news18-telugu
Updated: November 15, 2020, 3:28 PM IST
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్(ఫైల్ పొటో)
జనసేన క్రీయాశీలక సమావేశాలు మంగళగిరిలోని ఆ పార్టీ కార్యాలయంలో రెండు రోజుల పాటు జరగనున్నాయి. నవంబర్ 17, 18 తేదీల్లో జరిగే ఈ సమావేశాల్లో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పాల్గొంటారు. ఇచ్ఛాపురం, రాజోలు, మంగళగిరి, నెల్లూరు రూరల్, అనంతపురం నియోజకవర్గాలలో క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం విజయవంతంగా పూర్తైన నేపథ్యంలో ఈ నెల 17న ఉదయం 11 గంటలకు ఆ అయిదు నియోజకవర్గాల సమీక్ష సమావేశం నిర్వహించనున్నట్టుగా జనసేన పార్టీ పత్రికాప్రకటన విడుదల చేసింది. క్రియాశీలక సభ్యులకు పార్టీ అందిస్తున్న ఇన్యూరెన్సు సౌకర్యానికి సంబంధించిన ధ్రువపత్రాలను కొందరు సభ్యులకు పవన్ కల్యాణ్ అందజేయనున్నారు. అదే రోజు మధ్యాహ్నం మూడు గంటలకు తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల ముఖ్య నేతలతో సమావేశం జరగనుంది.
ఇక, మరుసటి రోజు ఉదయం 10 గంటలకు అమరావతి పోరాట సమితి నేతలు, అమరావతికి చెందిన కొందరు మహిళా రైతులతో పవన్ కల్యాణ్ భేటీ కానున్నారు. మరో 32 నియోజవర్గాల్లో జనసేన క్రియాశీలక సభ్యత్వం ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించి 32 నియోజవర్గాల ఇంచార్జ్‌లతో ఉదయం 11 గంటలకు సమావేశం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా జనసేన సభ్యత్వ నమోదు కోసం ఐటీ విభాగం రూపొందించిన యాప్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌ను పరిశీలించనున్నారు. ఈ రెండు సమావేశాల్లో జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదేండ్ల మనోహర్, పార్టీ ముఖ్య నాయకులు పాల్గొంటారని ఆ పార్టీ పేర్కొంది.
ఇక, ఓ వైపు తాను అంగీకరించిన సినిమా షూటింగ్‌ల్లో పాల్గొంటున్న పవన్ కల్యాణ్.. మరోవైపు పార్టీ వ్యవహారాలపై కూడా దృష్టి సారిస్తున్నారు. ముఖ్యమైన సంఘటనపై స్పందించడంతో పాటు... షూటింగ్ గ్యాప్‌లో కూడా పలువురు జనసేన నాయకులతో భేటీ అవుతున్నారు.
Published by:
Sumanth Kanukula
First published:
November 15, 2020, 3:28 PM IST