ప్రభువు చెంతకు చేరిన ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి: పవన్ కళ్యాణ్ సంతాపం

‘పులి చినలాజర్ కన్నుమూశారని తెలిసి బాధపడ్డాను. రాజధాని కోసం తన భూములు ఇచ్చారు. పేదలు, దళితులకు ఆధారమైన భూములు, లంక భూముల విషయంలో సంబంధిత రైతుల పక్షాన నిలిచి తన గొంతు వినిపించారు.’ అని పవన్ అన్నారు.

news18-telugu
Updated: October 10, 2020, 5:25 PM IST
ప్రభువు చెంతకు చేరిన ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి: పవన్ కళ్యాణ్ సంతాపం
పవన్ కళ్యాణ్ (pawan kalyan)
  • Share this:
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంత పేద, అసైన్డ్ రైతుల పక్షాన నిలిచి పోరాడిన పులి చినలాజర్ కుటుంబానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంతాపం తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధించారు. చినలాజర్‌తో తనకు ఉన్న అనుబంధాన్ని పవన్ కళ్యాణ్ గుర్తు చేసుకున్నారు. ‘పులి చినలాజర్ కన్నుమూశారని తెలిసి బాధపడ్డాను. రాజధాని కోసం తన భూములు ఇచ్చారు. భూములు ఇచ్చిన అసైన్డ్ రైతులకు న్యాయమైన వాటా దక్కాలని పోరాడిన నాయకుడాయన. పేదలు, దళితులకు ఆధారమైన భూములు, లంక భూముల విషయంలో సంబంధిత రైతుల పక్షాన నిలిచి తన గొంతు వినిపించారు. రాజధానిలో బలవంతపు భూసేకరణకు ప్రభుత్వం సిద్ధమైనప్పుడు, అసైన్డ్ రైతులకు సరైన వాటా ఇవ్వడంలేదన్న సందర్భంలో ఆ రైతుల సమస్యలను లాజర్ నా దృష్టికి తీసుకువచ్చారు. సమస్యను విశ్లేషించి, సరైన పరిష్కారం సూచించేవారు. 2018లో లాజర్ స్వగ్రామం ఉద్దండ్రాయునిపాలెంలో ఆయన సమక్షంలోనే ఉగాది వేడుకలు చేసుకున్నాను. అమరావతిలోనే రాజధాని ఉండాలని బలంగా పోరాడుతున్నారు. లాజర్ తుదిశ్వాస విడిచి ప్రభువు చెంతకు చేరారు. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. లాజర్ కుటుంబ సభ్యులకు నా తరఫున, జనసేన పక్షాన ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు... ముఖ్యంగా పేద, దళిత, బడుగు బలహీన వర్గాల రైతులకు న్యాయం జరగాలని తొలి నుంచీ పోరాడిన నాయకుడు లాజర్. 300 రోజులకు చేరిన ప్రస్తుత ఉద్యమాన్ని రాష్ట్రస్థాయిలో బలంగా చేసి అనుకున్నది సాధించినప్పుడు లాజర్‌కు సరైన నివాళి దక్కుతుంది.’ అని పవన్ కళ్యాన్ తన సంతాపం సందేశంలో పేర్కొన్నారు.

అమరావతిలోని ఉద్ధండరాయునిపాలెం గ్రామానికి చెందిన పులి చిన్న లాజర్ అనే రైతు గుండెపోటుతో చనిపోయారు. అమరావతి కోసం చిన్న లాజర్ 15 ఎకరాల భూమి ఇచ్చారు. అమరావతి అసైన్డ్ భూముల సొసైటీ అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని గత కొన్ని రోజులుగా ఉద్యమం జరుగుతోంది. ఈ ఉద్యమంలో చిన్న లాజర్ కూడా పాల్గొన్నారు. చిన్న లాజర్ మృతికి పలువురు రైతులు, రైతు సంఘాల నేతలు సంతాపం తెలిపారు. మరోవైపు మూడు రోజుల క్రితం ఇంకో రైతు గుండెపోటుతో చనిపోయాడు. అమరావతి తరలిపోతుందన్న మనస్తాపంతో నవులూరు గ్రామానికి చెందిన రైతు నాగమల్లేశ్వరరావు మృతిచెందారు. రాజధాని కోసం నాగమల్లేశ్వరరావు.. 2 ఎకరాల 30 సెంట్ల భూమి ఇచ్చారు. రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలంటూ గత కొద్ది రోజులుగా రైతులంతా ఉద్యమం చేస్తున్నారు.

అమరావతి ఉద్యమం 300 రోజులకు చేరుకుంటోంది. ఈ క్రమంలో ఇద్దరు రైతులు చనిపోవడం రైతుల్లో విషాదం నింపింది. మరోవైపు ఉద్యమాన్ని యధావిధిగా కొనసాగించాలని రైతులు నిర్ణయించారు. ఇక అమరావతి పరిరక్షణ ఉద్యమం 300వ రోజుకు చేరిన సందర్భంగా తెలుగుదేశం మూడు రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించింది.  ఆదివారం ''అమరావతి పరిరక్షణ సంఘీభావ ర్యాలీలు'' జరపనున్నారు. రాత్రి స్కై లాంతర్ల ద్వారా నిరసన దీపాలు వెలిగించనున్నారు.  సోమవారం ఉదయం ఎమ్మార్వో ఆఫీసుల ముందు ప్రదర్శనలు నిర్వహించాలని టీడీపీసూచించింది. ఆందోళనల్లో పాల్గొనేవాళ్లు కోవిడ్ నిబంధనలు తప్పకుండా పాటించాలని చెప్పింది.
Published by: Ashok Kumar Bonepalli
First published: October 10, 2020, 5:07 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading