news18-telugu
Updated: August 2, 2020, 6:56 PM IST
పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)
అమరావతి కోసం టీడీపీ, వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. మూడు రాజధానుల అంశంపై జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం నిర్వహించింది. పార్టీ నేతలతో పవన్ కళ్యాణ్ వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. అమరావతి కోసం టీడీపీ, వైసీపీకి చెందిన కృష్ణా, గుంటూరు జిల్లాల ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. వారికి చిత్తశుద్ది ఉంటే పదవులను వదులుకుని ప్రత్యక్ష పోరాటంలోకి రావాలన్నారు. రాజధాని వికేంద్రీకరణ పేరిట మూడు ప్రాంతాల మధ్య చిచ్చు రేపుతున్నారని విమర్శించారు. రైతు కన్నీరుపై రాజధాని నిర్మాణం వద్దని మొదట్నుంచీ చెబుతున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వ వైఫల్యాలు కప్పి పుచ్చుకునేందుకే రాజధాని క్రీడ మొదలుపెట్టారని ఆరోపించారు. రాజధాని వికేంద్రీకరణపై న్యాయకోవిదులు, నిపుణులతో చర్చిస్తామని పవన్ కల్యాణ్ వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ రెండు రోజుల క్రితం ఆమోదం తెలిపారు. దీంతో మూడు రాజధానులకు రూట్ క్లియర్ అయింది. గవర్నర్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన వెంటనే ఏపీ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. అందులో పేర్కొన్న వివరాల ప్రకారం రాజధాని వికేంద్రీకరణ వెంటనే అమల్లోకి వస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తానికి అది అమలవుతుంది. ఇది ఒకేసారి అమల్లోకి వస్తుంది. ఈ బిల్లు ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో శాసనసభ అమరావతిలో కొలువవుతుంది. రాజ్ భవన్, సచివాలయం, హెచ్ ఓడీల కార్యాలయాలు కార్యనిర్వాహక రాజధాని విశాఖపట్నంలో ఉంటాయి. జ్యుడీషియల్ రాజధానిగా కర్నూలు ఉంటుంది. హైకోర్టు బెంచ్‌ను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం చొరవ చూపుతుంది. ఏ కార్యాలయాలు ఎక్కడ ఉండాలి, అందుకు కారణాలు ఏంటనే అంశాన్ని ప్రభుత్వం రాతపూర్వకంగా తెలియజేస్తుంది.
అయితే, మూడు రాజధానులకు వ్యతిరేకంగా, అమరావతికి మద్దతుగా టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను చంద్రబాబుకు పంపారు. స్పీకర్ ఫార్మాట్లో శాసనమండలి చైర్మన్‌కు పంపుతానని చెప్పారు. అలాగే, అమరావతికి మద్దతుగా కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ డిమాండ్ చేశారు. ఇక వైసీపీలోని ఓ వర్గం మూడు రాజధానుల మీద అసంతృప్తితో ఉందని, రాజీనామాల గురించి ఓ సీక్రెట్ సమావేశంలో చర్చించినట్టు ప్రచారం జరుగుతోంది.
Published by:
Ashok Kumar Bonepalli
First published:
August 2, 2020, 6:51 PM IST