బీజేపీ నేతలపై పవన్ కళ్యాణ్ అసంతృప్తి... ఆ వ్యాఖ్యల ఉద్దేశం ఏంటి?

ఏపీ సీఎం జగన్ విషయంలో పవన్ కళ్యాణ్ దూకుడుగా వెళ్తున్నారు. బీజేపీతో కలసి ఉమ్మడి పోరాటాలు చేయాలని భావించినా.. రెండు పార్టీలు కలసి ఇంతవరకు ఒక్క కార్యక్రమం చేపట్టలేదు.

news18-telugu
Updated: February 15, 2020, 4:41 PM IST
బీజేపీ నేతలపై పవన్ కళ్యాణ్ అసంతృప్తి... ఆ వ్యాఖ్యల ఉద్దేశం ఏంటి?
పవన్ కళ్యాణ్ (twitter/Pawan Kalyan)
  • Share this:
జనసేన అధినేత పవన్ కళ్యాన్ బీజేపీ మీద అసంతృప్తితో ఉన్నారా? ఆయన వ్యాఖ్యలు చూస్తుంటే ప్రస్తుతం అలాగే అనిపిస్తోంది. అమరావతిలోని గ్రామాల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడుతూ బీజేపీ నేతల తీరును తప్పుపట్టారు. ‘ఢిల్లీలోని బీజేపీ నేతలు, రాష్ట్రంలోని బీజేపీ నేతలు మాట్లాడేదానికి సంబంధం లేదు. వారిద్దరి మధ్య మాటల వైరుధ్యాన్ని నేను బీజేపీ హస్తిన పెద్దల దృష్టికి తీసుకెళ్లా. అమరావతికి కట్టుబడి ఉన్నామని బీజేపీ నేతలు చెప్పారు. రాజధాని అనేది రాష్ట్రం ఇష్టమే. కానీ, దానికి కేంద్రం మద్దతు ఉందనే వైసీపీ ప్రచారాన్ని నమ్మొద్దు. అలా నమ్మి ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాలను నిందించొద్దు. బీజేపీతో మాట్లాడి త్వరలో లాంగ్ మార్చ్ చేస్తా.’ అని పవన్ కళ్యాణ్ ప్రకటించారు.

పవన్ కళ్యాణ్, కన్నా లక్ష్మీనారాయణ


రాష్ట్రం భవిష్యత్ కోసం అమరావతి రైతులు చేసిన త్యాగం వెలకట్టలేనిదని పవన్ కళ్యాణ్ అన్నారు. అయితే, జగన్ మోహన్ రెడ్డి నమ్మించి గొంతు కోశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ అధికారంలోకి వస్తే రాజధాని మారుస్తానని జగన్ ముందే చెప్పాల్సిందని పవన్ అభిప్రాయపడ్డారు. గతంలో అమరావతి రాజధాని అనే అంశానికి అందరూ ఏకీభవించారని గుర్తు చేశారు. 151 మంది ఎమ్మెల్యేలు గెలవడం వైసీపీ అదృష్టమని, అయితే, దాన్ని ప్రజల్లో అస్థిరత్వానికి గురి చేసేలా వాడకూడదన్నారు. ఇష్టానుసారంగా నిర్ణంయాలు తీసుకోవడం తగదని పవన్ కళ్యాణ్ సూచించారు. వ్యక్తులు, పార్టీల మధ్య పోరును ప్రజల సమస్యగా మార్చేశారని, పోలీసు శాఖను కూడా ఇష్టం వచ్చినట్టు వాడుకుంటున్నారని మండిపడ్డారు.

కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిసిన పవన్ కళ్యాణ్, బీజేపీ నేతలు
రాజధాని అమరావతిలోనే ఉండేలా పోరాటం చేస్తానని పవన్ కళ్యాణ్ భరోసా ఇచ్చారు. ఎవరు వచ్చినా రాకున్నా రాజధాని రైతులకు తాను అండగా ఉంటానని స్పష్టం చేశారు. గత ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలను కొత్త ప్రభుత్వాలు అమలు చేయాల్సిందేనని పవన్ కళ్యాణ్ అన్నారు. ఒకవేళ అమరావతిలో భూముల కొనుగోలుకు సంబంధించి ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగే వారిని శిక్షించాలన్నారు.

చలో అసెంబ్లీ సందర్భంగా పోలీసుల చేతిలో దెబ్బలు తిన్న రైతులతో పవన్ కళ్యాణ్


బీజేపీతో జట్టుకట్టిన తర్వాత రెండు పార్టీలు కలసి విజయవాడలో ప్రకాశం బ్యారేజ్ నుంచి బందర్ రోడ్డు మీదుగా పీడబ్ల్యూడీ గ్రౌండ్స్ వరకు లాంగ్ మార్చ్ చేయాలని తొలుత భావించారు. కానీ, అది వాయిదా పడింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ సొంతంగా అమరావతిలో పర్యటిస్తున్నారు. అయితే, ఆయన వ్యాఖ్యల ఉద్దేశం ఏంటనేది ఆసక్తికరంగా మారింది. అమరావతికి అండగా ఉంటామని చెబుతున్న బీజేపీ నేతలు తాను చేపట్టిన యాత్రకు ప్రత్యక్షంగా మద్దతు పలకకపోవడంతో ఈ వ్యాఖ్యలు చేశారా అనే అభిప్రాయం రాజకీయవర్గాల్లో కలుగుతోంది.
First published: February 15, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు