దివీస్ ప్రభావిత ప్రాంతం కొత్తపాకలలో నిర్వహించిన సభలో పవన్ కళ్యాణ్ (Image; JanasenaParty/Twitter)
దివీస్ పరిశ్రమ బాధితులకు మద్దతుగా తూర్పుగోదావరి జిల్లా కొత్తపాకల గ్రామంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ ప్రసగించారు. తాను పరిశ్రమలకు వ్యతిరేకం కానన్న పవన్ కళ్యాణ్, ప్రజల కన్నీళ్ల మీద లాభాలు ఆర్జించే విధానానికి కంపెనీలు ముగింపు పలకాలన్నారు.
తాను అధికారంలోకి వస్తే దివీస్ పరిశ్రమను బంగాళాఖాతంలో కలిపేస్తానన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక మాట నిలబెట్టుకోవాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సూచించారు. ఎన్నికల ముందు దివీస్ పరిశ్రమకు వ్యతిరేకంగా మాట్లాడిన జగన్ ఇప్పుడు అదే కంపెనీకి వత్తాసు పలడాన్ని పవన్ కళ్యాణ్ తప్పుపట్టారు. దివీస్ పరిశ్రమ బాధితులకు మద్దతుగా తూర్పుగోదావరి జిల్లా కొత్తపాకల గ్రామంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ ప్రసగించారు. తాను పరిశ్రమలకు వ్యతిరేకం కానన్న పవన్ కళ్యాణ్, ప్రజల కన్నీళ్ల మీద లాభాలు ఆర్జించే విధానానికి కంపెనీలు ముగింపు పలకాలన్నారు. ‘మన బిడ్డలకు వారసత్వంగా ఆస్తులు, పొలాలు, బంగారం ఇవ్వగలం. కానీ ఆరోగ్యాన్ని ఆస్తిగా ఇవ్వలేం. పీల్చే గాలి, తాగే నీరు కలుషితమై అనారోగ్యానికి గురైతే... మనం ఎన్ని ఆస్తులు ఇచ్చినా వాళ్లు అనుభవించలేరు. ఈ భూమి ఎవరి సొంతం కాదు. సగటు మనిషి జీవిత కాలం 64 ఏళ్లు. ఈ 64 ఏళ్లు ఈ భూమి మీద సక్రమంగా జీవించి, భావితరాలకు పదిలంగా అప్పగించాలి. వేల కోట్లు, వందల ఎకరాలు, ఖరీదైన ప్రాంతంలో ఇళ్లు కట్టి పిల్లలకు ఇస్తే వారి భవిష్యత్తు బాగుంటుందని వైసీపీ నాయకులు అనుకుంటే పొరపాటే. విశాఖపట్నంలో స్టరీన్ గ్యాస్ లీక్ అయినపుడు డబ్బున్నవాడి మీద, పేదవాడి మీద ఒకేలా పనిచేసిందని గుర్తుంచుకోవాలి. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి, వైసీపీ ప్రజాప్రతినిధులు నాకు శత్రువులు కాదు. విధానాలు సరిగా లేనప్పుడు కచ్చితంగా బయటకు వచ్చి ప్రశ్నిస్తాం.’ అని పవన్ కళ్యాణ్ అన్నారు.
ఈ ప్రాంతంలో దివీస్ పరిశ్రమ ఏర్పాటు అయితే అది రోజుకు 65 లక్షల లీటర్ల మంచినీటిని వినియోగించి 55 లక్షల లీటర్ల నీటిని కలుషితం చేసి సముద్రంలో కలుపుతుందని పవన్ కళ్యాణ్ అన్నారు. తుని పట్టణ అవసరాలకు రోజుకు 45 లక్షల లీటర్ల నీరు అవసరమవుతాయని, దీనికంటే 10 లక్షల లీటర్ల నీటిని దివీస్ ఫార్మా కలుషితం చేస్తుందని జనసేనాని చెప్పారు. జల కాలుష్యం కంటికి కనిపించడం లేదని నిర్లక్ష్యం చేస్తే వాయు కాలుష్యంలానే ప్రాణం తీస్తుందని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు.. సముద్రంలో జలచరాలను చంపేస్తుందని, మత్స్యకారులు ఉపాధి కోల్పోతారని పవన్ కళ్యాణ్ చెప్పారు.
కోడి కత్తితో పొడిచిన వాళ్ళు, పొడిపించుకున్న వాళ్ళు బాగానే ఉన్నారు
2019 ఎన్నికలకు కొన్నాళ్ల ముందు విశాఖ విమానాశ్రయంలో వైఎస్ జగన్ మీద జరిగిన కోడికత్తి దాడిని పవన్ కళ్యాణ్ పరోక్షంగా ప్రస్తావించారు. ‘తమ పొలాల్లోకి వెళ్లినందుకు 160 మందిపై పోలీసులు కేసులు పెట్టారు. 36 మంది ఇప్పటికీ జైల్లో మగ్గిపోతున్నారు. ఈ గ్రామీణులు సూట్ కేసు కంపెనీలు పెట్టి అవినీతికి పాల్పడలేదు. హ్యతలు, దోపిడీలు చేయలేదు. కోడి కత్తితో పొడవలేదు. కోడి కత్తితో పొడిచినోళ్లు, పొడిపించుకున్నోళ్లు బాగానే ఉన్నారు. భూమి కోసం పోరాటం చేసినోళ్లు మాత్రం జైల్లో మగ్గిపోతున్నారు. గౌతమ్ రెడ్డి (ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి) పెద్ద మనసు చేసుకొని వారిని బేషరతుగా విడుదల చేయాలి.’ అని పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు.
తన కోపం వ్యవస్థల్ని శాసించే వ్యక్తుల మీద తప్ప పోలీసుల మీద కాదని పవన్ కళ్యాణ్ అన్నారు. తన సభకు పర్మిషన్ ఇవ్వకపోయినా నడుచుకుంటూ అయినా వస్తానన్నారు. పదవిలోకి వస్తే బంగాళాఖాతంలో కలిసేస్తాం.... పదవిలోకి వచ్చాక పర్మిషన్లు ఇస్తాం అనే మాయ మాటలు జనసేన చెప్పదన్నారు. ఒక పరిశ్రమ ఉండాలంటే ఎలాంటి విధానాలు ఉండాలి, కాలుష్యం ఎంత వెదజల్లుతుంది వంటి వాటిని పరిగణనలోకి తీసుకొని పర్మిషన్ ఇస్తామని స్పష్టం చేశారు. విధ్వంసం స్థాయి ఎక్కువగా ఉంటే మాత్రం పరిశ్రమ మాకు వద్దు వెళ్లిపోండని మొహమాటం లేకుండా చెప్పేస్తామని జనసేనాని కుండబద్దలు కొట్టారు. ఏ పరిశ్రమ అయినా చట్టాలకు లోబడే ఉండాలి. దివీస్ పరిశ్రమపై నాకు ఎలాంటి కోపం లేదు. ప్రజల ఆరోగ్యానికి ఎలాంటి నష్టం కలగదని ఆ పరిశ్రమ నిరూపించుకోవాలని అన్నారు. ఇప్పటికైనా జగన్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం పరిశ్రమను ఇక్కడ నుంచి తరలించాలని పవన్ డిమాండ్ చేశారు. లేనిపక్షంలో బాధితుల తరఫున పోరాటం చేయడానికి జనసేన వెనుకాడదని జనసేనాని హెచ్చరించారు.