అప్పటి వరకు జగన్ రెడ్డి అనే అంటా.. పవన్ కళ్యాణ్ కామెంట్స్...

‘జగన్ రెడ్డి సీఎంలా మాట్లాడితే ముఖ్యమంత్రి అని సంభోదిస్తా. కొంతమందికే సీఎంలా ప్రవర్తిస్తే పేరు పెట్టే పిలుస్తా. ఆయనకు బత్తాయి చెట్లు నరికే ధైర్యం ఉంది గానీ ప్రత్యేకహోదా అడిగే ధైర్యం లేదు.’ అని పవన్ కళ్యాణ్ అన్నారు.

news18-telugu
Updated: December 1, 2019, 9:58 PM IST
అప్పటి వరకు జగన్ రెడ్డి అనే అంటా.. పవన్ కళ్యాణ్ కామెంట్స్...
రైల్వే కోడూరులో పవన్ కళ్యాణ్ పర్యటన
  • Share this:
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శలు గుప్పించారు. రాయలసీమ పర్యటనలో భాగంగా జగన్ మోహన్ రెడ్డి సొంత జిల్లా కడపలోని రైల్వే కోడూరులో రైతులతో పవన్ కళ్యాణ్ సమావేశం అయ్యారు. వారి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మీద విమర్శల వర్షం కురిపించారు. ‘జగన్ రెడ్డి సీఎంలా మాట్లాడితే ముఖ్యమంత్రి అని సంభోదిస్తా. కొంతమందికే సీఎంలా ప్రవర్తిస్తే పేరు పెట్టే పిలుస్తా. ఆయనకు బత్తాయి చెట్లు నరికే ధైర్యం ఉంది గానీ ప్రత్యేకహోదా అడిగే ధైర్యం లేదు. ప్రజా సమస్యలను కేంద్రం ముందుకు తీసుకెళ్లే ధైర్యం లేనప్పుడు 22 మంది ఎంపిలు ఉండి ఏం ప్రయోజనం? పసుపు రైతుకు న్యాయం చేయలేరు. వారికి కోల్డ్ స్టోరేజీలు కట్టించలేరు గానీ భారతీ సిమెంట్స్ లాంటివి కట్టుకుంటారు. రాయలసీమకు ఉక్కు కర్మాగారం కావాలన్న డిమాండ్ ఉంటే, జగన్ రెడ్డి పీఎంఓకు వెళ్లి అణుశుద్ధి
కర్మాగారం అడుగుతున్నారు. ఓ పక్క తుమ్మలపల్లి యురేనియం కర్మాగారంతో చుట్టుపక్కల ఆరేడు గ్రామాల ప్రజలు అనారోగ్య సమస్యల బారినపడుతుంటే ఆయన అదే కర్మాగారం కావాలని కోరుకుంటున్నారు. దాని వల్ల ఆయనకు ఏం కాంట్రాక్టులు వస్తాయో తెలియదు. తమ వారికి ఏం కాంట్రాక్టులు వస్తాయో తెలియదు. పోతే జనమే పోతారన్న చందంగా ఉంది వీరి పద్దతి. త్వరలోనే తుమ్మలపల్లి వచ్చి యురేనియం బాధితులు పడుతున్న ఇబ్బందులు తెలుసుకుంటా.’ అని పవన్ కళ్యాణ్ అన్నారు.

రాష్ట్రంలోని రైతుల సమస్యలపై ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాస్తానని పవన్ కళ్యాణ్ చెప్పారు. చెట్లు నరికే వాళ్లకి, ఆడబిడ్డలను ఉరి తీసి చంపే వాళ్లని వెనకేసుకొస్తున్న వాళ్లకి పతనం మొదలైందని హెచ్చరించారు. జనసేన కార్యకర్తల మీద దాడులు చేస్తే చేతులు కట్టుకుని చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు.

‘హైదరాబాద్ లో చోటు చేసుకున్న ఘటన బాధాకరం. 2017లో కర్నూలులోని కట్టమంచి రామలింగారెడ్డి రెసిడెన్షియల్ స్కూళ్లో తమ కూతురిపై అత్యాచారం చేసి హత్య చేశారని ఒక తల్లి చెబితే కళ్ల వెంబడి నీళ్లు వచ్చాయి. ఆ కేసును జగన్ రెడ్డి ఎందుకు బయటికి తీయడం లేదు. వాళ్లను ఎందుకు కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. పోలీసులు ఏంచేస్తున్నారక్కడ... వాళ్లకు లేరా ఆడబిడ్డలు, రాజకీయ నాయకులకు లేరా ఆడబిడ్డలు.. ఆ ఆడబిడ్డను చంపేసిన వెధవలకు లేరా ఆడబిడ్డలు... అడిగేవాళ్లు లేరా?.’ అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు.

First published: December 1, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>