు ఏమైనా ఉన్నాయా? ఆ కోణం నుంచి కూడా చూడాలి. జనసేన పార్టీ చాలా తీవ్రంగా తీసుకుంటుంది. ఇన్ని కోట్ల మంది హిందువుల మనోభావాలు దెబ్బతీసే దుర్గాదేవి, గణపతి, సాయిబాబా విగ్రహాలు ధ్వంసం చేస్తూ.. స్వామి వారిని ఊరేగించే రథాల్ని దగ్ధం చేస్తుంటే... ఏమనుకోవాలి. ఖచ్చితంగా దీని వెనుక ఉగ్రవాద కోణం ఉందా? సంఘవిద్రోహులెవరైనా ఉన్నారా? లేదంటే రాజకీయ లబ్ది పొందడానికి ఎవరైనా చేస్తున్నారా? వీటన్నింటినీ అన్ని కోణాల్లో చూసి దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది.

వైసీపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను.. ఒక మాజీ న్యాయమూర్తితో విచారణ జరిపించండి. ఎందుకంటే పోలీసుల మీద ప్రజలకు నమ్మకం లేదు. ఎందుకంటే భవిష్యత్తులో ఏం జరిగినా అది మతిస్థిమితం లేని వ్యక్తి మీద పెడతారు. అతను మాట్లాడలేడు. అతని ఉనికె అతనికి తెలియదు. కొద్ది రోజుల్లో సరైన చర్యలు లేకపోతే కచ్చితంగా సిబిఐ దర్యాప్తు కోసం, ఉగ్రవాద కోణం ఉన్నదనిపిస్తే ఎన్.ఐ.ఎ. వారిని కూడా దృష్టి సారించేలా చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరతాం.

హిందూ ధర్మ పరిరక్షణ విషయంలో వైసీపీ ప్రభుత్వం మాత్రమే కాదు గత ప్రభుత్వాలు కూడా చాలా తప్పులు చేశాయి. కోట్ల మంది ప్రజల మనోభావాలే దెబ్బ తింటాయి. ఎందుకంటే అది వాళ్ల ఓట్ బ్యాంక్ లెక్కల్లో భాగం. మెజారిటీ హిందువుల మనోభావాలు వీరికి అవసరం లేదు. మేం చెబుతున్నాం ఈ రోజున మేము మాత్రం ఇస్లాంకి ఎంత గౌరవం ఇస్తామో.. క్రిస్టియానిటీకి ఎంత గౌరవం ఇస్తామో.. హిందూ సమాజానికి కూడా మేము అంతే గౌరవం ఇస్తాం. ఆ విశ్వాసాలను దెబ్బతీసే ఏ ప్రయత్నం జరిగినా జనసేన దాన్ని చాలా తీవ్రంగా తీసుకుంటుంది.

అన్యమత ప్రచారం వద్దన్నందుకే ఎల్వీని బదిలీ చేశారా?
హిందూ ఆలయాల విషయంలో దేవాదాయ శాఖలో ఎలాంటి అవకతవకలు చోటు చేసుకోకుండా చూడాలి. హిందూ ఆలయాల పరిధిలో, పుణ్య క్షేత్రాల్లో అన్య మత ప్రచారం జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు అని దేవాదాయ శాఖ వెల్లడించాలి. గతంలో చీఫ్ సెక్రటరీ హోదాలో ఎల్.వి.సుబ్రహ్మణ్యం గారు అన్యమత ప్రచారం హిందూ దేవాలయాల్లో ఉండకూడదు, అన్య మతస్తులు ఉండకూడదు అన్నారు. ఆ మాట అన్న కొద్ది రోజులకే సుబ్రమణ్యం గారిని బదిలీ చేశారు. ఇవన్నీ కాకతాళీయంగానే జరిగాయా..? ఆయన ఆ మాటన్నారు కాబట్టే జరిగిందా అనేది కూడా వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది.

తిరుమల పింక్ డైమండ్ గురించి ఇప్పుడు మాట్లాడరేమి?
మన దౌర్భాగ్యం, దురదృష్టం ఏంటంటే ఒక్కో ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒక్కోలా మాట్లాడుతారు అందరూ.. ఉదాహరణకు టీటీడీ ఆలయానికి సంబంధించి పింక్ డైమండ్ కనబడడం లేదన్నారు. ప్రభుత్వాలు మారిన తర్వాత మళ్లీ వాటి ఊసెవరూ ఎత్తరు. వైసీపీ ప్రభుత్వాన్ని నేను కోరుకునేది ఏంటంటే.. అన్నీ మీరు రివర్స్ టెండరింగ్ పెట్టారు కదా.. గత ప్రభుత్వం చేసిన తప్పులని రివర్స్ టెండరింగ్ పెట్టారు కదా.. అలాగే టీటీడీలో ఏమేమి తప్పులు జరిగాయి. పింక్ డైమండ్ ఏలా పోయింది? అనేది తేల్చాలి.

ఆడపడుచులే ధైర్యం ఇవ్వాలి
ఇంట్లో దీపం వెలిగించే ప్రతి భక్తుడు తమ విశ్వాసాలను కాపాడుకోవాలి. మా మనోభావాలు దెబ్బ తిన్నాయి అని ప్రజలే చెప్పాలి. ఆడపడుచులు చెప్పాలి. మీరు పూజలు, వ్రతాలు చేస్తారు. మీరే ధైర్యంగా మాట్లాడాలి. మంగళ, శుక్రవారాల్లో హారతులు ఇస్తూ మన ధర్మాన్ని రక్షించుకొనే దిశగా అడుగులు వేయాలి. ఆడపడుచులు ప్రత్యేకించి మంగళవారాలు, శుక్రవారాల్లో ఆడపడుచులంతా నిరసన తెలపాలి.
ఈ ఘటనల గురించి ఇస్లాం మత పెద్దలు, క్రిస్టియన్ మత పెద్దలు ఖండించాలని కోరుకుంటున్నా. ఇప్పుడు మౌనంగా ఉంటే రేపు ఇతర మతాల ప్రార్థన మందిరాలపైకి వస్తారు. అందుకే అందరూ కలిసి ఏ ప్రార్ధనా మందిరం మీద దాడి జరిగినా, ఏ దేవతా విగ్రహాలు ధ్వంసం చేసినా అన్ని మతాల పెద్దలు దీన్ని సమష్టిగా ఖండించకపోతే దుష్ఫలితాలు వస్తాయి.’
Published by: Ashok Kumar Bonepalli
First published: September 8, 2020, 8:10 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading