తెలంగాణలో మరో పార్టీ ఆవిర్భవించింది. YSRTP అంటూ వైఎస్ వారసురాలిగా తెలంగాణ రాజకీయాల్లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు వైఎస్ షర్మిల. అది కూడా మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా పార్టీ పేరు, జెండా, అజెండాను కూడా ఆవిష్కరించారు. పార్టీని ప్రకటించిన వెంటనే తన లక్ష్యాలు ఏంటో స్పష్టంగా చెప్పారు. అజెండాగా త్రిబుల్ "ఎస్" ఫార్ములాను ప్రకటించారు. ఇందులో సంక్షేమం, స్వయం సమృద్ది, సమానత్వం అనే అజెండాను ప్రకటించారు. మహిళలకు యాబై శాతం రిజర్వేషన్లు, బీసీ ఎస్సీ, ఎస్టీలను రాజకీయంగా , ఆర్థికంగా అభివృద్దిపథంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పార్టీ పోరాటం చేస్తానని మాట ఇస్తున్నని ఆమె ప్రకటించారు. హైదరాబాద్‌లోని జెఎస్ఆర్ కన్వెషన్లలో ఏర్పాటు చేసిన సభలో ఆమె పార్టీ జెండాను అవిష్కరించారు. అయితే ఆమె పార్టీపై దాదాపు అన్ని రాజకీయా పార్టీలు గతంలోనే స్పందించాయి.. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం లేటు గా స్పందించారు. షర్మిల పార్టీతో పాటు, కాంగ్రెస్ టీపీసీసీ కొత్త చీఫ్ పైనా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు జనసేన అధినేత పవన్..
ఏపీ పర్యటన ముగించుకుని తిరిగి హైదరాబాద్ చేరుకున్న ఆయన షర్మిల పార్టీపై స్పందించారు. వైఎస్ షర్మిల పార్టీకి స్వాగతం చెబుతున్నాను అన్నారు. ప్రజాస్వామ్యంలో మరెన్నో పార్టీలు రావాలని కోరుకుంటున్నాను అన్నారు పవన్. ఉద్యమ, చైతన్య స్ఫూర్తి కలిగిన యువత రాజకీయాల్లోకి రావాలని ఆయన పిలుపునిచ్చారు. అలాగే వారసత్వ రాజకీయాలు.. తెలంగాణలో పార్టీ బలోపేతంపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇదీ చదవండి: తెలంగాణలో షర్మిల పార్టీపై జగన్ పరోక్ష స్పందన.. ఆయన ఏమన్నారంటే..?
అందరిలా తాను పగటి కలలు కనే వ్యక్తిని కాదని పరోక్షంగా షర్మిలపై విమర్శలు చేశారు. తనకు రాజకీయ వారసత్వం చేతకాదన్నారు. అలాగే తెలంగాణలో పార్టీ బలోపేతం చేయాలని అనుకున్నా.. తనకు డబ్బు బలం లేదంటూ ఆయన అభిప్రాయం వ్యక్తంచేశారు. ఇటు రేవంత్ రెడ్డిపై స్పందించమని మీడియా కోరగా.. రేవంత్ రెడ్డికి టీపీసీసీ పదవి ఇచ్చారని విన్నాను అంటు సైలెంట్ గా వెళ్లిపోయారు. తజాగా పవన్ వ్యాఖ్యలు చూస్తే ఆయన పార్టీ కేవలం ఏపీకి మాత్రమే పరిమితమయ్యే అవకాశం కనిపిస్తోంది. తెలంగాణలో పార్టీ బలోపేతం చేసే అంత డబ్బు తన దగ్గర లేదని క్లారిటీ ఇచ్చారని ప్రచారం జరుగుతోంది. ఏపీలో బీజేపీతో పొత్తు పెట్టుకున్న ఆయన.. తెలంగాణలో మాత్రం బీజేపీతో కలిసి వెళ్లడానికి ఇష్టపడడం లేదు. అందుకే ఈ వ్యాఖ్యలు చేశారా అని కొందరు అనుమానిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.