ఆంధ్రప్రదేశ్‌లో జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీల మధ్య బీటలు వారినట్టు కనిపిస్తోంది. రెండు పార్టీల మధ్య ఆల్ ఈజ్ నాట్ వెల్ అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. సాక్షాత్తూ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలే అందుకు నిదర్శనం. తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక నేపథ్యంలో పవన్ కళ్యాణ్ అక్కడ పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో తిరుపతిలోనే జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం జరిగింది. ఆ సమావేశంలో పవన్ కళ్యాణ్ హాట్ కామెంట్స్ చేశారు. బీజేపీ కేంద్ర నాయకత్వం జనసేన పార్టీకి ఇస్తున్న ప్రాధాన్యం రాష్ట్రంలో బీజేపీ నాయకత్వం ఇవ్వడం లేదని అన్నారు. ‘బీజేపీ కేంద్ర పెద్దలు ఇస్తున్నంత మర్యాద రాష్ట్రంలో బీజేపీ నాయకులు జనసేనకు ఇవ్వడం లేదని పీఏసీలో నేతలు అంటున్నారు. కలసి ప్రయాణం చేయాలంటే చిన్న చిన్న తప్పులు సరిదిద్దుకుని ముందుకు వెళ్లాలి. ఈ విషయాన్ని ఢిల్లీ పెద్దలకు కూడా చెప్పా. వాళ్లు చెబితే ఇక్కడ నేతల తీరు మారుతుందని ఆశిస్తున్నా.’ అని పవన్ కళ్యాన్ వ్యాఖ్యానించారు. బీజేపీ అగ్రనాయకత్వానికి ఉన్నంత అవగాహన, ఇక్కడ రాష్ట్ర నాయకత్వంలో కనిపించడం లేదని పవన్ కళ్యాణ్ అన్నారు.
తిరుపతి ఉప ఎన్నికల్లో ఎవరు పోటీ చేయాలనేదానిపై ఇప్పటికే ఓ క్లారిటీకి వచ్చామని, మరో వారంలో దీనిపై ప్రకటన ఉండొచ్చని పవన్ కళ్యాణ్ అన్నారు. ‘తిరుపతిలో ఎవరు పోటీ చేయాలనే అవగాహనకు వచ్చాం. ఇంకా రెండు సార్లు సిట్టింగ్ వేస్తాం. హైదరాబాద్, మంగళగిరి ఢిల్లీలో కూర్చుని మాట్లాడతాం. జనసేన అభ్యర్థి పోటీ చేస్తే తిరుపతిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తా.’ అని పవన్ కళ్యాణ్ అన్నారు.
తిరుపతి ఉప ఎన్నికలకు సంబంధించి బీజేపీ జనసేన మధ్య తీవ్ర పోటీ నడుస్తోంది. తామే పోటీ చేస్తామని బీజేపీ చెబుతోంది. తాము జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మద్దతు ఇచ్చాం కాబట్టి తమకు ఆ సీటు ఇవ్వాలని జనసేన ఒత్తిడి చేస్తోంది. ఈ క్రమంలో రెండు పార్టీల మధ్య ఏర్పాటు చేసిన సయోధ్య కమిటీ ఇంకా ఏమీ తేల్చలేదు. ఈ క్రమంలోనే రాష్ట్ర బీజేపీ నాయకులు తిరుపతిలో పర్యటించిన సమయంలో అక్కడ బీజేపీ పోటీ చేస్తుందని ప్రకటించడం జనసేనను ఇరుకున పెడుతోంది. ముందుగా అనుకున్నట్టు కమిటీలో చర్చించి ఆ తర్వాత నిర్ణయాన్ని ప్రకటించాలి కానీ, ఇలా బీజేపీ అభ్యర్థి పోటీ చేస్తారని నాయకులు ప్రకటిస్తే ఇక కమిటీలు ఎందుకు? అనే అభిప్రాయం జనసేన పార్టీలో వ్యక్తం అయింది.
రాష్ట్రంలో బీజేపీ, జనసేన పార్టీల మధ్య పొత్తు ఉన్నా కూడా రెండు పార్టీలు కలసి ఇంతవరకు ఒక్క ప్రోగ్రాం కూడా చేయలేదు. రెండు పార్టీలు వేర్వేరుగానే తమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఇటీవల పవన్ కళ్యాణ్ తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించినప్పుడు కూడా బీజేపీ నుంచి పెద్దగా మద్దతు రాలేదు. అదే సమయంలో పవన్ కళ్యాణ్ మీద అధికార వైసీపీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నా కూడా బీజేపీ నుంచి కనీసం ఒక్కరు కూడా ఖండించలేదనే అభిప్రాయాన్ని తిరుపతి పీఏసీ సమావేశంలో జనసేన నేతలు అభిప్రాయం వ్యక్తం చేశారు. మోదీపై ఎవరైనా విమర్శలు చేస్తే జనసేన ఖండిస్తున్నప్పుడు పవన్ కళ్యాణ్‌కు బాసటగా నిలవాల్సిన బాధ్యత, పొత్తు ధర్మాన్ని కూడా రాష్ట్ర బీజేపీ నాయకులు పాటించడం లేదనే అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ నేరుగా ఈ విషయాన్ని చెప్పకుండా పీఏసీ సభ్యులు అంటున్నారనే మాట ద్వారా తాను చెప్పాలనుకున్నది చెప్పారు.
Published by:Ashok Kumar Bonepalli
First published:January 22, 2021, 06:59 IST