రాబోయే ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేయాలని నిర్ణయించారు. అయితే ఆ రెండు నియోజకవర్గాలు ఏంటన్నది మరో గంటలో వెల్లడిస్తామని మంగళవారం ఉదయం 9.50గంటలకు ట్వీట్ చేశారు. ప్రస్తుతం దానిపై జనరల్ బాడీ చర్చలు జరుపుతోందని తెలిపారు. పవన్ కల్యాణ్ పోటీ చేసే స్థానాలపై క్లారిటీ వస్తే జనసేన ప్రచారానికి మరింత ఊపు వచ్చే అవకాశం కనిపిస్తోంది.ఇంతకుముందు వినిపించిన ఊహాగానాల ప్రకారం పవన్ కల్యాణ్ గాజువాక, భీమవరం నుంచి పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. రెండు నియోజకవర్గాల్లోనూ కాపు ఓటు బ్యాంకు పెద్ద సంఖ్యలో ఉండటం తనకు కలిసొచ్చే అంశంగా పవన్ భావిస్తున్నారు.
గాజువాక పారిశ్రామిక ప్రాంతం కావడంతో.. వామపక్షాల పొత్తు కార్మిక వర్గ ఓటు బ్యాంకును సొంతం చేసుకోవచ్చని భావిస్తున్నారు. అలాగే భీమవరంలో 2004 నుంచి వరుసగా మూడుసార్లు కాపు అభ్యర్థులే ఇక్కడ విజయం సాధిస్తూ వస్తున్నారు. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత ఇక్కడ కాపుల హవా మొదలైందని చెబుతారు. ఈ నేపథ్యంలోనే గాజువాకతో పాటు భీమవరం నుంచి పోటీకి పవన్ మొగ్గుచూపుతున్నట్టు తెలుస్తోంది.
మొత్తం మీద పవన్ పోటీకి సంబంధించి ఎప్పటినుంచో జరుగుతున్న చర్చోపచర్చలకు మరికాసేపట్లో ఫుల్ స్టాప్ పడనుంది. కాగా, పోటీ విషయంలో పవన్ కల్యాణ్ అన్న చిరంజీవినే అనుసరిస్తుండటం గమనార్హం. 2009 ఎన్నికల్లో పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు, తిరుపతి నుంచి చిరంజీవి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో పాలకొల్లులో ఓడిపోయిన ఆయన తిరుపతిలో గెలిచారు.ఇదిలా ఉంటే, తాజా ఎన్నికల్లో బీఎస్పీ, వామపక్షాల పొత్తుతో జనసేన బరిలో దిగుతున్న సంగతి తెలిసిందే.పొత్తులో భాగంగా బీఎస్పీకి 21 శాసనసభ, 3 లోక్‌సభ స్థానాలు కేటాయించారు. సీపీఐ, సీపీఎంలకు ఏడేసి చొప్పున అసెంబ్లీ, రెండేసి లోక్‌సభ స్థానాలు కేటాయించారు. మిగిలిన స్థానాల్లో జనసేన అభ్యర్థులు పోటీ చేయబోతున్నారు.
General body is in their final discussion from which two constituencies , I should be contesting.
— Pawan Kalyan (@PawanKalyan) March 19, 2019
Hopefully,they will let me know in an hour or later.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Andhra Pradesh Assembly Election 2019, Andhra Pradesh Lok Sabha Elections 2019, Janasena, Lok Sabha Election 2019, Pawan kalyan