HOME »NEWS »POLITICS »pawan kalyan calls for chalo assembly warns ap cm ys jaganmohan reddy over farmers relief aid ba

‘ఆ తర్వాత గొడవలైతే మాకు సంబంధం లేదు’ సీఎం సాబ్ అంటూ జగన్‌కు వకీల్ సాబ్ హెచ్చరిక

‘ఆ తర్వాత గొడవలైతే మాకు సంబంధం లేదు’ సీఎం సాబ్ అంటూ జగన్‌కు వకీల్ సాబ్ హెచ్చరిక
గుడివాడలో పవన్ కళ్యాణ్

పేకాట క్లబులు నడుపుతున్నంత సమర్ధవంతంగా ప్రజల అవసరాలను తీర్చడంలో వైసీపీ ప్రజాప్రతినిధులు విఫలమయ్యారని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ విమర్శించారు.

  • Share this:
    ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అల్టిమేటం జారీ చేశారు. నివర్ తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతుల ఖాతాల్లో వెంటనే రూ.10వేలు జమ చేయాలని డిమాండ్ చేశారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లోపు నష్ట పరిహారం కింద ఎకరానికి రైతులకు రూ.35వేలు చెల్లించకపోతే అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఆ తర్వాత జరిగే పరిణామాలకు తమకు సంబంధం లేదన్నారు. నివర్ తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలని కోరుతూ జనసేన ఆధ్వర్యంలో అన్ని జిల్లాల్లో కలెక్టరేట్ల వద్ద ఆ పార్టీ కార్యకర్తలు నిరసనలు తెలుపుతున్నారు. పవన్ కళ్యాణ్ స్వయంగా కృష్ణా జిల్లా కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్లారు. ఈ సందర్భంగా గుడివాడలో పవన్ కళ్యాణ్ హాట్ హాట్ కామెంట్లు చేశారు.

    ‘గుడివాడ నడిబొడ్డున నిలబడి చెబుతున్నా. అంతిమ శ్వాస వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి అండగా నిలబడతా. సినిమాలు చేస్తూ ఏం రాజకీయాలు చేస్తారని కొందరు మాట్లాడుతున్నారు. పేకాట క్లబులు నడిపి మీరు రాజకీయం చేయగా లేనిది నిజాయితీగా సినిమాలు చేసుకుంటూ నేను రాజకీయాలు చేయకూడదా? సిమెంటు ఫ్యాక్టరీలు, మైనింగ్ సంస్థలు, మీడియా సంస్థలు నడిపి మీరు రాజకీయం చేస్తుంటే... సినిమాలు చేసుకుంటూ మేమెందుకు రాజకీయాలు చేయకూడదు? ఎంతసేపూ మీరంటున్న మాటలు పడుతూ, మీ కిందే ఊడిగం చేయాలా? ఆ రోజులు పోయాయి. ఎదురు తిరిగే రోజులు వచ్చాయి. చొక్కా పట్టుకొని నిలదీసే రోజులివి జాగ్రత్తగా ఉండండి.’ అని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు.



    ‘సీఎం సాబ్‌కి చెబుతున్నా. ముందు రూ.10వేలు విడుదల చేయండి. వచ్చే అసెంబ్లీ సమావేశాల లోపు రూ.35వేలు విడుదల చేయకపోతే మీరు అసెంబ్లీ ముట్టడికి సిద్ధం కండి. అక్కడ గొడవలు అవుతాయా? ఏం అవుతాయా? అక్కడ మీరు చూసుకోండి. మేం రాష్ట్రం నలుమూలల నుంచి రైతులను తీసుకొస్తాం. నిరుద్యోగంతో ఉన్న యువత కదలిరండి. ఎందుకు ఉద్యోగాలు ఇవ్వరు. తేల్చుకుందాం. మనిషికో మాట. గొడ్డుకో దెబ్బ. అయ్యా, బాబూ అంటే మాన వినడం లేదు. అందుకే రోడ్డుమీదకు వస్తాం. అసెంబ్లీని ముట్టడిస్తాం. అందుకు రెడీగా ఉండండి.’ అని పవన్ కళ్యాణ్ వైసీపీ ప్రభుత్వానికి హెచ్చరిక పంపారు.



    పేకాట క్లబులు నడుపుతున్నంత సమర్ధవంతంగా ప్రజల అవసరాలను తీర్చడంలో వైసీపీ ప్రజాప్రతినిధులు విఫలమయ్యారని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ విమర్శించారు. ఓడిపోయాక భయపడిపోతాం, పారిపోతాం అని కొందరు భ్రమ పడుతున్నారు. ఆశయం ఉన్నవాడికి ఓటమి ఉండదు, ముందడుగే ఉంటుందని అన్నారు. ప్రజాప్రతినిధులు ఎవరైనా బాధ్యతగా వ్యవహరించకపోతే, వాళ్లు ఏ స్థాయి వ్యక్తులైనా రోడ్ల మీదకు తీసుకురాగల సత్తా జనానికి ఉందని స్పష్టం చేశారు. ప్రజలను భయపెట్టి పాలిద్దాం అంటే సహించడానికి ఎవరూ సిద్ధంగా లేరని అన్నారు.
    Published by:Ashok Kumar Bonepalli
    First published:December 28, 2020, 16:27 IST

    टॉप स्टोरीज